ప్రతి వాగ్దానం నెరవేరుస్తాం
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:18 PM
కడపలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా రెపరెపలాడిందని, తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

20 ఏళ్ల తరువాత కడపలో టీడీపీ జెండా రెపరెపలు
కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి
కడప (ఎర్రముక్కపల్లె), జూన్ 7: కడపలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా రెపరెపలాడిందని, తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ మీద, చంద్రబాబుపై జిల్లా ప్రజల అభిమానం మరువలేనిదన్నారు. శుక్రవారం కడప నగరం ద్వారకానగర్‌లోని వారి నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. 2019లో అన్ని సీట్లు ఓడిపోరునా ఈ ఎన్నికల్లో ఐదుస్థానాల్లో గెలవడం సంతృప్తి ఇచ్చిందన్నారు. జగన్ ఏదో చేస్తాడని ప్రజలు గెలిపిస్తే ఐదేళ్ల పాలనలో చేసింది శూన్యమన్నారు. జగన్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపారన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షం లేకుండా పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం భూకబ్జాలు, ఇసుక మాఫియా దోచుకోవడం తప్ప ఏమీ చేయలేదన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లపాలనలో సొంత జిల్లాకు ఏమీ చేయలేకపోయారన్నారు. నీవు వద్దు జగన్ అంటూ ప్రజలు బైబై చెప్పారన్నారు. అధికారుల ద్వారా ఆస్తులు దోచుకోవడం తప్ప పదేళ్లలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ఏమీ చేయలేదన్నారు. ఓటర్లు కూడా మాట్లాడేందుకు భయపడ్డారన్నారు. ఒక మహిళ తొలిసారిగా పోటీ చేస్తుంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన విషయం గుర్తు చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడమని.. అయితే గంజాయి, బంగారు స్మగ్లర్లు రౌడీలు త్వరగా కడపను వదిలి వెళ్లిపోవాలని హితవు పలికారు. చట్టం ద్వారా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్వేచ్ఛనిస్తామన్నారు. రూ.2,300 కోట్లు తెచ్చి కడపను అభివృద్ధి చేశామని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. సిగ్గు సంస్కారం డబ్బు ఉంటే ఆధారాలు చూపించాలన్నారు. లేకపోతే రాజకీయం నుంచి తప్పుకుంటావా అని సవాల్ చేశారు. కడప నియోజకవర్గ సమస్యలలో ప్రధానమైనది రవీంద్రనగర్‌లో బ్రిడ్జి లేకపోవడం అని.. దీనిని తాము కడతామన్నారు. నీరు పుష్కలంగా ఉన్నా నగరంలో మంచినీటి సమస్య ఉందని, చేసిన వాగ్దానాలకు కట్టుబడి ప్రతి సమస్య త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.