Share News

రెండు నెలల్లో ఎన్నికల యుద్ధం

ABN , Publish Date - Jan 28 , 2024 | 02:52 AM

రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం జరగనుందని, దీనికి వైసీపీ కార్యకర్త నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

రెండు నెలల్లో ఎన్నికల యుద్ధం

కార్యకర్త నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి

వలంటీర్లు వైసీపీ కార్యకర్తలే.. సంగివలస సభలో సీఎం జగన్‌

విశాఖపట్నం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం జరగనుందని, దీనికి వైసీపీ కార్యకర్త నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో ఉన్న సంగివలసలో శనివారం ‘సిద్ధం’ పేరిట నిర్వహించిన వైసీపీ తొలి ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల మధ్య తేడాను ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని సూచించారు. గడచిన 56 నెలల్లో ప్రతి కుటుంబానికి, గ్రామానికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అందించిందని గొప్పలు చెప్పుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎమ్మెల్యే సీట్లు, 25కి 25 ఎంపీ సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. వైసీపీ చేసిన మంచి పనులు చెబితే చాలని, ప్రజలే ఓట్లు వేస్తారని అన్నారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని, ఈ యుద్ధంలో అటు వైపు దుష్టచతుష్టయం, కౌరవ సైన్యం ఉందన్నారు. తాను పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని కాదని.. విజయం సాధించిన అర్జునుడినని చెప్పుకొన్నారు. ప్రజలు, దేవుడి దయ కృష్ణుని రూపంలో తన వెంట ఉన్నాయన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడితో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. వారికి 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు గత ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లు కూడా ఈసారి రావని జగన్‌ వ్యాఖ్యానించారు.

వలంటీర్లు మనవాళ్లే

రాష్ట్రంలో పనిచేస్తున్న వలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని సీఎం జగన్‌ అంగీకరించారు. ఏ పథకమైనా నేరుగా గడప వద్దకే చేరేలా వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా వైసీపీ...జగన్‌ మార్కు పాలనే కనిపిస్తోందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 2.13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానన్నారు. ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేసినా తప్పక గెలుస్తారని, ఆ విధంగా పరిపాలన అందించామన్నారు. వలంటీర్లు కూడా పార్టీ నుంచి వచ్చిన వారేనని, వాళ్లను చూసి మనవారేనని గర్వపడాలన్నారు. రానున్న ఎన్నికలు పెత్తందారు వర్గమైన చంద్రబాబు, అతని వర్గానికి, పేదవారమైన వైసీపీకి మధ్యే పోరు జరగనుందని జగన్‌ చెప్పుకొచ్చారు.

ప్రజలను రెచ్చగొడుతూ..

సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ వైసీపీ తరఫున సోషల్‌ మీడియాలో యుద్ధం చేయాలని సీఎం జగన్‌ రెచ్చగొట్టారు. విపక్షాల యుక్తులను తిప్పికొట్టాలన్నారు. పథకాలు వద్దనుకుంటేనే ప్రతిపక్షాలకు ఓట్లు వేయాలని ప్రజలకు సూచించాలన్నారు. ‘‘మీ బిడ్డ ఎవరికీ భయపడడు’’ అంటూ ఎన్నికల శంఖం పూరించారు. అనంతరం ఢంకా కొట్టి నగారా మోగించారు. కాగా, సిద్ధం సభలో సీఎం జగన్‌ చేసిన విన్యాసాలకు జనం పగలబడి నవ్వారు. నా బీసీలు, నా అక్కచెల్లెళ్లు.. అని ఆయన మాట్లాడుతుంటే కామెడీగా అనిపించి ప్రజలు నవ్వుకున్నారు. ముఖ్యంగా ‘‘నా...నా...నా...నా..’’ అంటూ సాగదీస్తూ మాట్లాడడంతో సభ ప్రాంగణంలోని జనాలు పడిపడి నవ్వుకున్నారు.

వేదిక ముందు శిలువ ఆకారంపై నడక

సంగివలసలో నిర్వహించిన సభలో ఏర్పాటు చేసిన గ్యాలరీల వద్దకు నడిచి వెళ్లేందుకు వీలుగా ఒక ర్యాంపు నిర్మించారు. ఇది క్రైస్తవులు ఆరాధించే ‘శిలువ’ ఆకారంలో ఉంది. దీనిపై గ్రీన్‌ కార్పెట్‌ వేశారు. సీఎం తన ప్రసంగానికి ముందే శిలువ ఆకారంలో ఉన్న ర్యాంపుపై నడుచుకుంటూ వెళ్లి పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివాదాలు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్‌ వ్యవహరించారని, శిలువ ఆకారంలో ర్యాంపు ఏర్పాటుచేయడం, దానిని తొక్కుకుంటూ ఆయన సెక్యూరిటీతో కలిసి వెళ్లడం ఏమిటని పలువురు విమర్శలు గుప్పించారు.

Updated Date - Jan 28 , 2024 | 02:52 AM