Share News

ఒంగోలులో ఈడీ సోదాలు!

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:02 AM

ఒంగోలుకు చెందిన చదలవాడ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ డైరెక్టర్‌ చదలవాడ రవీంద్రబాబుకు చెందిన ఆస్తులపై హైదరాబాద్‌తోపాటు ఒంగోలులోనూ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు దాడులు చేశారు.

ఒంగోలులో ఈడీ సోదాలు!

చదలవాడ ఇన్‌ఫ్రాటెక్‌ డెరెక్టర్‌ ఇళ్లలో తనిఖీలు

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 6: ఒంగోలుకు చెందిన చదలవాడ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ డైరెక్టర్‌ చదలవాడ రవీంద్రబాబుకు చెందిన ఆస్తులపై హైదరాబాద్‌తోపాటు ఒంగోలులోనూ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు దాడులు చేశారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను మోసం చేసిన విషయంలో ఈడీ నేరుగా ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. రవీంద్రబాబు స్వగ్రామం ఒంగోలు సమీపంలోని మంగమూరు గ్రామం. స్థానికంగా ఆర్థిక వ్యవహారాలు, ఇతర పలు అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఆయన సంస్థ పేరుతో స్టేట్‌బ్యాంకులో రూ.166.93 కోట్లు రుణం తీసుకుని ఆ నగదును ఇతరులతో కలిసి దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. సీబీఐ, ఏసీబీ కేసు నమోదు కావడంతో దాని ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఉద్యోగులు, డైరెక్టర్ల ఖాతాల్లోకి రుణ మొత్తాన్ని మళ్లించినట్లు ఆయనపై కేసు నమోదైంది. అలాగే వాటితో కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు సంపాదించినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మంగమూరులోని ఇంటితోపాటు ఒంగోలులోని ఆయన నివాసం, హైదరాబాద్‌లో సంస్థ కార్యాలయంలో రెండురోజుల నుంచి సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో భాగంగా రవీంద్రబాబు ఆస్తి పత్రాలు, ఇతర ఆభరణాలు, నేరారోపణ పత్రాలు, డిజిటల్‌ పరికరాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 07:34 AM