Share News

వేటు పడినా వీరభక్తుడే!

ABN , Publish Date - May 09 , 2024 | 04:01 AM

‘ఏమయ్యా.. మేం చెబుతున్నది ఏమిటి.. మీరు చేస్తున్నది ఏమిటి.? మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తుంది.. మీకు చాలా కెరీర్‌ ఉంది..

వేటు పడినా  వీరభక్తుడే!

ఈసీ బదిలీ చేసినా జిల్లా ఎస్పీలపై జులుం

మేం చెప్పిందేంటి.. మీరు చేస్తున్నదేంటి?

మళ్లీ జగనే సీఎం.. కెరీర్‌ కోల్పోవద్దు

డీజీ ర్యాంకువారి దుస్థితి చూస్తున్నారుగా..

ఎస్పీలకు సీనియర్‌ ఐపీఎస్‌ బెదిరింపు

జగన్‌కు అనుకూలంగా ఉండాలని ఒత్తిడి

అందుకు కొందరు ఎస్పీలు ససేమిరా

‘సారీ’.. హద్దు మీరలేం అని స్పష్టీకరణ

ఈసీ రిమార్క్‌ ఓసారి పడితే కష్టమని వెల్లడి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఏమయ్యా.. మేం చెబుతున్నది ఏమిటి.. మీరు చేస్తున్నది ఏమిటి.? మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తుంది.. మీకు చాలా కెరీర్‌ ఉంది.. చేజేతుతా కోల్పోవద్దు’ అంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు... జిల్లాల ఎస్పీలకు చేస్తున్న ఫోన్లు పోలీసు ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల విధుల నుంచి ఈసీ ఇటీవలే ఆయన్ను పక్కన బెట్టడంతో విజయవాడలోని ఒక హోటల్లో ప్రత్యేక గది తీసుకుని ఉంటున్నారు. గన్‌ మెన్లు, అత్యంత సన్నిహితులను సైతం దూరంగా పెట్టి ఒంటరిగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. ప్రభుత్వ వాహనం కూడా ఎక్కడో పెట్టి ప్రైవేటు వాహనంలో హోటల్‌ రూమ్‌ నుంచి ఎప్పుడో అవసరానికి మాత్రమే బయటికి వెళుతూ పనులు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసిన ఈ అధికారి ఒక మహిళతో ఫోన్లో నెరిపిన సంభాషణ బయట పడటంతో రాష్ట్రం వదిలి కేంద్ర సర్వీసులకు వెళ్లారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగొచ్చి మొత్తం చక్రం తిప్పుతూ ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు, అరెస్టులు, అధికార పార్టీలో ఎవరైనా కాస్త దూకుడు పెంచితే ఫోన్లు చేసి సున్నితంగా బెదిరించడం చేశారు. ఇంత ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఖాకీ యూనిఫామ్‌ పూర్తిగా వదిలేసి మఫ్టీలోనే వైసీపీ నాయకుడిలా పని చేస్తున్నారు. ఈ అధికారి తీరుపై ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఇటీవలే ఆయన్ను ఎన్నికల విధుల నుంచి పూర్తిగా దూరం పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.


వెంటనే మరో అధికారిని ఆయన స్థానంలో నియమించినా, ముఖ్యమంత్రితోనే ‘అన్నా....’ అని పిలిపించుకున్న ప్రేమో.. లేక ప్రభుత్వం మారితే తనకు ఇబ్బందులు తప్పవన్న భయమో కానీ ఆయన విధులకు కాకుండా కేవలం అధికార కార్యాలయానికే దూరంగా ఉంటున్నారు. అంతకు ముందు జిల్లాల ఎస్పీలకు ఫోన్లు చేసి ఎటువంటి ఆదేశాలిచ్చేవారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. పలు జిల్లాల ఎస్పీలకు ఫోన్లు చేసి అధికార వైసీపీ అభ్యర్థులకు సహకరించాలంటూ సూచిస్తున్నారు. కొందరు ఏదో మాట వరసకు ‘సరే సర్‌’ అంటున్నా మరికొందరు ‘ఈసీ యాక్షన్‌ గట్టిగా ఉంటోంది కదా సర్‌’ అంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘అదంతా ఏమీ ఉండదయ్యా.. మీరు జాగ్రత్తగా మేం చెప్పింది చేస్తే చాలు.. మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తుంది.. జగన్‌ రెడ్డి కనీసం 20ఏళ్లు రాజకీయాల్లో కీలకంగా ఉంటారు.. మీకు కూడా అంతకన్నా ఎక్కువే సర్వీస్‌ ఉంది’ అంటూ హితబోధ చేస్తున్నారు. ప్రతి రోజూ కొన్ని జిల్లాల ఎస్పీలకు ఫోన్లు చేస్తూ.. వైసీపీకి అనుకూలంగా చేయమని చెబుతూనే ఉన్నారు. ఆయన ఆదేశాలు పాటించలేక, కెరీర్‌లో మచ్చ తెచ్చుకోలేక కొందరు ఎస్పీలు తమకు గాడ్‌ ఫాదర్‌ లాంటి సీనియర్లకో.. తమ బ్యాచ్‌ మీట్లకో.. ఫోన్లు చేసి ఆయన్ను ఈసీ దూరంగా పెట్టినా మా వెంట పడటం ఆపట్లేదు.. ఆయన చెప్పినవి చేస్తే కచ్చితంగా కెరీర్‌ కోల్పోతాం.. జీవితంలో ఎన్నికల డ్యూటీ ఉండదు.. అంటున్నారు.

నిష్పక్షపాతంగా పనిచేస్తోన్న కొందరు ఎస్పీలపై సీనియర్‌ ఐపీఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఐపీఎస్‌ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘‘ఆయనకు రెండేళ్లు మాత్రమే సర్వీస్‌ ఉంది.. మాకు 20ఏళ్లకు పైనే ఉంది.. మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తే మాత్రం ఉద్యోగాలేమైనా తీసేస్తారా.? పోలీసు మాన్యువల్‌ ప్రకారం పనిచేస్తాం.. లేదంటే డిప్యుటేషన్‌పై వెళ్లిపోతాం.. ’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన కీలకమైన ఎస్పీలు చెప్పినట్లు చేసేందుకు ససేమిరా అనడంతో వారికి ఫోన్‌ చేసి.. ‘నేనిప్పుడు సీఎంవోలోని కీలక ఐఏఎస్‌ అధికారి ముందున్నా.. స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడుతున్నా.. నువ్వు మరీ గట్టిగా ఇబ్బంది పడతావ్‌.. సీఎం గారితో నిత్యం ఉండే ఆ సార్‌ వింటున్నారు’ అని ఫోనులోనే సీనియర్‌ ఐపీఎస్‌ బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. రాయల సీమలో కీలక జిల్లాలో పనిచేస్తోన్న ఆ ఎస్పీ పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం వాహనాలపై నిఘా పెట్టి ఎన్నికల్లో హద్దు మీరుతోన్న వైసీపీ శ్రేణులకు పోలీసు ట్రీట్మెంట్‌ ఇస్తుండటంతో ప్యాలెస్‌ పెద్దలకు మింగుడు పడట్లేదట. మధ్య ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎస్పీకి ఇలాగే ఫోన్లు చేయడంతో....ఆయన జీవిత భాగస్వామి ‘గట్టిగా పనిచేయలేకపోతే యూనిఫామ్‌ వేస్ట్‌’ అని అన్నట్లు ఐపీఎ్‌సలలో చర్చ జరుగుతోంది.

Updated Date - May 09 , 2024 | 04:01 AM