Share News

AP Politics: జగన్‌కు ఇప్పుడంతా ‘రివర్స్‌’.. ఫోన్లు చేసినా.. దూతలను పంపినా బేఖాతర్‌!

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:31 AM

సీఎం జగన్మోహన్‌రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సర్వేల పేరుచెప్పి తమకు టికెట్లు నిరాకరించడంపై రగిలిపోతున్న వారు పక్కచూపులు చూస్తున్నారు.

AP Politics: జగన్‌కు ఇప్పుడంతా ‘రివర్స్‌’.. ఫోన్లు చేసినా.. దూతలను పంపినా బేఖాతర్‌!

  • ఎమ్మెల్యేల స్వరమే కాదు.. చూపూ మారుతోంది

  • సీఎంపై వీర విధేయుల విమర్శలు

  • అపాయింట్‌మెంట్‌ అడిగినోళ్లే

  • ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదు

  • దూతలను పంపినా బేఖాతర్‌

  • రాజశేఖర్‌రెడ్డి కొడుకన్నఅభిమానంతో వచ్చాం..

  • పడిన అవమానాలు చాలు

  • మాటపై నిలబడడానికి అందరూ వైఎస్‌లు కాలేరని ఎద్దేవా

  • కాంగ్రెస్‌ గూటికి వెళ్తామనిముఖంపైనే చెబుతున్న వైనం

పోలవరం నుంచి రాజధాని అమరావతి విధ్వంసం దాకా సీఎం జగన్‌ తీసుకున్నవన్నీ రివర్స్‌ నిర్ణయాలే! ఎన్నికలకు ముందు జగన్‌ అందరినీ అన్నా అన్నా అంటూ కౌగిలించుకున్నారు.. తీరా గద్దెనెక్కాక వారందరినీ దూరంపెట్టారు. ఎమ్మెల్యేలను పూచికపుల్లల్లా తీసివేశారు. ఎవరో కొద్ది మంది సన్నిహితులను తప్ప.. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తాడేపల్లి ప్యాలెస్‌ లోపలికే రానివ్వలేదు. నాలుగున్నరేళ్లుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా ఆయన దర్శనభాగ్యం దొరకని ఎమ్మెల్యేలు ఎందరో! ఇప్పుడు వారికి టైమొచ్చింది. ఇన్నాళ్లూ టీడీపీ-జనసేన తప్ప వారికి ప్రత్యామ్నాయం లేకపోయింది. అక్కడ టికెట్‌ వచ్చే అవకాశం లేక వైసీపీలోనే కొనసాగాలనుకున్నారు. ఇప్పుడు జగన్‌ చెల్లెలు షర్మిల కాంగ్రెస్‌ పగ్గాలు స్వీకరించే అవకాశాలు ఉండడంతో.. జగన్‌ నిరాదరించిన వారంతా ఆ పార్టీపై కన్నేశారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సర్వేల పేరుచెప్పి తమకు టికెట్లు నిరాకరించడంపై రగిలిపోతున్న వారు పక్కచూపులు చూస్తున్నారు. టీడీపీలో చాన్సు లేకపోతే కాంగ్రెస్‌ రూపంలో ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. పైగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ పగ్గాలు చేపడతారన్న వార్తలతో అత్యధికులు అటే చూస్తున్నారు. దీంతో జగన్‌ శిబిరం కలవరపడుతోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని.. పార్టీని వీడి వెళ్లొద్దని ఫోన్లు చేస్తున్నారు. రాయబారాలూ నడుపుతున్నారు. అయితే నాలుగున్నరేళ్లుగా తమ ముఖమే చూడని సీఎం నుంచి.. ఇప్పుడు స్వయంగా ఫోన్లు వస్తున్నా వారు స్పందించడం లేదు. వచ్చిన దూతలతో.. ఇన్నాళ్లూ పడిన అవమానాలు చాలని ముఖంపైనే చెప్పేస్తున్నారు. ‘వైఎ్‌సపై అభిమానంతో జగన్‌ వెంట వచ్చాం.. ఇన్నాళ్లూ మాకు టీడీపీ, జనసేనలోకి దారిలేదని హీనంగా చూశారు.. ఇప్పుడు కాంగ్రెస్‌ దారి దొరికింది..’ అని అంటున్నారు. కొందరు అధికారులు కూడా క్రమంంగా దూరం జరుగుతున్నారు. సినిమా వాళ్లను పిలిచినా వచ్చే పరిస్థితి లేదు.. ఆఖరికి ఆటగాళ్లు కూడా నిష్క్రమిస్తున్నారు. జగన్‌కు ఏమైనా చెప్పడానికి కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు భయపడతారు. అలాంటిది అంగన్వాడీలు, పురపాలికల పారిశుద్ధ్య కార్మికులు ఆయన్నే భయపెడుతున్నారు.

ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. ఈ పరిణామాలకు తోడు సొంత చెల్లి తన ఓట్లకు గండికొట్టేందుకు సిద్ధమవడం, ఆమెకు కన్నతల్లి బాసటగా నిలవడంతో జగన్‌ ఉక్కిరిబిక్కిరవుతున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టు, మద్యపాన నిషేధం.. ఏటా జాబ్‌ కేలెండరు, భారీ డీఎస్సీ.. గద్దెనెక్కిన వారంలోగా ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు.. వంటి అనేక హామీలిచ్చాడు. అధికారంలోకి రాగానే మాట మార్చారు.. మడమా తిప్పారు.. కరెంటు చార్జీల పెంపు, పెట్రో ధరలపై బాదుడు, చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంపు వంటివాటితో జనం నడ్డి విరిచారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేశారు.. ఇప్పుడు తాడేపల్లి ప్యాలె్‌సలో ఒంటరయ్యారు. ఒకప్పుడు అందరితో విభేదించి ఆయన కోసం వచ్చిన వారు ఇప్పుడు దండం పెట్టేసి వెళ్లిపోతున్నారు. ఎన్నికల్లో ఇబ్బంది పెట్టగల సత్తా ఉన్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఫోన్లు ఎత్తడం లేదు. బహిరంగంగానే ఎదురు తిరుగుతున్నారు. అందుకు కారణం మారిన పరిస్థితులే. ఏ వర్గాన్ని కదిపినా జగన్‌ను తిట్టడమే తప్ప.. సంతోషంగా ఉన్నామని పది మందిలో ఇద్దరు కూడా చెప్పలేదు. చంద్రబాబు అరెస్టు, జనసేనతో పొత్తు, పొరుగు రాష్ట్రంలో కేసీఆర్‌ ఓటమి, కాంగ్రె్‌సలో చేరిన షర్మిల.. రోడ్డెక్కిన ఉద్యోగులు, విద్యుత్‌ ఇతర బాదుడుతో రగిలిపోతున్న సామాన్యులను గమనించిన వైసీపీ నేతలు.. ‘జగనా.. నీకో దండం’ అంటున్నారు.

మాట్లాడే ప్రసక్తే లేదు..

వైఎ్‌సపై అభిమానంతో ఆయన కుమారుడిని నమ్మి వైసీపీలో చేరాం.. కష్టకాలంలోనూ జగన్‌ వెంట నడిచాం.. అధికారంలోకి వచ్చాక ఒక్క పని చేయకున్నా భరించాం.. సకల శాఖల మంత్రి నుంచి ఏ ఆదేశం వచ్చినా శిరసావహించాం.. పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్లి ప్రజలతో తిట్లు తిన్నాం.. అయినా ఒక్క నిమిషం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం సమయం ఇవ్వలేరా.? నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చిన చోట అసమ్మతి నేతలకు తాడేపల్లి నుంచి సజ్జల ఫోన్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఫోన్లు ఎత్తడం లేదు. మాట్లాడిన కొందరు మాత్రం.. ‘ఇప్పటి వరకూ హీనంగా చూసి.. ఇప్పుడు గుర్తుకొచ్చామా’ అని నిలదీస్తున్నారు. టికెట్లు ఇవ్వలేని వాళ్లను దూతల ద్వారా ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు. దూతలను వారి వద్దకు పంపి.. వచ్చేది మన ప్రభుత్వమే.. రేపు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇలా కనీసం పది మందికి చెబుతున్నారంటూ పుట్టపర్తి నియోజకవర్గంలోని కడపల మోహన్‌రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. జగన్‌ మాటగా చెబుతున్నామని అనగానే.. ‘మాట మీద నిలబడేందుకు అందరూ వైఎ్‌సఆర్‌లు కాదులే.. నేను టీడీపీకి మద్దతివ్వను.. రాజన్న కుమార్తెతో ఉంటాం’ వారి బదులిచ్చారు.

మూగవోయిన కూలి మీడియా...

వైసీపీకి తిరుగులేదు.. జగన్‌కు ఎదురు లేదంటూ నాలుగేళ్లుగా ఊదరగొట్టిన కూలి మీడియా కొన్ని రోజులుగా మూగబోయింది. తాడేపల్లిలో రోజూ కనిపిస్తున్న దృశ్యాలు, క్షేత్రస్థాయిలో వీస్తోన్న ఎదురు గాలి, సొంత పార్టీ కార్యకర్తలే ఎదురు తిరుగుతున్న తీరు.. తాడేపల్లికి వచ్చే సాహసం కూడా చేయలేని చిన్న ఉద్యోగులు బాహటంగా మండిపడుతున్న దృశ్యాలు వాటి కెమేరాలకు కనిపించట్లేదు. నిన్నటి వరకూ జగన్‌ దేవుడన్న ఎమ్మెల్యేలే ఇప్పుడు బహిరంగంగా తిడుతున్నారు. ఇంటి నిండా ఫొటోలు పెట్టుకుని ప్రతి రోజూ దండం పెట్టుకునే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్లు తాడేపల్లి ప్యాలె్‌సకు వచ్చి.. సీఎం దర్శనం కోసం వారం రోజులు ఎదురుచూస్తే.. సలహాదారుతో టికెట్‌ లేదని చెప్పించారు. ‘ఇంత అవమానం జీవితంలో పడలేదు.. నీకో దండం..’ అని ఆయన చెప్పారు. ఇంట్లో మనిషిలా ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవి వదిలేయడంతో పాటు ఏకంగా పార్టీకే గుడ్‌బై చెప్పారు. దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాస రెడ్డి ఊగిసలాటలో ఉండగా.. ఇటీవలే పార్టీ కండువా వేసుకున్న మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు.. టెస్ట్‌ మ్యాచ్‌ ఆడినన్ని రోజులు కూడా వైసీపీలో ఇమడలేకపోయారు. ఇలా వరుసగా ఒక్కొక్కరు బయటికి వెళ్లిపోతుంటే టీడీపీ, జనసేనతోపాటు కాంగ్రె్‌సలోకి సైతం చేరికలు మొదలయ్యాయి.

Updated Date - Jan 08 , 2024 | 10:46 AM