టీచర్లకూ ఎన్నికల డ్యూటీ!
ABN , Publish Date - Jan 12 , 2024 | 04:46 AM
ఎన్నికల విధులకు టీచర్లను దూరంగా పెట్టాలన్న జగన్ సర్కార్ ఎత్తులను కేంద్ర ఎన్నికల సంఘం చిత్తు చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న టీచర్లను పక్కనపెట్టి..

వారి వివరాలను పంపండి
జగన్ ప్రభుత్వానికి సీఈసీ కళ్లెం
జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు
జాబితా పంపే పనిలో అధికారులు
ఏ హామీ తీర్చని సర్కారుపై టీచర్ల ఆగ్రహం
ఎన్నికల్లో దెబ్బ తీస్తారేమోనని గుబులు
అందుకే ‘బోధనేతర’ సాకుతో వారిని ఎన్నికల
విధులకు దూరంపెట్టేలా సర్కారు ఎత్తు
సచివాలయాల సిబ్బందితో గట్టెక్కే యత్నం
ఈసీ భేటీలో చంద్రబాబు, పవన్ ఫిర్యాదు
టీచర్ల వివరాలూ కోరిన ఎన్నికల సంఘం
అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధులకు టీచర్లను దూరంగా పెట్టాలన్న జగన్ సర్కార్ ఎత్తులను కేంద్ర ఎన్నికల సంఘం చిత్తు చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న టీచర్లను పక్కనపెట్టి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఈసారి ఎన్నికల్లో గట్టెక్కాలనుకున్న జగన్ ఎత్తుగడకు ఈసీ కళ్లెం వేసింది. టీచర్లను ఎన్నికల ప్రక్రియలోకి తీసుకువచ్చే కార్యాచరణను ప్రారంభించింది. ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, ఇతర పోలింగ్ విధుల్లో టీచర్ల నియామకానికి వివరాలు పంపాలని ఆదేశించింది. ఇతర శాఖల ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వివరాలతోపాటు టీచర్ల వివరాలూ పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లను సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. జగన్ సర్కారు టీచర్లను పోలింగ్ విధులకు దూరం చేసేందుకు ఎత్తు వేసింది. బోధనేతర పనులు ఉపాధ్యాయులకు అప్పగించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం...ఉపాధ్యాయుల వివరాలు పంపమనడంతో జగన్ సర్కార్‌కు షాక్ తగిలినట్లయింది. పోలింగ్ విధులు నిర్వహించే వారిని మూడు విభాగాలుగా విభజించి పంపాలని కలెక్టర్లను మీనా ఆదేశించారు. రాష్ట్రంలో పోలింగ్ విధులకు మొత్తం ఎంత మంది ఉద్యోగులు అవసరం....టీచర్లు ఎంత మంది అందుబాటులో ఉన్నారు....గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కాక మిగిలిన డిపార్టుమెంట్లలో ఎంతమంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు....గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు.....గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, టీచర్లు, ఇతర డిపార్టుమెంట్లలోని ఉద్యోగులు కాకుండా ఇంకా మిగిలిన ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో పూర్తి వివరాలతో వెంటనే వివరాలు పంపాలంటూ జిల్లా కల్టెకర్లను సీఈవో ఆదేశాలు జారీ చేశారు. టీచర్లను బోధనేతర పనులకు అప్పగించకూడదని జగన్ సర్కార్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాల్లోని మార్పులు చేర్పులను సచివాలయ సిబ్బందితో చేయించింది. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కూడా కలిసి టీచర్లకే ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కోరారు. దీంతో రాష్ట్రంలోని టీచర్ల పూర్తి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘం సేకరించే పనిలోపడింది.
వివరాలు ప్రొఫార్మాలో పంపండి...
విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను ప్రొఫార్మాలో పంపాలని విద్యాశాఖాధికారులు....మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ పరిధిలోని టీచర్లు, బోధనేతర సిబ్బంది వివరాలను 34 కాలమ్స్ ప్రొఫార్మాలో నింపి పంపాలని పేర్కొన్నారు. 12వ తేదీ ఉదయానికల్లా వాటిని జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు పంపాలని ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు ఉరుకులుపరుగులు మీద ప్రొఫార్మాలను నింపి పంపే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఆ ప్రొఫార్మాలో గతంలో పోలింగ్ విధుల్లో పని చేశారా? చేస్తే ఏఏ విధులు నిర్వర్తించారు. పీవోనా, ఏపీవోనా, ఓపీవోనా మరే ఇతర విధులు నిర్వర్తించారు. ఎన్ని సార్లు పోలింగ్ విధులు నిర్వర్తించారు. తదితర వివరాలను, వారి నివాస ప్రాంతం, నియోజకవర్గం, సొంత ఊరు, సొంత నియోజకవర్గం ఎపిక్ కార్డు నెంబరు తదితర వివరాలను ప్రొఫార్మాలో పొందుపర్చాలని పేర్కొన్నారు.
జగన్ ఎత్తుకు కేంద్ర ఎన్నికల సంఘం పై ఎత్తు...
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో విధంగా ఉపాధ్యాయులు పాల్గొనకుండా చేసి, తాము తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఎన్నికలు జరిపించుకుని మరోసారి గద్దెనెక్కాలనుకున్న జగన్ సర్కార్ ఆశాలపై కేంద్ర ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల్లో కేటగిరీల వారీగా ఉద్యోగుల వివరాలతోపాటు ఉపాధ్యాయుల వివరాలు పంపాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో జిల్లాల్లోని రాబోయే శాసనసభ, పార్లమెంట్లు పోలింగ్ విధుల కోసం ఆయా యాజమాన్యాల్లోని ఉపాధ్యాయుల వివరాలు పంపాలని ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఆదేశాలు కింది స్థాయి అధికారులను ఆదేశించారు. చకచకా విద్యాశాఖాధికారులు వివరాలు పంపే పనిలో ఉన్నారు.దీంతో జగన్ సర్కార్ వెన్నులో వణుకు మొదలైంది. తమ ఎత్తు చిత్తయిందనే చింత మొదలైంది.
ఉపాధ్యాయులే కీరోల్...
ఉపాధ్యాయులు అంటే సహజంగా క్రమశిక్షణకు, నిబద్ధతకు మారుపేరుగా వ్యవహరిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగినా సార్వత్రిక ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు ఉపాధ్యాయులు పోలింగ్ విధుల్లో లేని ఎన్నికలేలేవు. గతంలో జరిగిన శాసనసభ, పార్లమెంటు ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులే ఎన్నికల విధులు నిర్వహించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో సహా ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వర్తించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయులపై వేధింపులకు దిగింది. దీంతో వారంతా జగన్‌పై గుర్రుగా ఉన్నారు.