ఎస్మా, నోటీసులకు భయపడం!
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:13 AM
తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 37వ రోజూ(బుధవారం) కొనసాగింది. సమ్మెలో ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించం
షోకాజ్‌లకు అంగన్వాడీల లిఖితపూర్వక సమాధానాలు
37వ రోజూ కొనసాగిన నిరసనలు
8సమ్మెకు కార్మిక సంఘాల మద్దతు
20న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 37వ రోజూ(బుధవారం) కొనసాగింది. సమ్మెలో ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు అంగన్వాడీలు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదంటూ షోకాజ్ నోటీసులకు సమాధాన పత్రాలను పార్వతీపురం మన్యం జిల్లాలోని అంగన్వాడీలు ఐసీడీఎస్ కార్యాలయాలలో అందించారు. అయితే కొన్నిచోట్ల సీడీపీవోలు ఆ పత్రాలను స్వీకరించలేదు. దీంతో అంగన్వాడీలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. గురువారం ఐసీడీఎస్ కార్యాలయాలకు తమ సమాధాన పత్రాలను అతికిస్తామని స్పష్టం చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్మా, నోటీసులకు భయపడేది లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్కారు దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపైనే వంటా వార్పు నిర్వహించారు. వందలాది మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, సీఐటీయూ నాయకులు ఎండలో రోడ్డుపైనే కూర్చొని భోజనాలు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో అంగన్వాడీల సమ్మెకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. పుట్టపర్తి హనుమాన్ సర్కిల్ నుంచి సీడీపీఓ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని జ్యోతిబాపూలే పార్కు వద్ద అంగన్వాడీలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పొర్లుదండాలు.. సాష్టాంగ నమస్కారాలు చేశారు. కనికరించండి మహాప్రభో అంటూ నినదించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ కేంద్రాల వద్ద అంగన్వాడీలు దీక్షలు కొనసాగిస్తున్నారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట చిన్నారులతో కలసి దీక్షలు చేశారు. వారికి సీఐటీయూ, సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు బి.పైడిరాజు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ నెరవేర్చిన డిమాండ్లు ఏంటో తమకు ఇంతవరకు తెలియదన్నారు. మంత్రి ఏ డిమాండ్లు నెరవేర్చారో లిఖిత పూర్వకంగా వివరించాలని ఆమె కోరారు.
నిరవధిక దీక్షలు ప్రారంభం..
విజయవాడ ధర్నాచౌక్‌లో అంగన్వాడీల నిరవధిక దీక్షలను బుధవారం ప్రారంభించారు. దీక్షలకు మద ్దతు తెలిపిన ఎమ్మెల్సీ కేఎ్‌స.లక్ష్మణరావు మాట్లాడుతూ అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నా సానుకూలంగా స్పందించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో లక్షకుపైగా ఉన్న అంగన్వాడీల కుటుంబాలు ఓట్లు వేయాలనే విషయాన్ని గుర్తించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీల ఉద్యమానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు ఉంటుందన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చర్చల పేరుతో కాలయాపన చేయకుండా అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. 11 డిమాండ్లలో 10 పరిష్కరించామంటూ ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. జీతభత్యాలు, గ్రాట్యూటీ అంశాలపై అసలు చర్చించడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇప్టూ నేతలు ఏవీ.నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, ఆర్.రవీంద్రనాథ్, ఓబులేసు, పొలారి, రవిచంద్ర తదితరులు ఈ దీక్షకు సంఘీభావం తెలిసారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిర్వహించే ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందన్నారు.
కార్మిక సంఘాల మద్దతు..
అంగన్వాడీల నిరవధిక దీక్షలకు మద్దతుగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర కమిటీల సమావేశాన్ని బుధవారం విజయవాడలో నిర్వహించారు. అంగన్‌వాడీల నిరవధిక దీక్షలకు సంఘీభావంగా 20న అన్ని జిల్లాల్లో గంట పాటు రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయించారు.