ఉమ్మడి కర్నూలులో వర్ష బీభత్సం
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:03 AM
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
సంజామల వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
ప్రాణాలతో బయటపడ్డ 14మంది ప్రయాణికులు
నంద్యాల టౌన్, జూన్ 6: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. పలుచోట్ల రహదారులు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు రవాణాసౌకర్యం నిలిచిపోయింది. నంద్యాల జిల్లా సంజామల, బేతంచర్ల, మిడ్తూరు తదితర మండలాల్లో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరదల కారణంగా సంజామల మండలంలోని పాలేరు వాగులో కోవెలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రమాద సూచికలు లేకపోవడంతో వాగులో బస్సు వెళ్తూ ఒరిగిపోయింది. పోలీసులు స్పందించి క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంలో 14 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
తిరుమలలో భారీ వర్షం
తిరుమల: తిరుమలలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం చల్లగా ఉండగా 3 గంటలకు చిరుజల్లులు మొదలయ్యాయి. అప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు దఫాలవారీగా వర్షం దంచికొట్టింది. శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, రోడ్లు, కాటేజీలు, పార్కులు జలమయమయ్యాయి. సాయంత్రం తర్వాత తిరుమలలో చలితీవ్రత పెరిగింది. మరోవైపు వర్షం ఆగిన సమయాల్లో తిరుమల క్షేత్రాన్ని, శేషాచల అడవులను దట్టమైన పొగమంచు కప్పేసింది.