Share News

జనం ఛీకొట్టినా.. జగన్‌ అవే అబద్ధాలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:12 AM

అధికారం పోయినా జగన్‌ అబద్ధాలు చెప్పడం మానలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంపై విషం చిమ్ముతూ, లేనిపోని గొప్పలు చెప్పుకొన్నారు.

జనం ఛీకొట్టినా.. జగన్‌ అవే అబద్ధాలు

ఖజానాలో 7 వేలకోట్లు వదిలి వెళ్లారట

జూన్‌ 4వ తేదీ నాటికి ఖజానా నిల్‌

పైగా రిజర్వ్‌ బ్యాంకుకు 4,200 కోట్లు బాకీ

అదేరోజు ఆర్బీఐ నుంచి 4,000 కోట్ల అప్పు

ఇవన్నీ మర్చిపోయి అసత్య ప్రచారాలు

అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): అధికారం పోయినా జగన్‌ అబద్ధాలు చెప్పడం మానలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంపై విషం చిమ్ముతూ, లేనిపోని గొప్పలు చెప్పుకొన్నారు. అనుకూల మీడియా ద్వారా అవాస్తవాలను ప్రచారం చేయించారు. ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా ఆయనలో మార్పు రాలేదు. శుక్రవారం ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఓ అబద్ధాన్ని జనాల్లోకి వదిలారు. తాను గద్దె దిగేనాటికి అంటే జూన్‌ 4వ తేదీన రాష్ట్ర ఖజానాలో రూ.7,000 కోట్లు వదిలిపెట్టి వెళ్లానంటూ జగన్‌ చెప్పారు. ఇది శుద్ద అబద్ధం. జూన్‌ 4వ తేదీన ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ లేదు. అయితే తాను ఖజానాలో రూ.7,000 కోట్లు వదిలిపెట్టి వెళ్లినప్పటికీ సీఎం చంద్రబాబు బడ్జెట్‌ పెట్టే ధైర్యం చేయడం లేదంటూ జగన్‌ విమర్శించారు. వాస్తవానికి జూన్‌ 4వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌కు రూ.4,200 కోట్లు బాకీ ఉంది. ఇందులో రూ.3,200 కోట్లు ఎస్‌డీఎఫ్‌, వేజ్‌ అండ్‌ మీన్స్‌ అప్పు కాగా, రూ.1000 కోట్లు ఓడీ అప్పు. జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్ల కోసం అప్పు తీసుకున్నారు. జూన్‌ 4వ తేదీ జగన్‌కు అప్పుల వారమైన మంగళవారం రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి రూ.4,000 కోట్ల అప్పు తెచ్చారు.

వీటితో ఆర్‌బీఐ నుంచి వాడుకున్న రూ.4,200 కోట్ల అప్పును జమ చేసి మళ్లీ అప్పులు తెచ్చారు. వాటితో మిగతా జీతాలు, పెన్షన్లు, వైసీపీ కోసం, జగన్‌ కోసం వాదించుకున్న లాయర్లకు బిల్లులు చెల్లించుకున్నారు. 2019లో చంద్రబాబు గద్దె దిగేనాటికి ఖజానా అప్పుల్లో లేకపోగా రూ.100 కోట్ల డబ్బు నిల్వ ఉంది. అయినా.. తాము రూ.2.27 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టామని జగన్‌ గొప్పగా చెప్పుకొన్నారు. సమర్థ ఆర్థిక నిర్వహణకు బడ్జెట్‌ కాదు, ఖర్చులే కొలమానం. ఎక్కడ, ఎందుకు, దేనికోసం ఎంత ఖర్చు చేశారనేదే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇందులో జగన్‌ జీరో. బడ్జెట్‌ పెట్టిన మరుసటి రోజు నుంచి గత ఐదేళ్లూ అదనపు నిధులంటూ వందల కొద్దీ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్దకు క్యూ కట్టేవి. వాటిని ఓకే చేసేది జగన్‌ ప్రభుత్వం. అలాంటప్పుడు బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఏం లాభం. రాష్ట్రానికి తిరిగి పైసా ఆదాయం కూడా సమకూర్చలేని విభాగాల్లో మాత్రమే జగన్‌ గత ఐదేళ్లు ఖర్చులు చేశారు. ఆ అడ్డగోలు ఖర్చుల ఫలితమే రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా 30 ఏళ్లు వెనక్కెళ్లిపోయింది.

విధ్వంసాన్ని చక్కదిద్దేందుకు...

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అన్ని మార్గాల్లో వచ్చిన ఆదాయం రూ.1.74 లక్షల కోట్లు. ఇంకో రూ.70,000 కోట్లు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2.27 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశ పెట్టవచ్చు. అయినప్పటికీ గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. సరైన రంగాల్లో, సరైన విధంగా ఖర్చులు చేయడమే దానికి పరిష్కారం.

Updated Date - Jul 28 , 2024 | 07:42 AM