Share News

కూరగాయల వ్యాపారంలా ఎన్నికలు!

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:20 AM

ఓటర్ల క్రియాశీలత, భాగస్వామ్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి అని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ చైర్మన్‌, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జి.భవాని ప్రసాద్‌ అన్నారు.

కూరగాయల వ్యాపారంలా ఎన్నికలు!

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు పునాదిరాయి

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ భవాని ప్రసాద్‌

కర్నూలులో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ సమావేశం

కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 11: ఓటర్ల క్రియాశీలత, భాగస్వామ్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి అని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ చైర్మన్‌, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జి.భవాని ప్రసాద్‌ అన్నారు. కర్నూలు నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం ‘ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్య పరిరక్షణ’ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గాడిచర్ల సర్వోత్తమరావు ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కల్కూర చంద్రశేఖర్‌, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఏపీ రాష్ట్ర విశ్రాంత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి పోలంకి సుబ్బారాయన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ జి.భవాని ప్రసాద్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఎలాంటి వివక్షా లేకుండా ఓటు హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ రానురాను నైతికంగా పతనం కావడం ఆందోళనను కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. గొప్ప మహనీయులను, నిజాయితీపరులను స్వేచ్ఛగా ఎన్నుకున్న దేశం మనదన్నారు. కానీ నేడు డబ్బు, మద్యానికి బానిసలై కొందరు ఓటు హక్కును నైతికంగా వినియోగించుకోలేని దుస్థితిలో పడ్డారని ఆవేదన చెందారు. ఎన్నికలు అంటేనే కూరగాయల వ్యాపారంలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు మార్గదర్శకులైన నాయకులను ఎన్నుకోవడానికి పౌరులందరికి ధైర్యం కల్పించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

ఓటేయకుంటే వ్యవస్థలు దిగజారుతాయి

నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తగ్గుతోంది. లిథియా లాంటి సంపన్న దేశంలో అందరూ చదుకున్న వారు కావడంతో అక్కడ ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంది. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా పతనం కావడంతో అక్కడ కూడా వెనుజులా పరిస్థితే వచ్చింది. ఓటు వేయడం వల్ల ఎలాంటి మార్పూ రాదనే భావనతోనే చదువుకున్న వారు, సంపన్నులు ముందుకు రాకపోవడం సరికాదు. ఓటు హక్కును వినియోగించుకోకుంటే వ్యవస్థలు దిగజారిపోతాయి.

- వి.నాగిరెడ్డి

ఎమ్మెల్యేల్లో జవాబుదారీతనం ఉండాలి

ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఐదేళ్లు ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పేవిధంగా ఓటర్లలో చైతన్యం రావాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆరునెలలకు ఒక్కసారి తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలి. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులు, చట్టాల గురించి అడిగితే చెప్పలేని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ, ఇతర సంస్థలతో కలిసి రాజకీయాలకు అతీతంగా చేస్తున్న కృషికి పౌర సమాజం స్పందించి, సహకరించాలి.

- ఎల్వీ సుబ్రహ్మణ్యం

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం

ఏపీలో నిశబ్ద విప్లవం ప్రారంభమైంది. ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉన్న కర్నూలు జిల్లాలో త్వరలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తున్న తరుణంలో పౌరులందరూ క్రియాశీలకంగా వ్యవహరించాలి. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను డెమోక్రసీ సంస్థ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తున్నాం. జాబితాలో ఓటు లేనిపక్షంలో అప్పీలు చేసుకోవడానికి 15 రోజుల చట్టబద్ధమైన గడువు ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు లిస్టులో తమ పేరును సరిచూసుకోవాలి. ఫారం-6 ద్వారా ఓటు హక్కు కోరేందుకు నామినేషన్‌ దాఖలు చేసే రోజు వరకు అవకాశం ఉంటుంది.

- నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

Updated Date - Feb 12 , 2024 | 02:22 AM