Share News

ఇప్పుడున్నదంతా మాఫియానే

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:01 AM

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులకు మేలు జరిగేది.

ఇప్పుడున్నదంతా మాఫియానే

పాలనలో వైఎ్‌సతో జగన్‌కు పొంతనెక్కడ?

మద్యనిషేధం, జాబ్‌ కేలెండర్‌ అన్నీ మోసం

అన్నమాట ఒక్కటీ నిలబెట్టుకోని జగన్‌...

ఇప్పుడు ఎన్నికల వేళ సిద్ధం అంటూ బయల్దేరాడు: షర్మిల

ఏలూరు/కొయ్యలగూడెం(ఆంధ్రజ్యోతి), కాకినా డ సిటీ/రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 29: ‘దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులకు మేలు జరిగేది. పేదలకు న్యాయం జరిగేది. ఆ పాలనకు, జగన్‌ పాలనకు పోలిక ఎక్కడ? ఇప్పుడు రాష్ట్రంలో మోసాలు, మాఫియానే నడుస్తోంది’.. అంటూ పీసీసీ చీఫ్‌ షర్మిల గళమెత్తారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో వ్యవసాయం దండగ అయింది. రైతులను ఆదుకునే నాథుడే లేడు. పంట నష్టపరిహారం ఇవ్వడం లేదు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. రైతుకు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకిలా చేస్తున్నారు?’ అంటూ షర్మిల విరుచుకుపడ్డారు. ‘ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసగించారు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ పెట్టాడు. మద్యపాన నిషేధం పేరిట మోసం. జాబ్‌ కేలెండర్‌ అనే మరో మోసం. గతంలో బాబును తిట్టిన జగన్‌, అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు’ అంటూ షర్మిల మండిపడ్డారు. ‘ప్రత్యేక హోదా పేరిట రాష్ర్టాన్ని మోసం చేశారు. జగన్‌ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని తూర్పారబట్టారు. ‘జగన్‌ ఎన్నో హామీలు ఇచ్చారు. పోలవరం ముంపుబాధితులను ఆదుకుంటామన్నారు. ఎకరాకు రూ.10 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పారు. ఎకరం ధర ఇప్పుడు రూ.20లక్షలకు పైగానే ఉంది. జగన్‌ ఇచ్చే పరిహారం సరిపోతుందా? ముంపు బాధితులకు కాలనీలు కట్టిస్తామని మోసం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ జాతీయ హోదా ఇచ్చింది. ఈ పదేళ్లలో ప్రాజెక్టుకు ఒక్క అడుగు కూడా పడలేదు’ అంటూ జగన్‌ పాలనను షర్మిల తప్పుబట్టారు. ‘ఐదేళ్లలో ప్రజలకు ఈ ముఖం చేసిందేమీ లేదు. కానీ ఇప్పుడు సిద్ధం అంటూ బయల్దేరాడు’ అంటూ ఎద్దేవ చేశారు. సీఎం జగన్‌ వైఎ్‌సఆర్‌ వారసుడా లేక దేశ ప్రధాని మోదీకి దత్తపుత్రుడా అని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - Apr 30 , 2024 | 04:47 AM