Share News

ఇంత నిర్లక్ష్యమా?

ABN , Publish Date - May 08 , 2024 | 04:43 AM

అధికార పార్టీతో అంటకాగుతున్న ఉన్నతాధికారులపైన, సహచరులపైన కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) కొరడా ఝళిపిస్తున్నా.. ఇంకా కొందరు కలెక్టర్లు, ఎస్పీలు లెక్కచేయడం లేదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో ఈసీ గట్టి హెచ్చరిక చేసింది.

ఇంత నిర్లక్ష్యమా?

నలుగురు కలెక్టర్లు, ఐదుగురు ఎస్పీలకు ఈసీ హెచ్చరిక

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి.. శాంతిభద్రతల

బాధ్యత ఎస్పీలదే.. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి

తేడా వస్తే చర్యలు తప్పవని స్పష్టీకరణ

5 జిల్లాల్లో శాంతిభద్రతలపై దృష్టిపెట్టని ఎస్పీలు

వైసీపీకి అనుకూలంగా సీమలో ఇద్దరు కలెక్టర్లు!

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మరో ఇద్దరు

నిఘా పెట్టిన కమిషన్‌.. త్వరలో కొందరిపై వేటు?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అధికార పార్టీతో అంటకాగుతున్న ఉన్నతాధికారులపైన, సహచరులపైన కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) కొరడా ఝళిపిస్తున్నా.. ఇంకా కొందరు కలెక్టర్లు, ఎస్పీలు లెక్కచేయడం లేదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో ఈసీ గట్టి హెచ్చరిక చేసింది. ‘ఎన్నికల నిర్వహణలో తేడా రాకూడదు.

పోలింగ్‌ ప్రశాంతంగా జరగాలి. జిల్లాల్లో ఎక్కడ శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా ఎస్పీలదే బాధ్యత. వారు అప్రమత్తంగా ఉండాలి. ఐదు జిల్లాల ఎస్పీలు లా అండ్‌ ఆర్డర్‌పై దృష్టిపెట్టడం లేదు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగ్గించాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి’ అని ఆదేశించింది.

ముఖ్యంగా రాయలసీమలో రెండు జిల్లాల కలెక్టర్లు, ఉత్తరాంధ్రలో ఒకరు, గోదావరి జిల్లాల్లో ఇంకొక కలెక్టరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గుర్తించింది. వారు పక్షపాత ధోరణి తగ్గించుకుని, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రాజకీయం బాగా వేడెక్కడంతో పకడ్బందీగా, రాజకీయ హింసకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

అందులో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలపై పూర్తిస్థాయిలో నిఘా పెంచింది. రాయలసీమలోని మూడు జిల్లాలు, కోస్తా, ఉత్తరాంధ్రలో ఒక్కో జిల్లా ఎస్పీలపై నిఘా పెట్టింది. వీరు కొన్ని ఘటనల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించింది. గొడవలు, పరస్పర దాడులు, ఆందోళనలు జరిగిన తర్వాత మాత్రమే వీరు స్పందిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. సంఘటనలు జరగకముందే స్పందించి వాటిని నివారించాలని ఆదేశించింది.

ఆయా జిల్లాల్లో జరిగిన ఘటనలపై వివరణ కూడా కోరింది. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తినా, నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవన్న హెచ్చరిక జారీచేసింది. ఇప్పటికే మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్‌ ఐజీ, అనంతపురం రేంజ్‌ డీఐజీ, నిఘా చీఫ్‌తో పాటు ఏకంగా డీజీపీపైనే వేటు వేసినా కొంత మంది అధికారుల్లో మార్పు రావడం లేదు. వీరిపై డేగకన్ను వేసిన ఈసీ.. వచ్చే నాలుగు రోజుల్లో కొందరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది

Updated Date - May 08 , 2024 | 04:54 AM