Share News

ఆర్టీసీకి అడుగడుగునా బ్రేకులే!

ABN , Publish Date - May 30 , 2024 | 02:30 AM

తుక్కు సామానుకు వేయాల్సిన డొక్కు బస్సులకు ఆర్టీసీ పైపై మెరుగులు దిద్ది రోడ్డుపైకి పంపుతోంది.

ఆర్టీసీకి అడుగడుగునా బ్రేకులే!

డొక్కు బస్సులతో కదలని ప్రగతి రథచక్రాలు

2019లో 3,600 కొత్త బస్సులు కొనాలన్న సీఎం జగన్‌

ఐదేళ్లలో పదోవంతూ కొనుగోలు చేయని ఏపీఎ్‌సఆర్టీసీ

1,500 కొత్త బస్సులు వస్తాయంటూ ఏడాదిగా చెబుతున్న ఎండీ

పల్లె వెలుగుకు రూ.25 లక్షల్లేవ్‌.. జగన్‌కు 28 కోట్లతో బస్సులు

ప్రజలపై 2 వేల కోట్ల భారం.. ఖజానాకు ప్రతి నెలా 125 కోట్లు

ప్రయాణికులపై ఏటా చార్జీల భారం.. ఐదేళ్లలో 3 సార్లు పెంపు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తుక్కు సామానుకు వేయాల్సిన డొక్కు బస్సులకు ఆర్టీసీ పైపై మెరుగులు దిద్ది రోడ్డుపైకి పంపుతోంది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. చూడటానికి ఆకారం తప్ప రోడ్డుపై నడవలేని కాలం చెల్లిన బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నా చోద్యం చూస్తోంది. పేదల ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పే జగన్‌ రెడ్డి డొక్కు బస్సులు మార్చరు.. కొత్త బస్సులు కొనుగోలు చేయరు.. కనీసం పాత వాటికి మరమ్మతులు కూడా సరిగా చేయరు.. కానీ ఈ పేదల పక్షపాతి తన ఎన్నికల ప్రచారం కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో అత్యాధునిక వసతులతో ఉండే బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు కొన్నారు. పదవి రాకముందు ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా వెళ్లిన పేదల నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణం కన్నా కాలినడకే మంచిదనే భావన పేదల్లో తీసుకొచ్చారు! సొంత జిల్లా కడపలో ప్రొద్దుటూరు డిపో బస్సు రోడ్డుపై బ్రేకులు ఫెయిలపై పలువురిని ఢీ కొట్టింది. అనంతపురం జిల్లాలో బళ్లారి నుంచి వస్తున్న కళ్యాణదుర్గం డిపోలో కాలం చెల్లిన బస్సు కల్వర్టును ఢీ కొట్టి 20మంది ప్రయాణికుల్ని గాయాపాల్జేసింది. సత్యసాయి జిల్లా పెనుకొండ బస్టాండులో బ్రేకులు ఫెయిలై బస్సు ప్లాట్‌ ఫారమ్‌పైకి ఎక్కింది.


విజయవాడలో గత ఏడాది గుంటూరుకు వెళ్లే బస్సు సృష్టించిన బీభత్సం తెలిసిందే. భీమవరం డిపో బస్సు కండీషన్లో లేదని డ్రైవర్‌ నెత్తీ నోరు బాదుకున్నా కనీసం స్పేర్‌ పార్ట్స్‌ మార్చకుండా రోడ్డుపైకి పంపడంతో వీరవాసం దగ్గర విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని బలి తీసుకుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వార్తలు వినని రోజు లేదు. ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కటంటే ఒక్క పల్లె వెలుగు బస్సు కూడా కొనుగోలు చేయని జగన్‌ రెడ్డి తన ఎన్నికల ప్రచారం కోసం 28కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్టీసీ నుంచి ఐదు బస్సులు కొనుగోలు చేయించారు. అందులో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ కాగా మరో మూడు ఆయన సెద తీరేందుకు కారవాన్లు.. వైసీపీ అధ్యక్షుడగా బహిరంగంగా జనానికి చెప్పే మాటలకు.. ముఖ్యమంత్రిగా జగన్‌ అనుభవించే జీవితానికి.. ఇంత తేడా ఉందా.? అంటూ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా సంస్థకు బస్సులు 55శాతం కాలం చెల్లినవి ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వమూ పెంచనంతగా ప్రయాణ చార్జీలు ఏడాదికి రెండు వేల కోట్లు పెంచేసిన జగన్‌ ఐదేళ్లలో కనీసం 500ల కొత్త బస్సు కొనుగోలు చేయలేదు.

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జున రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమల రావు ఇదిగో కొత్త బస్సులు.. అదిగో కొత్త బస్సులు అని చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే 1500ఛాసీలు కొనుగోలు చేశామని, వాటికి బాడీ కట్టడం పూర్తయ్యాక జనవరిలో రోడ్డెక్కి ప్రయాణికుల్ని సుఖంగా, సురక్షితంగా గమ్యం చేరుస్తాయని పలుమార్లు చెప్పారు. జనవరి కాదు కదా మే దాటిపోతున్నా.. కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నా అతీగతి లేదు. రోజుకు 45లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కాలం చెల్లి ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. బాదుడు సొమ్ముతో కొత్త బస్సులు కొనకుండా వైసీపీ ప్రభుత్వ ఖజానాకు ప్రతినెలా 125 కోట్లకు పైగా ఇస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. ప్రయాణికులకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. రాష్ట్రంలో జూన్‌ 4 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలకు ఉచిత ప్రయాణం వెంటనే అమలు చేస్తే పరిస్థితి ఏంటని ఆర్టీసీ అధికారులు మల్లగుల్లాలవుతున్నారు.

Updated Date - May 30 , 2024 | 02:30 AM