Share News

కోడ్‌ ఉన్నా ‘బొమ్మల’ కొలువే

ABN , Publish Date - Mar 27 , 2024 | 03:01 AM

‘‘పాస్‌ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎమ్‌), ఇతర డాక్యుమెంట్లపై ముఖ్యమంత్రి జగన్‌ సారు బొమ్మలు ఉండాల్సిందే.

కోడ్‌ ఉన్నా ‘బొమ్మల’ కొలువే

జగన్‌ బొమ్మ ఉంచాల్సిందే.. జేసీల భేటీలో ఓ ఉన్నతాధికారి హుకుం

ఈసీకి కనిపిస్తోందా..ఈ బొమ్మల పిచ్చి?

రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లూ జగన్‌ బొమ్మల పండగ నడిపించారు. కుప్పతొట్టి నుంచి రైతులకు ఇచ్చే పాస్‌బుక్‌ వరకు వైసీపీ రంగులు, జగన్‌ ఫొటోలతో నింపి ముఖ్యమంత్రి పట్ల కొందరు ఉన్నతాధికారులు తమ వీరవిధేయతను చాటుకున్నారు. కానీ, ఇప్పుడు ఎన్నికల కోడ్‌ వచ్చేసింది. అయినా.. పాస్‌ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌లపై జగన్‌ బొమ్మలు తీసేయడానికి వీల్లేదని ఓ ఉన్నతాధికారి హుకుం జారీచేయడం జేసీలను, రెవెన్యూ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఆ అధికారి ఆదేశించినట్టు చేస్తే కోడ్‌ వేటుకు బలి కావాల్సి వస్తుందని వారంతా కలవరపడుతున్నారు.

పాస్‌బుక్‌లు, ఎల్‌పీఎమ్‌లపై

ఫొటోలు తొలగించొద్దు

సర్వే పత్రాలపై జగన్‌ పేరు ఉండాల్సిందే

జాయింట్‌ కలెక్టర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి

అది ఈసీ రూల్స్‌కు విరుద్ధమన్న జేసీలు

అయినా ఫొటోలు ఉంచాల్సిందేనని పట్టు

అధికారిక వాట్సప్‌ గ్రూపుల్లోనూ ఆదేశాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘పాస్‌ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎమ్‌), ఇతర డాక్యుమెంట్లపై ముఖ్యమంత్రి జగన్‌ సారు బొమ్మలు ఉండాల్సిందే. వాటిని తొలగించడానికి వీల్లేదు. నవరత్నాల స్కీమ్‌ లోగోను తొలగించవద్దు’’ అంటూ ప్రభుత్వంలో ఓ ఉన్నతస్థాయి అధికారి...జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు హుకుం జారీ చేశారు. తన ఆదేశాలు తూచాతప్పకుండా పాటించాల్సిందేనని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్లు, రెవెన్యూ, సర్వే అధికారులతో ఇటీవల జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌ వేదికగా ఆ ఉన్నతాధికారి తనకు ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న వీర విధేయతను, స్వామిభక్తిని ప్రదర్శించారు. అయితే, ఆయన మాటలు విని జేసీలు, రెవెన్యూ సిబ్బంది అవాక్కయ్యారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున దాని ప్రకారం పనిచేయాలని ఇటీవల ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. వీటిని ఉటంకిస్తూ ఈసీ ఆదేశాలను ప్రతీ అధికారి పాటించాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సాయిప్రసాద్‌ ఇటీవల కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి మార్గదర్శకాలు పంపించారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో అందులో సవివరంగా తెలిపినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు సర్వేలోని ఓ ఉన్నతాధికారికి కూడా వర్తిస్తాయి. అయినా వాటిని లక్ష్యపెట్టకుండా జేసీలతో జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో జగన్‌ బొమ్మలను కొనసాగించాల్సిందేనంటూ హుకుం జారీ చేయడం ఇప్పుడు అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్‌ పట్ల ఆయనకు ఉన్న వీరభక్తితో తమను ఈసీ చర్యలకు బలి చేస్తారేమోనని జేసీలు, రెవెన్యూ అధికారులు భయపడిపోతున్నారు.

కోడ్‌ కాదంటున్నా... రాష్ట్రంలో జరుగుతున్న భూముల సర్వేకు ‘జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’ అని పేరు పెట్టారు. నవరత్నాల్లో భాగంగా దీన్ని ఓ స్కీమ్‌గా పరిగణిస్తున్నారు. భూముల సర్వే అనంతరం రైతులకు ఇస్తున్న భూమి పాస్‌ పుస్తకాలు, సరికొత్తగా తయారుచేస్తున్న భూమి పత్రాలు, ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎమ్‌), ఇతర రికార్డుల్లో జగన్‌, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డితోపాటు, నవరత్నాల లోగోలు ముద్రిస్తున్నారు. నవరత్నాల లోగో మధ్యలో జగన్‌ ఫొటో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కాకుండా పాస్‌పుస్తకంలోని ప్రతి పేజీలో జగన్‌ బొమ్మలు ముద్రించారు. వీటిపై రైతులు చిరాకు పడుతున్నారు. తమ భూమి పత్రాల్లో జగన్‌ ఫొటోలెందుకంటూ రైతులు నిరసన తెలిపారు. కొందరయితే జగన్‌ ఫొటోలున్న పాస్‌పుస్తకాలను ప్రభుత్వ వేదికలపైనే చించివేశారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ వచ్చింది. కాబట్టి ప్రభుత్వం అమలు చేసే స్కీమ్‌లు, కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోలు కొనసాగించడానికి వీల్లేదు. భూమి పత్రాల్లో ఆయన ఫొటోలు ముద్రించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. అలాగే, జగన్‌ పేరుతో సర్వేరాళ్లను ఏర్పాటు చేయడం కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధం. కాబట్టి, రైతులకు కొత్తగా ఇచ్చే పాస్‌ పుస్తకాలు, ల్యాండ్‌ పార్సిల్‌మ్యాప్‌, ఇతర డాక్యుమెంట్లపై జగన్‌ ఫొటోలు ముద్రించకూడదు. జగన్‌ ఫొటో ఉన్న నవరత్నాల లోగోలను కూడా ముద్రించకూడదు. రీ సర్వే పత్రాల్లో జగనన్న పేరు తొలగించి శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష అన్న పదాలే కొనసాగించాలి. ఈసీ ఆదేశాలను పాటించాలని లోగడ సీసీఎల్‌ఏ... జిల్లా కలెక్టర్లు, జేసీలు, రెవెన్యూ యంత్రాంగానికి ఇచ్చిన మార్గదర్శకాల పరమార్థం కూడా ఇదే. ఓ సీనియర్‌ అధికారికి ఈ మాత్రం తెలియదా? గతంలో అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పరిశీలకుడుగా, ఇతర విధుల్లో పాల్గొన్న ఆ ఉన్నతాధికారికి ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఎన్నికల కోడ్‌ అమలు ఎలా ఉంటుందో తెలియని విషయమా? అన్నీ తెలిసి కూడా మరోసారి జగన్‌ దృష్టిలో పడాలని, తనను మించిన వీర విధేయుడు, భజనపరుడు మరొకరు లేరని చాటింపు వేసుకునేందుకే అన్నట్లుగా జగన్‌ ఫొటోల కొనసాగింపు అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చినట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.

అధికారిక వాట్సప్‌ గ్రూపుల్లో ఆదేశాలు

భూముల సర్వే ఫేజ్‌2, ఫేజ్‌ 3 ఎప్పుడు జరిగినా వాటికి సంబంధించిన పాస్‌పుస్తకాలు, ఎల్‌పీఎమ్‌లు ఇప్పుడు ముద్రిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా వాటిపై జగన్‌ ఫొటోలు ముద్రించకూడదు. అయినాసరే వీడియోకాన్ఫరెన్స్‌ వేదికగా ఆ ఫొటోలు తొలగించవద్దంటూ జేసీలను ఆదేశించారు. దీనిపై పలువురు జేసీలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇప్పుడు ముద్రించే పాస్‌పుస్తకాలు, రికార్డులు, ఎల్‌పీఎమ్‌లపై ఫొటోలు ఉండటానికి వీల్లేదని ఆ ఉన్నతాధికారికి స్పష్టం చేశారు. తన మాటకు ఎదురు చెప్పవద్దని, ఫొటోలు కొనసాగించాల్సిందేనని ఆయన గట్టిగా హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఓ జేసీ మాట్లాడుతూ...ఆ పనిచేస్తే తామందరం ఎన్నికల కమిషన్‌ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆ రిస్క్‌ తాము తీసుకోలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశం తర్వాత కూడా ఆ ఉన్నతాధికారి వెనక్కి తగ్గలేదు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ ఉన్నతాధికారి ఆదేశాలంటూ అధికారిక వాట్సప్‌ గ్రూప్‌లకు ఆయన ఆదేశాలను పంపించారు. వాటి సారాంశం, రీ సర్వే కార్యక్రమాలు, పాస్‌పుస్తకాల్లో జగన్‌, నవరత్నాల లోగోలను తొలగించకూడదనేనని చెబుతున్నారు..

జగన్‌ ఫొటోలకు ఆద్యుడే ఆయన

భూముల సర్వే పత్రాలు, రాళ్లపై జగన్‌ ఫొటోలు ముద్రించాలన్న ఆలోచన ఈ ఉన్నతాధికారిదే. జగన్‌ పట్ల తనకున్న విధేయత, భక్తిని చాటు కునేందుకు తొలుత సర్వే రాళ్లపై జగన్‌ ఫొటోలు చెక్కించాలని చూశారు. శాంపిల్‌గా కొన్ని రాళ్లు తెప్పించారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురాగా, ఆయన చర్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సర్వేరాళ్లపై జగన్‌ బొమ్మలు వద్దని సీఎంవో కోరింది. దీంతో ఆ ఉన్నతాధికారి కాస్త వెనక్కి తగ్గారు. అయితేనేం, రైతులకు ఇచ్చే పాసు పుస్తకాలు, గ్రామాల రెవెన్యూ రికార్డులను తెలియజేసే ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌లపై ప్రతీ పేజీలో జగన్‌ బొమ్మలు ఉండేలా ప్లాన్‌ చేశారు. ఈ భక్తి సరిపోదని, జగన్‌ ఫొటో ఉండే నవరత్నాల లోగోను కూడా వాటిపై ముద్రించారు. ఈ ఫొటోలను చూసి జగన్‌ అచ్చెరువొందారు. కానీ ఈ ఫొటోలను చూసి రైతులు, ప్రజాసంఘాల నేతలు చిరాకుపడ్డారు.

Updated Date - Mar 27 , 2024 | 03:01 AM