Share News

‘బొండా’ వైపు గులకరాయు గురి!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:59 AM

సీఎం జగన్‌పై పడిన ‘గులకరాయి’.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైపునకు మళ్లుతోందా? ఆయనను కేసులో ఇరికించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా? దానికి అనుగుణంగానే పోలీసుల

‘బొండా’ వైపు గులకరాయు గురి!

టీడీపీ నేతను ఇరికించే ప్రయత్నం

పోలీసుల అదుపులో ఉమా అనుచరుడు

మొత్తం ఆరుగురు నిందితుల విచారణ

సీపీ ఆఫీస్‌ ముందు బాధిత కుటుంబాల నిరసన

అనంతరం ఏసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన

తమ బిడ్డలను చూపించాలని వేడుకోలు

బాధితుల తరఫున రంగంలోకి కోడికత్తి లాయర్‌

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేస్తానన్న సలీం

విజయవాడ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌పై పడిన ‘గులకరాయి’.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైపునకు మళ్లుతోందా? ఆయనను కేసులో ఇరికించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా? దానికి అనుగుణంగానే పోలీసుల దర్యాప్తు సాగుతోందా? అంటే.. జరుగుతున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో ఇప్పటి వరకు ఐదుగురు మైనర్లు ఉన్నారు. తాజాగా టీడీపీకి చెందిన వేముల దుర్గారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు వడ్డెర కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కొద్దినెలల కిందటే ఈయన టీడీపీలో చేరారు. తాజాగా దుర్గారావును కూడా అదుపులోకి తీసుకోవడంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నవారి సంఖ్య ఆరుకి చేరింది. ముందుగా అదుపులోకి తీసుకున్న ఐదుగురు మైనర్లలో ఒకరు.. గులకరాయి విసిరాడని పోలీసులు లీక్‌లు ఇచ్చారు. తాజాగా మంగళవారం సాయంత్రం ఒక టీస్టాల్‌ వద్ద ఉన్న దుర్గారావును పేరు అడిగి మరీ జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ దుర్గారావు కనిపించకపోయేసరికి ఆందోళన చెందారు. దుర్గారావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దుర్గారావు సోదరుడు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు బొండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

మరో అనుమానం

టీడీపీ కార్యకర్తగా, బొండా ఉమా కార్యాలయ వ్యవహారాలు చూసే వ్యక్తిగా ఉన్న దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పటి వరకు ఉన్న అనుమానాలకుతోడు కొత్త సందేహాలు రేకెత్తుతున్నాయి. దుర్గారావును పావుగా ఉపయోగించుకుని విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బొండా ఉమాను కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. టీడీపీ నేతలూ ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుర్గారావును ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని తెలిసింది. సీఎం జగన్‌ అజిత్‌సింగ్‌ నగర్‌లో రోడ్‌షో నిర్వహించినప్పుడు ఆ ప్రాంతంలో లేని వ్యక్తులను ఎలా అనుమానిస్తారని నిందితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కేవలం బొండా ఉమాను కేసులో ఇరికించడానికి పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్లను అదుపులోకి తీసుకోగానే దర్యాప్తుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు దుర్గారావును కూడా అదుపులోకి తీసుకోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

విచారణ అయ్యాక పంపుతాం: ఏసీపీ

పోలీసుల అదుపులో ఉన్న నిందితుల కుటుంబ సభ్యులు విజయవాడలోని పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు. వడ్డెర కాలనీ నుంచి బాధితుల కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు బైఠాయించారు. కొద్దిసేపు అక్కడ ధర్నా చేశారు. పోలీసు సిబ్బంది వారిని ఆటోల్లో ఎక్కించి అక్కడి నుంచి సత్యనారాయణపురంలో ఉన్న నార్త్‌ జోన్‌ ఏసీపీ కార్యాలయానికి పంపారు. అక్కడ కూడా బాధితులు కొంతసేపు నిరసన తెలిపారు. తర్వాత ఏసీపీ దేవరకొండ ప్రసాద్‌ బాధితులతో చర్చించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, నిజనిర్ధారణ పూర్తయిన తర్వాత తమ అదుపులో ఉన్నవారిని ఇళ్లకు పంపుతామని చెప్పారు. దీంతో బాధితులు ఆందోళనను విరమించారు.

న్యాయవాది సలీం పరామర్శ

‘‘గులకరాయి కేసులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఐదుగురు బాలురే ఉన్నారు. ఇది మరో కోడికత్తి కేసులా అనిపిస్తోంది. కాబట్టి బాధితులకు అండగా ఉంటా’’ అని కోడికత్తి కేసులో న్యాయవాదిగా ఉన్న అబ్దుల్‌ సలీం చెప్పారు. బుధవారం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వద్దకు వచ్చిన అబ్దుల్‌ సలీం వడ్డెరకాలనీ వాసులతో మాట్లాడారు. జరిగిన విషయంపై ఆరా తీశారు. అజిత్‌సింగ్‌నగర్‌ సీఐతో మాట్లాడారు. పీఎస్‌ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘సీఎంపై రాళ్లదాడి కేసులో మొత్తం ఆరుగురు వడ్డెర కాలనీ వాసులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో మైనర్లు కూడా ఉన్నారు. ఎవరినైనా ఏ కేసులోనైనా పోలీసులు అదుపులోకి తీసుకుంటే 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలి. 48 గంటలు దాటుతున్నా పోలీసులు విచారణ పేరుతో అదుపులో ఉంచారు. ఇది చట్ట విరుద్ధం. ఈ విషయమై అవసరమైతే సెర్చ్‌వారెంట్‌ వేస్తాం.’ అని అబ్దుల్‌ సలీం హామీ ఇచ్చారు.

నా భర్తతో మాట్లాడించండి

దుర్గారావుపై మోయలేని నిందను మోపారు. ఆయనకు ఏ పాపం తెలీదు. కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదు. నా భర్తను ఏం చేశారో తెలీదు. పిల్లలను ఓదార్చలేకపోతున్నా. దయచేసి నా భర్తను చూపించండి.

- శాంతి, దుర్గారావు భార్య

నా బిడ్డది ప్రశ్నించే గుణం

దుర్గారావుది.. తప్పు జరిగితే ప్రశ్నించే గుణం. నలుగురికి మంచి జరుగుతుందనుకున్నప్పుడు ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించిన మాట వాస్తవం. అలాంటి విషయాలను మనసులో పెట్టుకుని ఈ విధంగా చేయడం సరికాదు. కొద్దిరోజుల కిందట బొండా ఉమా మా వద్దకు వచ్చారు. ఎన్నికల్లో ఆయన సహకరించమని అడిగారు. దుర్గారావు మా గూడెం కోసం సరేనన్నాడు. అంతేతప్ప వేరే ఉద్దేశం లేదు. నా బిడ్డ చాలా మంచి వ్యక్తి. ఎవరో పిల్లాడు రాయి విసిరితే మా అబ్బాయిని అరెస్టు చేయడం ఏంటి? ఇంట్లో నుంచి దుర్గారావు టీస్టాల్‌ వద్దకు వెళ్లాడు. అక్కడికి వచ్చిన పోలీసులు జీపులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. దుర్గారావు పేరు చెప్పిన వారెవరో చెప్పాలి కదా! పోలీసుల అదుపులో ఉన్న పిల్లల తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు.

- గురవమ్మ, దుర్గారావు తల్లి

Updated Date - Apr 18 , 2024 | 03:59 AM