Share News

నోటీసులిచ్చినా అదే నోటి దురుసు

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:00 AM

వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ ఇష్టారీతిన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా నివేదించారు.

నోటీసులిచ్చినా అదే నోటి దురుసు

సిద్ధం సభల్లో ఇష్టమొచ్చినట్టు జగన్‌ వ్యాఖ్యలు

ఇష్టారీతిన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

పైగా ప్రపంచవ్యాప్తంగా

ప్రజాస్వామ్యంలో మామూలేనట!

ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు

ఆయనపై తదుపరి చర్యలు తీసుకోండి

కేంద్ర ఎన్నికల సంఘానికి మీనా నివేదిక

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ ఇష్టారీతిన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా నివేదించారు. ఇప్పటికే ఒకసారి కోడ్‌ ఉల్లంఘనపై నోటీసులిచ్చినప్పటికీ ఆయన తీరు మారలేదని స్పష్టంగా చెప్పారు. పైగా తామిచ్చిన నోటీసులపై జగన్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని వెల్లడించారు. నోటీసులిచ్చిన తర్వాత కూడా వైసీపీ సిద్ధం సభల్లో జగన్‌ విపక్షాలపై నోరుపారేసుకుంటున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబుపై, జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. జగన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను తన నివేదికతో జత చేస్తున్నట్టు తెలిపారు. రాజకీయ ప్రసంగాల్లో జగన్‌ వ్యాఖ్యలు.... టీడీపీ, జనసేన అధినేతలు, ఇతర నాయకుల వ్యక్తిగత పరువుప్రతిష్ఠలను దెబ్బతీసేలా ఉన్నాయని, దీనివల్ల ఎన్నికల రణరంగంలో ఆ రెండు పార్టీలకు సమాన అవకాశాలు దెబ్బతినే ప్రమాదముందని మీనా పేర్కొన్నారు. చంద్రబాబుపై తరచూ అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్న జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏప్రిల్‌ 5న ఈసీకి లేఖ రాశారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. 48 గంటల్లోగా తన వివరణ సమర్పించాలని జగన్‌కు నోటీసు పంపింది. లేనిపక్షంలో తదుపరి చర్య కోసం సీఈసీకి నివేదిక పంపిస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. జగన్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, ఆయనపై తదుపరి చర్యలకు సిఫారసు చేస్తున్నట్టు తన నివేదికలో మీనా తేల్చిచెప్పారు.

ఇలాగే మాట్లాడతారట!

రాజకీయ ప్రసంగాల్లో తాను వాడిన భాష, చంద్రబాబును సినిమాల్లోని క్యారెక్టర్లతో పోల్చిన విధానం రాజకీయ పరిభాష అంటూ జగన్‌ తన వ్యాఖ్యలు సమర్థించుకున్నారని సీఈవో పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలను ఎత్తిచూపడమే తన వ్యాఖ్యల ఉద్దేశమని, అది వ్యక్తిగత దాడి కిందకు రాదని వాదించారని తెలిపారు. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడడం సర్వసాధారణమేనన్న ఆయన వివరణ ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. జగన్‌ ఇచ్చిన వివరణ పూర్తిగా పరిశీలించానని, ఎక్కడా కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పలేదన్నారు.

పదేపదే అదే తప్పు

ఈ నెల 2, 3, 4 తేదీల్లో మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేటలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభల్లో చంద్రబాబుపై జగన్‌ పలు అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. బాబు హంతకుడు అని, ప్రజలను మోసం చేయడం అలవాటని, శాడిస్ట్‌ అంటూ వ్యాఖ్యానించారు. వీటిని పరిశీలించిన సీఈవో.. ఈ వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని ప్రాథమికంగా తేల్చారు. నోటీసులిచ్చాక కూడా జగన్‌ తీరు మార్చుకోలేదని స్పష్టంగా చెప్పారు. 16న భీమవరంలోనూ జగన్‌ నోరుపారేసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ని ఉద్దేశించి చంద్రబాబుకు దత్తపుత్రుడని, కార్లు మార్చినట్టు భార్యలను మారుస్తున్నారని, అలాగే, ఇప్పుడు నియోజకవర్గాలను అదేవిధంగా మారుస్తున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని. కాబట్టి జగన్‌పై తదుపరి చర్యలు తాను సిఫారసు చేస్తున్నట్టు మీనా పేర్కొన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై ఈసీకి నివేదిక

ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు తన ప్రసంగాల్లో సీఎం జగన్‌ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారని సీఈసీకి పంపిన నివేదికలో మీనా తెలిపారు. దీనిపై వివరణ కోరగా, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నట్టుగా చంద్రబాబు వివరణ ఇచ్చారని, కానీ, వీడియోలు అందుబాటులో ఉన్నాయని నివేదించారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. చంద్రబాబు తన ప్రసంగాల్లో చేస్తున్న వ్యాఖ్యలు....వైసీపీ, ఆ పార్టీ నాయకుల వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని తెలిపారు. దీని వల్ల ఎన్నికల్లో వైసీపీ.. సమాన అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నివేదికలో చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు జత చేస్తున్నట్టు మీనా పేర్కొన్నారు. ప్రసంగాల్లో ఇంకా అనుచిత వ్యాఖ్యలు కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబుపై తదుపరి చర్యలకు సిఫారసు చేస్తున్నట్టు మీనా వెల్లడించారు.

Updated Date - Apr 24 , 2024 | 04:00 AM