Share News

మీ చదువులు మాకొద్దు!

ABN , Publish Date - Feb 20 , 2024 | 06:02 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘ఆర్టికల్‌ 371డీ’ని విభజన తర్వాతా పదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించారు. దీని ప్రకారం రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 15 శాతం ‘ఓపెన్‌ కోటా’ అమలవుతోంది.

మీ చదువులు మాకొద్దు!

తెలంగాణలో ఏపీ విద్యార్థులకు తలుపులు మూసేస్తున్న జగన్‌ సర్కారు

15 శాతం ఓపెన్‌ కోటాకు గుడ్‌ బై

పదేళ్లు ముగిసిందంటూ ప్రత్యేక సమీక్ష

రాష్ట్రపతి ఉత్తర్వులపై అధ్యయనానికి కమిటీ

ఏపీలో ఇంజనీరింగ్‌ చదువులకు జగన్‌ చెదలు

ఇప్పటికీ తెలంగాణ కాలేజీలపైనే క్రేజ్‌

15% కోటాతో ఏపీ విద్యార్థులకు ఎంతో మేలు

తెలంగాణ నో అనకముందే జగన్‌ అత్యుత్సాహం

హైదరాబాద్‌ ‘ఉమ్మడి రాజధాని’పై ఆసక్తి

విద్యార్థులకు అవకాశాలపై ఏదీ శ్రద్ధ?

మంచి అవకాశాలను.. అందునా విద్యార్థులకు ఉపయోగపడే అవకాశాలను వీలైనంత ఎక్కువకాలం అందిపుచ్చుకోవాలనుకోవడం ఎవరైనా చేసే పని. కానీ... మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తీరే వేరు! ఆయనది ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్న చందం! తెలంగాణలో ఆంధ్రా స్థానికత ఉన్న విద్యార్థులకు ఉన్న అవకాశాలు ‘మాకొద్దు పోండి’ అని ఏపీ సర్కారు తనంతట తానే కాలదన్నేసింది. దీనిపై అధ్యయనానికి కమిటీ కూడా వేసేసింది. ‘మీ విద్యార్థులకు అవకాశాలు ఇచ్చేది లేదు’ అని తెలంగాణ సర్కారు చెప్పకముందే జగన్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడంపై విద్యా నిపుణులు విస్తుపోతున్నారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘ఆర్టికల్‌ 371డీ’ని విభజన తర్వాతా పదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించారు. దీని ప్రకారం రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 15 శాతం ‘ఓపెన్‌ కోటా’ అమలవుతోంది. దీనిని రాష్ట్ర విభజన చట్టంలోని 95డీ సెక్షన్‌లో చేర్చారు. 2024 జూన్‌ 2వ తేదీతో విభజన జరిగి పదేళ్లవుతున్న నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి దీనిపై సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఉన్నత విద్యాశాఖ, ఆర్థిక, న్యాయ శాఖ, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ‘‘సెక్షన్‌ 95డీని కొనసాగించడం వల్ల ఏపీ విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం లేదని గత ఏడాది డిసెంబరు 12వ తేదీనే సూత్రప్రాయంగా తేల్చేశాం. దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడమా... లేక కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడమా అన్నది నిర్ణయించాలి’’ అంటూ సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీనిపై అధ్యయనం చేసేందుకు సీఎస్‌ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పఽశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యదర్శి, ఉన్నతవిద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, ఆయా రంగాల్లో నిపుణులను సభ్యులుగా నియమించారు.

హైదరాబాద్‌పై ఉన్న శ్రద్ధ... విద్యపై లేదా?

‘పరిపాలనా రాజధాని ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల హైదరాబాద్‌ను మరో రెండేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి’ అంటూ కొత్త పల్లవి అందుకున్న సంగతి తెలిసిందే. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కేంద్రం నోటిఫై చేసిన వెంటనే... ‘ఉమ్మడి’ కథ ముగిసింది. అయినా సరే... విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా హైదరాబాద్‌ను వదులుకోలేం అని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. కానీ... తెలంగాణలోని విద్యా సంస్థల్లో మన విద్యార్థులకు దక్కే సీట్లను మాత్రం వదులుకుంటారట! మెడికల్‌ అడ్మిషన్లకు సంబంధించి ఎవరి రాష్ట్రంలోని సీట్లను వారే నింపుకునేలా ఇదివరకే నిర్ణయం జరిగిపోయింది. కానీ... ఇతర విద్యా సంస్థల విషయంలో తెలంగాణతో పోల్చితే ఏపీ ఇంకా వెనుకబడే ఉంది. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్‌ కాలేజీ అడ్మిషన్ల కోసం ఇప్పటికీ ఏపీ విద్యార్థులు తెలంగాణ వైపే చూస్తున్నారు. ఏపీలో పేరున్న ఇంజనీరింగ్‌ కాలేజీలు ఎక్కువగా లేకపోవడం ఒక ప్రధాన సమస్య. ఉన్న కొద్దిపాటి మంచి కాలేజీలనూ ‘ఫీజుల్లో కోతపెట్టడం’, ఇతరత్రా ఆంక్షలతో జగన్‌ సర్కారు రాచిరంపాన పెడుతోంది. విద్యా ప్రమాణాలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ, ఎన్‌ఐటీల తర్వాత ఏపీకి చెందిన మెరిట్‌ విద్యార్థులు తెలంగాణలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 15శాతం ఓపెన్‌ కోటాలో అత్యధికంగా ఏపీ విద్యార్థులే సీట్లు సాధిస్తున్నారు. గత ఏడాది ఏకంగా 40వేల మంది ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులు తెలంగాణ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ కోసం పోటీపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు... 15 శాతం ఓపెన్‌ కేటగిరీ సీట్లను ‘స్వచ్ఛందం’గా వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వమే చర్యలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది.

ఎవరు అడిగారని?

పదేళ్లు పూర్తయినప్పటికీ... కొన్ని ప్రత్యేక పరిస్థితుల రీత్యా మరికొన్నేళ్లు 15 శాతం ఓపెన్‌ కోటా కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించవచ్చు. దీనికి తెలంగాణ అంగీకరిస్తే మంచిదే. లేకపోతే... దీనిపై కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. అన్నింటికీ మించి... ‘విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్నందున ఎవరి సీట్లు వాళ్లే భర్తీ చేసుకుందాం. మా కాలేజీల్లో మీ విద్యార్థులకు సీట్లు ఇవ్వం’ అని తెలంగాణ చెప్పనే లేదు. మన రాష్ట్రానికి సమాచారమూ ఇవ్వలేదు. ‘మా కాలేజీల్లో సీట్లు మీకు ఇవ్వం’ అని తెలంగాణ చెప్పినట్లు కానీ... ఏపీ విద్యార్థులకు ఇంకొంతకాలం అవకాశాలు కల్పించాలని జగన్‌ ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగానీ సోమవారం ఇచ్చిన గెజిట్‌లో లేనే లేదు. ఇది ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనంతట తాను వద్దన్నప్పటికీ... ‘మరికొన్నేళ్లు కొనసాగిద్దాం ప్లీజ్‌’ అని అడగాల్సింది పోయి, తనతంతట తానే తలుపులు మూసేస్తుండటం గమనార్హం. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమే.

విద్యార్థులపై ఎందుకీ కక్ష

వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే జీవో నంబర్‌ 77 తీసుకొచ్చింది. ఎయిడెడ్‌, ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్‌ కోటాల్లో సీటు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు అందవనేది దీని సారాంశం. ఉన్నత విద్యలో అత్యధిక సీట్లున్నవి, డిమాండ్‌ ఎక్కువ ఉన్న కాలేజీలు ఎయిడెడ్‌, ప్రైవేటు రంగంలోనివే. ఆ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్లు, స్కాలర్‌షిప్పులు రావని ఈ జీవోద్వారా విద్యార్థుల నెత్తిన పిడుగు పడేశారు. ఉద్యోగాలు కల్పించడంలో ఎలాగూ వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. కనీసం విద్యార్థులను ఉన్నత విద్యా కోర్సులను చదువుకోనివ్వడం లేదు. నాలుగేళ్ల పాటు విదేశీ విద్యను రద్దు చేసి చివరి ఏడాదిలో ప్రవేశపెట్టారు. దీని అమలుపై కూడా అనేక సందేహాలు. డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అరకొరగానే ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని విద్యార్థులకు దేశంలో ఉన్న ఏ కోచింగ్‌ సెంటర్‌లోనైనా సివిల్స్‌, రైల్వేస్‌, ఎస్‌ఎ్‌ససీ, గ్రూప్స్‌, ఇతర పోటీ పరీక్షలన్నింటికి ఉచితంగా కోచింగ్‌ తీసుకునే అవకాశం కల్పించారు. జగన్‌ వచ్చాక ఈ పథకం మాయమైపోయింది. అలాగే, టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు టీడీపీ హయాంలో ప్రభుత్వమే ఫీజులు కట్టి వారిని కార్పొరేట్‌ ఇంటర్‌ కాలేజీల్లో చదివించింది. జగన్‌ హయాంలో ఈ పథకం కూడా రద్దు చేశారు. ఇప్పుడు... ఏపీలోనే కాదు, హైదరాబాద్‌లో కూడా విద్యార్థులకు చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 06:02 AM