Share News

సమర్థంగా ప్రజాస్వామ్య పండగ

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:56 AM

ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకే్‌షకుమార్‌ మీనా ధన్యవాదాలు తెలిపారు.

సమర్థంగా ప్రజాస్వామ్య పండగ

ఎన్నికల యంత్రాంగానికి అభినందనలు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా

అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకే్‌షకుమార్‌ మీనా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తి చేసినందుకు మొత్తం ప్రక్రియను అత్యంత సమర్థంగా, ప్రొఫెషనల్‌ పద్ధతిలో నిర్వహించినందుకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇటువంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తున్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానన్నారు. ప్రజాస్వామ్య పండుగను విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుసరించిన మంచి పద్ధతులను భవిష్యత్తు తరాల వారికి ఎంతో ఆదర్శంగా మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక కరదీపికను రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ సదర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుసరించిన వినూతన్న పద్ధతులను భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లేందుకు నివేదికలను తమ కార్యాలయానికి మూడు రోజుల్లో పంపాలని ఆయన కోరారు. అన్ని జిల్లాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి భారత ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు.

ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విమర్శలకు ఆస్కారం లేకుండా రూపొందించిన శుద్ధమైన ఓట్ల జాబితాలు ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి నాంది పలికిందన్నారు. శుద్ధమైన ఓట్ల జాబితా రూపొందించేందుకు కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకూ ప్రజలకూ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం 2024 మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేంత వరకూ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకూ ఉన్న ఎన్నికల యంత్రాంగం, పోలీస్‌ యంత్రాంగం, ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తూ వారి వారి విధులను సక్రమంగా నిర్వహించారన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ యంత్రాంగం అవిరళ కృషి చేసిందని అభినందించారు. .

అసెంబ్లీ రద్దు... గవర్నర్‌ ఉత్తర్వులు

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అసెంబ్లీని రద్దు చేశారు. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజున మళ్లీ అసెంబ్లీ ఏర్పాటవుతుంది. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తర్వాత కొత్త ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది.

Updated Date - Jun 06 , 2024 | 03:56 AM