అత్యవసర వైద్యం అంతంతే
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:14 AM
: భవనాలు చూస్తే కార్పొరేట్ ఆస్పత్రులను తలపిస్తుంటాయి.. వైద్య సేవలు, కనీస సౌకర్యాలు ఉండవు. వైద్యులు ఉంటే.... నర్సింగ్ సిబ్బంది ఉండరు.

ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు డల్
గ్రామాల్లో అందని 24 గంటల వైద్యం
పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండని వైద్యులు
నొప్పులు రావడంతో గర్భిణీని డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకొస్తున్న బంధువులు
మూతబడిన డాక్టర్ గది
ఆదోని, జూన్ 16: భవనాలు చూస్తే కార్పొరేట్ ఆస్పత్రులను తలపిస్తుంటాయి.. వైద్య సేవలు, కనీస సౌకర్యాలు ఉండవు. వైద్యులు ఉంటే.... నర్సింగ్ సిబ్బంది ఉండరు. వీరిద్దరూ ఉంటే పరికరాలు ఉండవు. ఈ మూడు ఉంటే టెక్కీషియన్లు ఉండరు. అంతా బాగుంది అనుకుంటే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అత్యవసర వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. దీంతో రోగులు, క్షతగాత్రులకు సకాలంలో సరైన వైద్యం అందక ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి.
పై ఫొటోలో కనిపిస్తున్నది ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామంలోని పీహెచ్‌సీ సెంటర్. ఆదివారం ఆంధ్రజ్యోతి ఈ కేంద్రాన్ని విజిట్ చేయగా.. డాక్టర్లు ఎవ్వరూ కనిపించలేదు. ఉదయం 11 గంటల రాలేదు. అందులో ఉన్న సిస్టర్ మాత్రం పేషెంట్లను చూస్తూ, వారికి ఇంజక్షన్‌లు ఇస్తూ, టాబ్లెట్లు అందజేస్తూ.. మరోవైపు డెలివరీ కోసం వచ్చిన వారిని కూడా పరిశీలిస్తూ ఉంది. అన్ని సేవలను మీరు చేస్తున్నారేమిటని ప్రశ్నించగా ‘అత్యవసర కేసయితే డాక్టర్ వస్తారని, మీరెవరో చెబితే ఫోన్ చేస్తానని, నన్ను ఏమీ అడగద్దని అక్కనుంచివెళ్లిపోయారు. ఈ నెల 10న సోమవారం రోజున కోసిగి గ్రామంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన అంజనమ్మ మూడో కాన్పు కోసం పెద్దతుంబలం పీహెచ్‌సీకి తెచ్చారు. నర్సు డెలివరీ చేయడంతో ఈ కాన్పులో తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇదొక్కటే కాదు.. ఏడు నెలల వ్యవధిలో దాదాపు ఏడుగురు శిశువులు, ముగ్గురు తల్లులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకరు లేదా ఇద్దరు సిబ్బంది ఉండి అన్ని తామై చూస్తున్నారు. ఆదివారం రోజు సెలవు దినం కావడంతో అధికారులు ఎవరూ ఆసుపత్రి వైపు తొంగిచూడకపోవడం గమనార్హం.
సక్రమంగా అందని వైద్యం
అనారోగ్య సమస్యలతో ఆరోగ్య కేంద్రాలకు వస్తే డాక్టర్లు కనీసం చేతితో నాడిని సైతం పరిక్షించడం లేదనే విమర్శలున్నాయి. పీహెచ్ సీల్లో వైద్యులు, సిబ్బంది ఎప్పుడు ఉంటారో తెలియడం లేదని పలువురు వాపోయారు. ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు కూడా చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందక ప్రతి ఏటా ఎన్నో ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. అత్యవసరమైన వైద్యసహాయం కావాలని వచ్చిన వారికి కనీస సమాచారం కూడా ఇచ్చే వారు ఆయా కేంద్రాల్లో ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు. పీహెచ్‌సీల్లో సక్రమంగా అందని వైద్య సేవలపై తరచూ ఉన్నతాధికారులు సమీక్షల్లో ఆగ్రహం వ్యక్తం చేసినా సిబ్బంది, వైద్యుల తీరులో మార్పు రాకపోవడం శోచనీయం.
ఫోన్ చేస్తేనే డాక్టర్ వస్తారు...
24 గంటలు వైద్యసేవలు అందించాల్సిన ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండడం లేదు. దీంతో రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదనే విమర్శలున్నాయి. రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర వైద్యం కోసం ఎవరైనా వస్తే, సిబ్బంది ఫోన్ చేస్తే తప్ప వైద్యులు రావడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రధాన రహదారుల్లో, ఇతర మార్గాల్లో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను వైద్యం నిమిత్తం 24 గంటల ఆసుపత్రికి వచ్చినా సరైనా చికిత్సలు అందించేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు. రాత్రి వేళల్లో అయితే అది కూడా అందదు. క్షతగాత్రుడిని చూడకుండానే పరిస్థితి విషమంగా ఉందంటూ కర్నూలుకి గాని, సమీపంలోని ఆదోని ఏరియా ఆస్పత్రికి గాని రెఫర్ చేస్తుంటారు.
ఈ విషయంపై డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో సత్యవతిను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. ‘డాక్టర్ పక్కనే ఉంటారని, ఫోన్ చేస్తే అందుబాటులోకి వచ్చి చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉంటార’ని చెప్పారు. కంటిన్యూగా ఉండేందుకు సిబ్బంది కొరత వల్లే అలా జరుగుతోందని, ఉన్నతాధికారులకు చెప్పి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. నెలకు 120 నుండి 150 వరకు కాన్పులు చేస్తున్నామని పేర్కొన్నారు.