Share News

ఎన్నికల ప్రేమలు 2.0

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:18 AM

బటన్‌ నొక్కుడు కార్యక్రమాలకు వెళ్లినప్పుడు... ‘ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన’ వాళ్లను వేదికపై కలవడం తప్పితే... ఒక్కసారీ సామాన్య ప్రజలను జగన్‌ కలిసిందే లేదు.

ఎన్నికల ప్రేమలు 2.0

ఐదేళ్లూ ఎక్కడ ఉన్నావ్‌.. ఎప్పుడు విన్నావ్‌?

రాజులు, రాజ్యాల కాలం నుంచి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులదాకా... పాలకులు ఏదో ఒక రూపంలో ప్రజలను కలవడం, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం ఒక రివాజు! వైఎస్‌ రాజశేఖర రెడ్డి ‘ప్రజా దర్బార్‌’ పేరుతో ప్రజలను కలిశారు. చంద్రబాబు ‘ప్రజా వేదిక’ పెట్టారు. కానీ... ప్రజలను కలవడం సంగతి అటుంచి, వారిని ఆమడ దూరం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! ఇప్పుడు ఎన్నికలురాగానే బస్సులో బయలుదేరి... అక్కడక్కడా ‘ఐప్యాక్‌ అరేంజ్డ్‌’ బాధితులు కనిపించగానే... బస్సు ఆపి, కిందికి దిగి మరీ వారి చేతుల్లోని వినతిపత్రాలు తీసుకుంటున్నారు. ‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అని అధికారంలోకి వచ్చిన జగన్‌ తీరిది! ఈ ఐదేళ్లు ఎక్కడున్నారు? ఏం విన్నారు?

ఐదేళ్లు పరదాలు, బారికేడ్ల మాటునే

ప్రజాదర్బార్‌ లేదు... ప్రజా వేదికా లేదు

జనాన్ని ఆమడ దూరంలో పెట్టిన జగన్‌

ఎన్నికలు రాగానే మళ్లీ జనంలోకి

బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సు దిగి వినతి పత్రాల స్వీకరణ

వాటిపై చర్యలు తీసుకునేంత సీన్‌ ఉందా?

బారికేడ్లు, పరదాలే...

బటన్‌ నొక్కుడు కార్యక్రమాలకు వెళ్లినప్పుడు... ‘ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన’ వాళ్లను వేదికపై కలవడం తప్పితే... ఒక్కసారీ సామాన్య ప్రజలను జగన్‌ కలిసిందే లేదు. పైగా... ఆయన బయట అడుగు పెట్టారంటే కర్ఫ్యూ వాతావరణమే! చెట్లు కొట్టడం, బారికేడ్లు పెట్టడం, పరదాలు కట్టడం... అంతా ఆంక్షల చట్రం. పోనీ సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసే అవకాశముందా అంటే.. అదీ లేదు. కేబినెట్‌ సమావేశాలున్నప్పుడు తప్ప జగన్‌ సెక్రటేరియట్‌ వైపు చూసిందే లేదు. ఆయన తాడేపల్లి ప్యాలె్‌సకే పరిమితం. ఆ దరిదాపులకు సామాన్యులు వచ్చే అవకాశమే లేదు. కృష్ణా నది కరకట్టపై ఉన్న పేద ప్రజలను అక్కడి నుంచి తరిమేశారు. వెరసి... సామాన్య ప్రజలు సీఎంకు తమ గోడు విన్నవించుకునే ఆస్కారమే లేకుండా పోయింది! ఒక దశలో తండ్రి వైఎస్‌ లాగానే జగన్‌ కూడా ‘ప్రజా దర్బార్‌’ నిర్వహిస్తారంటూ ఒక ప్రకటన వెలువడింది. ‘రచ్చబండ’లో కూడా పాల్గొంటారని ప్రచారం చేశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలో గత ఏడాది ప్రజాదర్బార్‌ వేదికను కూడా ఏర్పాటు చేశారు. కానీ... దాని తలుపులు మాత్రం తెరుచుకోలేదు.

ఎన్నికలు రాగానే...

సార్వత్రిక ఎన్నికలు రాగానే ‘పరదాల’ నుంచి ముఖ్యమంత్రి జగన్‌ బయటికి వచ్చేశారు. బస్సుయాత్ర చేపట్టారు. అంతే... మరోసారి జగన్‌ మార్కు ‘పలకరింపులు’ మొదలయ్యాయి. ముద్దులు, బుగ్గలు నిమరడం, నెత్తిమీద ఎడమ చెయ్యి వేసి ఆశీర్వదించడం... ఇలా బస్సు యాత్రలో కరుణ రసాత్మక నాటకాలు ప్రదర్శిస్తున్నారు. అంతకుముందు సమస్యలు చెప్పుకొనేందుకు జనం రోడ్డుపక్కన నిలబడినా పట్టించుకోకుండా ముందుకెళ్లిన జగన్‌... ఇప్పుడు టకీమని బస్సును ఆపి, ఫుట్‌బోర్డుపై కూర్చుని, నాటకీయంగా పలకరిస్తూ, వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. అదేం చిత్రమో కానీ... ఒకరోజు వికలాంగులు, ఇంకో రోజు మైనారిటీ మహిళ, మరో రోజు వృద్ధుడు ఇలా బాధితులు ఒక స్కీమ్‌ ప్రకారం మారుతున్నారు. ఇవి కూడా ఐప్యాక్‌ అరేంజ్డ్‌ పరామర్శలనే అనుమానాలూ ఉన్నాయి. ఇంతకీ... ఎన్నికల ముందు ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తీసుకుంటున్న వినతిపత్రాలు ఏమవుతున్నాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ‘కోడ్‌’ ఉండగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశముందా? ఉత్తుత్తినే కాగితాలు తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలేవీ అడగొద్దు! ఎందుకో మీకూ తెలుసు!

- అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 24 , 2024 | 03:18 AM