‘విద్యా’ ప్రచారానికి బ్రేక్!
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:32 AM
ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల పేరుతో చేపట్టదలిచిన ప్రచారాన్ని నిలిపివేయాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.

ఆదేశాలను ఉపసంహరించుకున్న ఇంటర్ విద్యాశాఖ
స్పాట్ అడ్మిషన్ల పేరుతో ప్రచారానికి గతవారం ఆదేశం
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో గుర్తొచ్చిన ఎన్నికల కోడ్
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల పేరుతో చేపట్టదలిచిన ప్రచారాన్ని నిలిపివేయాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రచారం చేయాలని మార్చి 27న ఆ శాఖ ఆదేశాలు జారీచేసింది. పేరుకు పాఠశాలల్లో ప్రచారమే అయినా ఇంటింటికీ వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యా రంగంలో అమలుచేస్తున్న పథకాల గురించి ప్రచారం చేయాలని భావించింది. తద్వారా విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించమని అడగాలని జూనియర్ లెక్చరర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సూచించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి విధానం లేకపోవడంతో ఇది ఎన్నికల కోసమేనని జేఎల్స్, టీచర్లు ఒక అంచనాకు వచ్చారు. కానీ, టార్గెట్లు పెట్టి మరీ ప్రచారం చేయాలనడంతో ప్రచారానికి సిద్ధమయ్యారు. దీనిపై ‘చదువుల పేరిట చక్కబెట్టేద్దాం!’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల వేళ నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రచారం చేయాలన్న నిర్ణయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు కూడా చేశాయి. దీంతో అప్రమత్తమైన ఇంటర్ విద్యాశాఖ ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే కారణంతో ఈ ప్రచారాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని వెంటనే క్షేత్రస్థాయి అధికారులకు చేరవేయాలని ఆదేశిస్తూ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.