Share News

అబద్ధాలతో ‘సిద్ధం’

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:23 AM

మూడు విమర్శలు, ఆరు అబద్ధాలు.. అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపైనా అబద్ధాలు. ప్రతిపక్ష నేతలపై చేస్తున్న ఆరోపణల్లోనూ అసత్యాలు, అబద్ధాలే వల్లె వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చానని జగన్‌ గొప్పలు

అబద్ధాలతో ‘సిద్ధం’

99% హామీలు అమలు చేశామని జగన్‌ గొప్పలు

హోదా, రైల్వేజోన్‌, స్టీల్‌ప్లాంట్‌ ఏవీ?

సంపూర్ణ మద్యపాన నిషేధం ఏదీ?

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల,

సీపీఎస్‌ రద్దు ఎక్కడ?

అతీగతీ లేని పోలవరం ప్రాజెక్టు

కీలక హామీలపై సీఎం మౌనం

వివేకా హత్యపై మళ్లీ డ్రామా

సొంతగడ్డపైనా బస్సు యాత్రకు

జనం నుంచి స్పందన కరువు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మూడు విమర్శలు, ఆరు అబద్ధాలు.. అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపైనా అబద్ధాలు. ప్రతిపక్ష నేతలపై చేస్తున్న ఆరోపణల్లోనూ అసత్యాలు, అబద్ధాలే వల్లె వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చానని జగన్‌ గొప్పలు చెబుతున్నారు. ఓసారి 2019 ఎన్నికల సమయంలో జగన్‌ ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటే.. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌, దుగరాజపట్నం పోర్టు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అర్హులందరికీ ఇళ్లు, ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌, సీపీఎస్‌ రద్దు వంటి కీలక హామీలు ఇచ్చారు. వీటిలో ఒక్కంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ హామీలను ప్రజలు మరచిపోయుంటారనేమో కానీ 99 శాతం అమలు చేశామని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. హామీలను నెరవేర్చకుండా మహిళలు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, పేదలు, అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారు.

ప్రత్యేక హోదా ఏదీ?

25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని గత ఎన్నికల ముందు జగన్‌ ఊరూవాడా చెప్పారు. జగన్‌ మాటలను నమ్మి ప్రజలు 2019 ఎన్నికల్లో 22 మంది లోక్‌సభ సభ్యులను ఇస్తే.. కేంద్రం మెడలు వంచకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల వద్ద ఆయన సాగిలపడ్డారు. హోదా ఇవ్వాలంటూ గట్టిగా అడిగే సాహసం చేయలేకపోయారు.

పోలవరం ఎప్పుడు?

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై జగన్‌ సర్కారు చెప్పిన గడువులు దాటిపోయాయి కానీ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. రూ.1548 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును, టెండర్లను రద్దు చేసి, కాలయాపన చేసి ఛిద్రమయ్యేలా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.

స్టీల్‌ ప్లాంట్‌ ఏమైంది?

సొంత జిల్లా కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంతో పాటు దుగరాజపట్నం పోర్టు అతీగతీ లేదు.

జాబ్‌ క్యాలెండర్‌ ఏదీ?

జగన్‌ సర్కారు వచ్చాక 5 జనవరి నెలలు వెళ్లిపోయాయి కానీ ఆయన చెప్పినట్టుగా ఒక్క ఏడాది కూడా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదు.

సీపీఎస్‌ రద్దు ఏదీ?

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎ్‌సను రద్దు చేసి పాత పింఛను విధానం అమల్లోకి తెస్తానన్న హామీని కూడా జగన్‌ అటకెక్కించారు. పాత పింఛను విధానం వల్ల భారీగా ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతుందని, తెలియక హామీ ఇచ్చానని జగన్‌ మాట తప్పారు.

ఊసే లేని రైల్వేజోన్‌

విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని అసలు పట్టించుకోనే లేదు. రైల్వే జోన్‌ను కేంద్రం మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. స్వయంగా కేంద్రమే ఈ విషయం వెల్లడించింది. దీన్ని బట్టి జగన్‌ ప్రభుత్వం ఎంత అలసత్వం చూపుతోందో అర్థమవుతుంది.

ఓట్లు అడగనన్నారే...

దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్న హామీని జగన్‌ గాలికొదిలేశారు. సర్కారీ మద్యం షాపుల ద్వారా విచ్చలవిడిగా ‘సొంత బ్రాండ్లు’ అమ్మిస్తున్నారు. జగన్‌ చెప్పినట్టుగా ఆయన ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు అనర్హులు.

రైతులకు మోసం

రైతులకు పంటలకు మద్దతు ధర, పంట నష్టసాయం, ఉచిత బోర్లు.. ఇలా పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారు.

విద్యుత్‌ చార్జీల వాత

తాను అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోనని ప్రకటించిన జగన్‌.. ఐదేళ్లలో రూ.64,000 కోట్ల విద్యుత్‌ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపారు.

నమ్మని జనం

ముఖ్యమంత్రి జగన్‌ అబద్ధాలు చెప్పి మభ్యపెట్టాలని చూసినా జనం నమ్మడం లేదు. గత ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన మాటలను వారింకా మరచిపోలేదు. అందుకే .. జగన్‌ యాత్రలకు జనం రావడం లేదు. వచ్చినవారూ ఆయన అబద్ధాలను భరించలేక ప్రసంగం మధ్యలోనే బయటకొచ్చేస్తున్నారు. సొంతగడ్డ కడప జిల్లా నుంచే ఎన్నికల ప్రచారాన్ని చేపడితే.. ఆరంభం అదిరిపోతుందని జగన్‌ ఆశించారు. కానీ ఇడుపులపాయలో బస్సుయాత్ర ప్రారంభం నుంచే తుస్సు మంది. సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీంతో జగన్‌ నిస్పృహతో మాట్లాడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Updated Date - Mar 30 , 2024 | 06:23 AM