Share News

‘ఈసీ రూల్స్‌’ ఉన్నా పోస్టింగ్స్‌లో మతలబు!

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:24 AM

ఎన్నికల కమిషన్‌ నిబంధనలు అమలు చేసినట్లే ఉండాలి.. కానీ అనుయాయులకు కోరిన పోస్టింగ్‌ ఇవ్వాలి..

‘ఈసీ రూల్స్‌’ ఉన్నా పోస్టింగ్స్‌లో మతలబు!

తనవారి కోసం వైసీపీ నేతల ఎత్తుగడ

సీఐ జగన్‌ రెడ్డి, అంజూ యాదవ్‌ తిరుపతిలోనే..

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ నిబంధనలు అమలు చేసినట్లే ఉండాలి.. కానీ అనుయాయులకు కోరిన పోస్టింగ్‌ ఇవ్వాలి.. రాష్ట్రంలో సీఐల బదిలీల్లో జరుగుతున్న తంతు ఇది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేరు పెట్టుకుని ఆయనతో నేరుగా మాట్లాడ గలిగే స్థాయి సీఐ తిరుమల వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్లో సుమారు నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. ఐపీఎస్‌ అధికారులను సైతం లెక్క చేయబోరనే పేరు గాంచిన ఆ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఎన్నికల సమయంలో జిల్లా బయటికి పంపించ రాదనేది వైసీపీ పెద్దల ఆదేశం. అందుకు అనుగుణంగానే అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి జాగ్రత్త పడ్డారు. సీఐ జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి నుంచి బయటికి వెళ్లకుండా ఎన్నికల కోడ్‌ పరిధిలోకి రాని జిల్లా శిక్షణా కేంద్రం(డీటీసీ)లో పోస్టింగ్‌ ఇచ్చారు. దీంతో ఆ సీఐ అధికార పార్టీ నేతలకు కోరిన విధంగా ఎన్నికల్లో పనులు చక్కబెడుతుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇటీవల జనసేన నాయకుడిపై దాడి చేసిన వివాదాస్పద మహిళా సీఐ అంజూ యాదవ్‌ కూడా తిరుపతి నుంచి బయటికి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. అయితే, ఓ ఎమ్మెల్యే సిఫారసుతో ఆమెకు తిరుపతిలోనే లూప్‌లైన్‌ పోస్టింగ్‌ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌ తిరుపతి ఎస్పీకి ఆమెపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రభుత్వం ఆమె భర్తను ఐ-ప్యాక్‌ టీమ్‌లో నియమించింది. మరో సీఐని ఎస్‌బీలో నియమించి.. ఎన్నికల సమయంలో అనుకూలంగా పనిచేయించుకోవచ్చని జగన్‌ పార్టీ నేతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 09 , 2024 | 04:24 AM