Share News

జగన్‌ ఉన్నా.. జంపయ్యారు!

ABN , Publish Date - Apr 22 , 2024 | 02:59 AM

వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి భీమిలి నియోజకవర్గం పరిధిలో బస చేసిన సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు సొంత పార్టీ నాయకులు గుడ్‌బై చెప్పారు.

జగన్‌ ఉన్నా.. జంపయ్యారు!

విశాఖ వైసీపీకి భారీ షాక్‌

భీమిలి పరిధిలోని ఒక పంచాయతీ కార్యవర్గం మొత్తం పార్టీకి గుడ్‌బై

500 కుటుంబాలు వైసీపీకి దూరం

గంటా సమక్షంలో టీడీపీలో చేరిక

ఆదివారం రాత్రి అక్కడే జగన్‌ బస

విశాఖపట్నం/ఆనందపురం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి భీమిలి నియోజకవర్గం పరిధిలో బస చేసిన సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు సొంత పార్టీ నాయకులు గుడ్‌బై చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం కుసులవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మహంతి వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్‌ ఆల్తి రామారావు, వార్డు సభ్యులతో పాటు గ్రామానికి చెందిన 500 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కుసులవాడ పంచాయతీ సర్పంచ్‌ వెంకటలక్ష్మి.. భర్త శివాజీ జగన్‌ మీడియా ఆనందపురం మండల విలేకరిగా ఉన్నారు. అయితే, వైసీపీ పాలనపై విసుగుచెందిన శివాజీ ఆదివారం ఆ మీడియాకు కూడా రాజీనామా చేసి, తన భార్య, సర్పంచ్‌ వెంకటలక్ష్మి, ఇతర వార్డు సభ్యులతో కలిసి తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్‌ పాలన పట్ల ప్రజలంతా తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్ర ప్రజానీకాన్ని దగా చేశారని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో గ్రామాలకు గ్రామాలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నాయన్నారు. పార్టీలో చేరిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కాగా, సీఎం జగన్‌ స్థానికంగా బస చేసిన సమయంలోనే ఇన్ని వందల కుటుంబాలు పార్టీకి దూరం కావడం నేతల్లో కలవరం రేపింది. ఒక్కరంటే ఒక్కరు కూడా సీఎం జగన్‌ను పట్టించుకోకపోవడంపైనా స్థానికంగా చర్చ జరిగింది.

Updated Date - Apr 22 , 2024 | 02:59 AM