Share News

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:42 AM

జగన్‌ ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసింది. దాదాపు ఐదేళ్లపాటు ఒక్క టీచర్‌ పోస్టునూ భర్తీ చేయని ప్రభుత్వం..

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

6100 పోస్టుల్లో ఎస్జీటీ 2,280, స్కూల్‌ అసిస్టెంట్‌ 2,299

4 జిల్లాల్లో 300 దాటని ఖాళీలు.. ఎస్జీటీకి బీఈడీ వారూ అర్హులే

సంస్కరణలపై శిక్షణ కోసమే అప్రెంటీస్‌.. విద్యా మంత్రి ఉద్ఘాటన

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసింది. దాదాపు ఐదేళ్లపాటు ఒక్క టీచర్‌ పోస్టునూ భర్తీ చేయని ప్రభుత్వం.. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధిని ఆశిస్తూ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అయితే, ఎన్నికల సమయంలో భర్తీ ప్రక్రియ సజావుగా సాగుతుందా? లేదా? అనేదాంతో సంబంధం లేకుండా ‘నోటిఫికేషన్‌ ఇచ్చేశాం’ అన్న చందంగా ప్రక్రియను ప్రారంభించింది. డీఎస్సీకి సంబంధించి జీవో 11, 12లను సోమవారం పాఠశాల విద్యా శాఖ జారీచేసింది. సొసైటీల పరిధిలోని పోస్టులకు ఒక జీవో, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ప్రభుత్వ, మున్సిపల్‌ పాఠశాలల్లో పోస్టులకు మరో జీవోను విడుదల చేసింది. ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌, గిరిజన, బీసీ సంక్షేమ పాఠశాలలకు సొసైటీల పేరుతో ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తంగా 6,100 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులు 2,280, స్కూల్‌ అసిస్టెంట్‌(ఎ్‌సఏ) 2,299, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) 1,264 పోస్టులున్నాయి. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) పోస్టులు 215, ప్రిన్సిపాల్‌ పోస్టులు 42 ఉన్నాయి. ఇందులో టీజీటీ, పీజీటీ, ఫిజికల్‌ డైరెక్టర్‌, ప్రిన్సిపాల్‌ పోస్టులు జోనల్‌ పరిధిలోకి వస్తాయి. మిగతా పోస్టులను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా భర్తీ చేస్తారు. జిల్లా సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు జరిగే పరీక్షలో డీఎస్సీకి 80 శాతం, టెట్‌కు 20శాతం వెయిటేజీ ఇస్తారు. పీఈటీలకు టెట్‌ ఉండదు కాబట్టి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ)ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. స్కూల్‌ అసిస్టెంట్‌లకు గ్రాడ్యుయేషన్‌, బీఈడీ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్జీటీలకు ఇంటర్మీడియట్‌, డీఎడ్‌ ఉండాలని తెలిపింది. అయితే, ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వయోపరిమితి జనరల్‌ అభ్యర్థులకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49, దివ్యాంగులకు 54గా నిర్ణయించింది. మొత్తం డీఎస్సీ పరీక్షలు కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో జరుగుతాయని వివరించింది. డీఎస్సీ కమిటీకి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, జేసీ వైస్‌ చైర్మన్‌గా, డీఈవో సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారని తెలిపింది.

వెబ్‌సైట్‌ ప్రారంభం

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం సచివాలయంలో డీఎస్సీకి సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల కోసం 9505619127, 9705655349 నంబర్లతో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి టీచర్‌ పోస్టుల్లో జీరో ఖాళీలు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక పై ఏటా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. తమ హయాంలో విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, వాటిపై శిక్షణ ఇవ్వడం కోసమే అప్రెంటీస్‌ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టామని మంత్రి తెలిపారు. ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని పార్లమెంటులో కేంద్రం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా... కేంద్రానికి ఆ సమాచారం తాము ఇవ్వలేదన్నారు.

బీఈడీ అభ్యర్థులు అర్హులే

బీఈడీ చేసినవారు ఎస్జీటీ పోస్టులకు అర్హులు కాదని సుప్రీంకోర్టు చెప్పలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. రాజస్థాన్‌ విషయంలో సుప్రీం తీర్పు వచ్చిందని, కానీ ఆ తర్వాత కూడా పలు రాష్ర్టాలు ఎస్జీటీ పోస్టులకు బీఈడీకి అర్హత కల్పించాయన్నారు. రాష్ట్రంలో కూడా అభ్యర్థుల వినతి మేరకు అదే విధానం అమలు చేస్తున్నామన్నారు. డీఎస్సీకి ఫిబ్రవరి 21 వరకు ఫీజులు చెల్లించవచ్చని, 22 వరకు దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు జోనల్‌ పోస్టులు, జిల్లా పోస్టులు రెండూ రాయొచ్చని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ స్పష్టం చేశారు.

నాలుగో వంతు కర్నూలులోనే

ప్రభుత్వం 6100 పోస్టులకు డీఎస్సీ ప్రకటిస్తే అందులో ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 1,693 పోస్టులున్నాయి. వీటిలో 1,022 ఎస్జీటీ, 550 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి. మిగిలిన జిల్లాల్లో ఒక్క ప్రకాశంలోనే 500 పోస్టులుపైబడి ఉన్నాయి. మరో నాలుగు జిల్లాల్లో 300 లోపే పోస్టులున్నాయి. శ్రీకాకుళంలో 283, విజయనగరంలో 284, కృష్ణాలో 279, కడపలో 289 పోస్టులున్నాయి. విశాఖపట్నం జిల్లాలో గిరిజన పాఠశాలలను మినహాయిస్తే జనరల్‌ ఎస్జీటీ పోస్టు లు కేవలం 14 ఉన్నాయి. వీటిలో టీజీటీ, పీజీటీ, పీడీ, ప్రిన్సిపాల్‌ పోస్టులను జోనల్‌ ప్రాతిపదికగా భర్తీ చేస్తారు.

Updated Date - Feb 13 , 2024 | 07:11 AM