Share News

AP Election 2024: ఏపీ ఎన్నికల వేళ కొత్త యాప్ ప్రవేశపెట్టిన ఈసీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 09:24 PM

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కోసం ‘సమర్థ్’ పేరిట ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా మొబెల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీస్ బలగాల లొకేషన్లు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చని చెప్పారు.

AP Election 2024: ఏపీ ఎన్నికల వేళ కొత్త యాప్ ప్రవేశపెట్టిన ఈసీ

అమరావతి: ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కోసం ‘సమర్థ్’ పేరిట ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా మొబెల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీస్ బలగాల లొకేషన్లు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చని చెప్పారు. సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాల లొకేషన్లను కూడా సులభంగా గుర్తించవచ్చునని అన్నారు. అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, సెక్టర్ ఆఫీసర్లు ఈ యాప్‌ను వినియోగించాలని ముకేశ్ కుమార్ మీనా సూచించారు.


యాప్‌ను అభివృద్ధి చేసి ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌ని ముకేశ్ కుమార్ మీనా అభినందించారు. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ‘సమర్థ’ ("SAMARTH"-Security Arrangement Mapping Analysis Response Tracking Hub) మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలను తక్షణమే పంపించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నేడు (శుక్రవారం) వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మకేశ్ కుమార్ మీనాను మర్యాదపూర్వకంగా కలిసి వకుల్ జిందాల్ తమ జిల్లాలో ‘సమర్థ్’ మొబైల్ యాప్‌ విశిష్టత వివరించారు.


జిల్లా ఐటి కోర్ విభాగం రూపొందించిన ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా ఈ నెల 22వ తేదీ నుంచి తమ జిల్లాలో వినియోగిస్తున్నామని, మంచి ఫలితాలను సాధిస్తున్నట్టు వెల్లడించారు.ఈ యాప్ ద్వారా పోలీస్ అధికారులు డైరెక్ట్‌గా కాల్ చేయవచ్చని చెప్పారు. ఒక్క నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వున్న 2000 మంది పోలీసులకు ఒకేసారి ఆదేశాల జారీ చేయవచ్చని తెలిపారు. మొబైల్‌కి ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోయినా నోటిఫికేషన్ ద్వారా వారికి సమాచారం అందుతుందన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది రియల్ టైమ్ లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయవచ్చని పేర్కొన్నారు. అదే విదంగా సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించడానికి, యాప్ నుండి నేరుగా కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయవచ్చునని, తద్వారా సమస్యాత్మక ప్రాంతాలకు తక్షణమే పోలీస్ బలగాలు చేరుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 09:24 PM