Share News

రూ.400 కోట్లు పంచేశారు..!

ABN , Publish Date - May 21 , 2024 | 12:05 AM

సార్వత్రిక ఎన్నికల్లో నోట్ల వరద పారింది. జిల్లావ్యాప్తంగా ప్రధాన పార్టీలవారు రూ.400 కోట్ల మేర నగదు పంచేసినట్లు అంచనా. ప్రచారం మొదలుకుని ఓటుకు నోటు పంపిణీదాకా సగటున రూ.50 కోట్లు పైమాటే వెచ్చించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

రూ.400 కోట్లు  పంచేశారు..!

ఎన్నికల్లో భారీగా పంపకాలు

మార్కెట్లో పెద్ద నోటు సందడి

జనం షాపిఫపింగ్‌బాట

ఓట్ల సొమ్ముతో నేతల జల్సా

పుట్టపర్తి. మే20(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో నోట్ల వరద పారింది. జిల్లావ్యాప్తంగా ప్రధాన పార్టీలవారు రూ.400 కోట్ల మేర నగదు పంచేసినట్లు అంచనా. ప్రచారం మొదలుకుని ఓటుకు నోటు పంపిణీదాకా సగటున రూ.50 కోట్లు పైమాటే వెచ్చించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. హిందూపురం, రాప్తాడు, పెనుకొండ, పుట్టపర్తిలో అది కాస్తా రూ.70 కోట్లు దాటేసింది. ఇందులో అధికార వైసీపీ అభ్యర్థులు భారీగానే ఖర్చు చేశారు. సింహభాగం ఓటర్ల ప్రలోభాలకే ఖర్చు చేసినట్లు అంచనా. ప్రచారంలో జనసమీకరణకు రోజుకు సగటున రూ.అరకోటి ఖర్చు చేశారంటే ఏ మేరకు కరెన్సీ వరద పారిందో చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలో జనానికి ఎన్నికల పండగొచ్చింది. వారం రోజులుగా మార్కెట్‌లో ఎన్నికల డబ్బుతో జల్సా చేస్తున్నారు. షాపింగ్‌తోపాటు వేసవి ఆటవిడుపు కోసం చల్లని ప్రాంతాలతోపాటు పుణ్యక్షేత్రాలకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా.. ఓటుకు ఎంత ఇచ్చారనీ, తమ ఇంట్లో ఇంత వచ్చిందనీ, ఆ డబ్బుతో ఫలానా వస్తువు కొన్నామని చర్చించుకుంటున్నారు. ఎన్నికల పుణ్యమా అని మార్కెట్‌లో రూ.500 నోట్లు చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ దుకాణాలకు చేరుతున్నాయి. వస్త్ర, గృహోపకరణాలు, మొబైల్‌షాప్‌, ఎలకా్ట్రనిక్‌, బంగారు దుకాణాలకు రూ.500 నోటు చేరుతోంది. దీంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

డబ్బులు వచ్చాయిలా...

జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లోనూ డబ్బు పంపిణీ జోరుగా సాగింది. పల్లెపట్నంలో కాస్తా అటు.. ఇటు.. అయినా పంపకాలు మాత్రం పక్కాగా చేశారు. ఓటుకు రూ.1500 నుంచి రూ.2500దాకా పంపిణీ చేశారన్నది బహిరంగ రహస్యమే. ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే ప్రధాన పార్టీల నుంచి రూ.20 వేల వరకు అందాయి. ఎక్కువ ఓట్లున్న కుటుంబాలకు రూ.30 వేలదాకా కూడా ముట్టాయి. తమకే ఓటు వేయాలని ప్రధాన పార్టీలు పోటీ పడి డబ్బు పంపిణీ చేశాయి. వైసీపీ అభ్యర్థులు పేద, మధ్యతరగతి వర్గీయులే లక్ష్యంగా కోట్లాది రూపాయలు కుమ్మరించాయి. మూడంచెల విధానంలో పంపిణీ చేశారు. ఓటర్లు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు వారం ముందు నుంచే పంపకాలు జరిగాయి. ఇలా జిల్లాలో 10లక్షల ఓటర్లకుపైగా సరాసరి ఓటుకు రూ.3వేలు చొప్పున చేతిలో పడ్డాయని అనుకున్నా.. ఆ అంకెను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ లెక్కన జిల్లాలోని ఓటర్లకు అభ్యర్థులు అక్షరాలా రూ.300 కోట్లు పంపిణీ చేశారు. ఇక ప్రచారం ఇతర ఖర్చులు వేసుకుంటే మరో వంద కోట్లదాకా ఖర్చు చేశారు. ఈలెక్కన రూ.400 కోట్లుపైమాటే పంచేశారన్న మాట. జిల్లాలో ఎటుచూసినా రూ.500 నోట్లే దర్శనమిస్తున్నాయి.

ఎన్నికల పండగ..

జిల్లాలో హిందూపురం, ధర్మవరం కదిరి. పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మాల్స్‌, దుకాణాలు ఆకర్షిస్తున్నాయి. కొన్నాళ్లుగా వ్యాపారాలు లేక ఉసూరమంటూ కనిపించిన దుకాణాలు వారం రోజులుగా జనాలతో సందడిగా మారాయి. పల్లెపట్నంలో ఓటు నోటుతో మద్యం షాపులు మొదలుకుని, వస్త్ర దుకాణాలు, గృహోపకరణలు, మొబైల్‌, బంగారు దుకాణాల వద్ద ఎన్నికల నోటు సందడి చేస్తోంది. ఎన్నికల పుణ్యామాని జిల్లాలో వ్యాపారవర్గాలకు కాసుల వర్షం కురుస్తోంది. ఎన్నికల ముందుకు పలు పథకాలకు బటన నొక్కుడుతో జమకాని నిధులు రెండు రోజులుగా ఖాతాల్లో పడుతుండడంతో ఆ నోట్లతో మార్కెట్‌ హుషారుగా మారింది.

ఓట్ల సొమ్ముతో జల్సా

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో మార్చి 16 నుంచి ఈనెల 13వ తేదీదాకా ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున నాయకులు, కార్యకర్తలు ప్రచారం మొదలుకుని, పోలింగ్‌దాకా బీజీగా గడిపారు. ఎన్నికల్లో క్రీయాశీలకంగా పనిచేసిన వారికి కాస్తోకూస్తో నోటు చేతికందింది. ఓటుకు నోటు పంపకాల్లో ఆయా పార్టీల నాయకులు అందినకాడికి నొక్కేశారు. ఇలా నొక్కేసిన డబ్బుతో ఆటవిడుపు కోసం కొందరు చల్లని ప్రదేశాలకు క్యూకడితే.. మరికొందరు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. అలా ఎన్నికల సొమ్ముతో జల్సా చేస్తున్నారు.

Updated Date - May 21 , 2024 | 12:05 AM