Share News

మదనపల్లెలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:14 PM

సంక్రాంతి పండుగ అంటేనే చిన్నా, పెద్ద అందరూ ఉత్సాహంగా జరుపుకునే పెద్దపండుగ. వేల మైళ్ల దూరంలో వున్నా సంక్రాంతికి సొంత ఊరు చేరుకుని సంబరాలు చేసుకునే సాంప్రదాయం అనాధిగా వస్తోంది.

మదనపల్లెలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
సంప్రదాయ వస్త్రధారణలో ఆర్డీవో మురళి, అధికారులు, పురప్రముఖులు

సంప్రదాయ దుస్తులు.. గంగిరెద్దులు, బోగిమంటలు, హరిదాసులతో పండుగ శోభ

మదనపల్లెటౌన్‌, జనవరి 12: సంక్రాంతి పండుగ అంటేనే చిన్నా, పెద్ద అందరూ ఉత్సాహంగా జరుపుకునే పెద్దపండుగ. వేల మైళ్ల దూరంలో వున్నా సంక్రాంతికి సొంత ఊరు చేరుకుని సంబరాలు చేసుకునే సాంప్రదాయం అనాధిగా వస్తోంది. ఇలాంటి పండుగ విశిష్టత, సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకునేలా చేయాలని మదనపల్లెలో ఆర్డీవో మురళి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జడ్పీ హైస్కూల్లో దాతల సహాయ, సహకారాలతో, స్వచ్ఛంద సంస్థలు, పుర ప్రముఖులు సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించారు. మైదానం నలువైపులా నాలుగు వేదికలు ఏర్పాటు చేసి హరిదాసుచే హరికథలు, మరో వేదికపై వరాల ఆంజనేయస్వామి, సీతారాములు ఉట్టిపడేలా తాత్కాలిక ఆలయం, మరో వేదికపై సాంప్రదాయ నృత్యాలు, లంబాడీల నృత్యాలు, చిన్నారులచే కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు. దీంతో పాటు మైదానం నలువైపులా కోలాటాలు, చెక్కభజనలు చేస్తూ కళాకారులు ప్రజలను ఆకట్టుకున్నారు. వీటితో పాటు గంగిరెద్దులు, దేవరెద్దులు ప్రదర్శించారు. ఆర్డీవో మురళి, అరుణ దంపతులు మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే ప్రజల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, అలాంటి పండుగను మదనపల్లెలో ముందస్తుగా జరుపుకోవడం సంతోషంగా వుందన్నారు. అనంతరం ఆహుతులకు బెల్లంతో చేసిన పిండివంటలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టరేట్‌ డీఏవో శేషయ్య, తహసీల్దార్‌ మహబూబ్‌చాంద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, డీఎల్‌డీవో లక్ష్మీపతి, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ ఆర్‌.గురుప్రసాద్‌, వీఎస్‌ఆర్‌ గ్రాండ్‌ అధినేత వి.సుధాకర్‌రెడ్డి, శేఖర్‌ స్వీట్‌స్టాల్‌ యజమాని శేఖర్‌, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:14 PM