Share News

Nara Lokesh: ఉత్తరాంధ్రను చంద్రబాబు అభివృద్ధి పథంలో నిలిపితే.. జగన్‌ గంజాయి కేంద్రంగా మార్చారు.. లోకేష్ విమర్శలు

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:43 AM

టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రకటించారు.

Nara Lokesh: ఉత్తరాంధ్రను చంద్రబాబు అభివృద్ధి పథంలో నిలిపితే.. జగన్‌ గంజాయి కేంద్రంగా మార్చారు.. లోకేష్ విమర్శలు

జగన్‌ నాలుగేళ్లు పడుకొని టీచర్‌ ఉద్యోగాలపై దగా: లోకేశ్‌

ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవ్‌!

ఊరికో ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. ఈ ప్రాంతానికి ఏం చేశాడు?

శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన 60 హామీల సంగతేంటి?

ఈ సీఎం ఉత్తరాంధ్రకు పట్టిన శని.. గంజాయికి రాజధానిగా మార్చేశారు

కేసుల గురించి భయపడొద్దు.. ఎక్కువ కేసులున్నవారికి నామినేటెడ్‌ పదవులు

పేటీఎం బ్యాచ్‌ కామెంట్లకు స్పందించొద్దు.. వారి కుట్రలను తిప్పికొట్టాలి

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వం.. అవసరమైతే రాష్ట్రమే కొంటుంది

టీడీపీ యువ నేత హామీ.. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి ‘శంఖారావం’ సభలు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రకటించారు. ఊరికో ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. ఉత్తరాంధ్రకు ఏం చేశాడని నిలదీశారు. తామొచ్చాక ఈ ప్రాంతం నుంచి వలసలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ‘శంఖారావం’ పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఆయన ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వ అరాచక పాలనపై విరుచుకుపడ్డారు. నాలుగేళ్లు పడుకొని ఇప్పుడు డీఎస్సీ అంటున్నారని ఆక్షేపించారు. ‘ప్రభుత్వంలో 2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి జగన్‌ మడమ తిప్పాడు. డీఎస్సీలో కేవలం 6వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ పాలనలో లక్షా 30 వేల పోస్టులు భర్తీ చేశాం. మళ్లీ వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం’ అని ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఎవరు పేదవాడు..?

సొంత చానల్‌, పేపర్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీ పెట్టుకున్న వాడు పేదవాడు అవుతాడా? రూ.లక్ష చెప్పులు వేసుకునేవాడు, రూ.వెయ్యి వాటర్‌ బాటిల్‌ తాగేవాడు పేదవాడు అవుతాడా? సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశాడు జగన్‌. సొంతింట్లో మహిళలకే భద్రత లేదంటే రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. తొమ్మిదిసార్లు కరెంట్‌ చార్జీలు, మూడుసార్లు ఆర్టీసీ, ఇంటిపన్ను, చెత్తపన్ను, క్వార్టర్‌ బాటిల్‌ను కూడా వదల్లేదు. టీడీపీ హయాంలోని వంద సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసిన వ్యక్తి జగన్‌రెడ్డి పదేపదే సిద్ధం అంటున్నారు. ఆయన జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.. మరి పంపడానికి మీరు (ప్రజలను ఉద్దేశించి) సిద్ధంగా ఉన్నారా?

గంజాయి రాజధానిగా మార్చేశారు

దివంగత గరిమెళ్ల సత్యన్నారాయణ, గౌతు లచ్చన్న వంటి యోధులు, శ్రీకాకుళం కీర్తిని జాతీయస్థాయిలో చాటిన ఎర్రన్నాయుడు వంటి వ్యక్తులను అందించిన గడ్డ శ్రీకాకుళం జిల్లా. నాకు ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మ ప్రేమకు కండిషన్స్‌ ఉండవు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రను అభివృద్థి పథంలో నిలిపితే.. జగన్‌ గంజాయి కేంద్రంగా మార్చారు. జగన్‌రెడ్డి మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడు. విశాఖకు ఒక్క కంపెనీ తీసుకురాలేదు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలకు భూములు కేటాయించాం. జగన్‌ మాత్రం విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్నాడు. రైల్వేజోన్‌కు భూమి కేటాయించలేదు. టీడీపీ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి కాపాడేలా చర్యలు తీసుకుంటాం. తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డిపై ఏకంగా వంద కేసులు నమోదయ్యాయి. నాపై 22 కేసులు పెట్టారు. తగ్గేదే లేదు. అక్రమ కేసుల పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదు. చంద్రబాబును 53 రోజులు జైలులో బంధించారు. శంఖారావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకు వెళ్లాలి. జగన్‌ లేని ఆంధ్రప్రదేశ్‌గా లక్ష్యం పెట్టుకుంటాం. కేసుల గురించి భయపడొద్దు. ఎవరిపైన ఎక్కువ కేసులుంటాయో.. వారికే నామినేటెడ్‌ పదవులు ఇస్తాం.

గొడవలు పెట్టే యత్నం..

రూ.5పేటీఎం బ్యాచ్‌ మనకు, జనసేన కేడర్‌కు గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల కార్యకర్తలు అప్రమత్తంగా వారి కుట్రలను తిప్పికొట్టాలి. రాబోయే రెండు నెలలు కష్టపడండి. రాబోయే ఐదేళ్లలో కార్యకర్తల బాధ్యత నేను చూసుకుంటాను. లేని కేసులో.. చంద్రబాబును అరెస్టు చేశారని తెలిసి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెనువెంటనే ఆయన్ను చూసేందుకు ప్రత్యేక విమానంలో వచ్చేందుకు ప్రయత్నిస్తే అనుమతి ఇవ్వలేదు. రోడ్డుపై 3గంటలు ఇబ్బందిపెట్టారు. ఆయన లక్ష్యం ఒక్కటే.. వైసీపీని ఇంటికి పంపించేయడమే. హలో ఏపీ.. బైబై వైసీపీ. కష్టకాలంలో నాకు అన్నగా.. అండగా పవన్‌ నిలిచారు.

కొండలను మింగేస్తున్న మంత్రి

పలాసలో కొండలను మింగే అనకొండ అప్పలరాజు.. మంత్రిగా పలాసకు ఒక్క పని కూడా చేయలేదు. అహంకారానికి మానవ రూపం.. ఆయన పేరుకే డాక్టర్‌. వాస్తవంలో ఆయన మంచి యాక్టర్‌. ఆయన కొండలరాజు. కొండలు కొండలే తవ్వేస్తున్నారు. మంత్రిగారికి ఒకటే చెబుతున్నా.. రెండు నెలలు ఓపిక పట్టు బ్రదర్‌. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మొత్తం ఎంక్వైరీ వేసి వడ్డీతో కక్కిస్తాం. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలనే వేధిస్తున్నాడు ఈ మంత్రి తాను కూడా పేదవాడినని అంటున్నాడు. రూ.12 కోట్ల విలువైన లాడ్జి ఎలా కొన్నాడో చెప్పాలి. బర్రెల కొనుగోళ్లలో కూడా కుంభకోణం చేయవచ్చని నిరూపించాడు. రూ.2 వేల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేశాడు. నువ్వలరేవులో నగేశ్‌ అనే మత్స్యకారుడు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయాడో తెలియదు. మంత్రి లాలూచీపడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం చేయలేదు. పలాస నియోజకవర్గంలో ఐదుగురు మహిళల శవాలు దొరికాయి. వారి కుటుంబాలకు న్యాయం చేయలేదు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక మొదటి వంద రోజుల్లో ఆయా కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా.

యువనేతకు ఉద్దానం పంటల కావడి

లోకేశ్‌కు పలాస నియోజకవర్గ టీడీపీ నాయకులు ఉద్దానం జీవధార పంటలైన జీడి, కొబ్బరి చెట్లను కావడిలో వేసి ఇచ్చారు. వాటిని ఆయన తన భుజంపై పెట్టుకుని వేదిక వద్దకు వచ్చారు. ఎక్స్‌కవేటర్‌ సహాయంతో గజమాలను లోకేశ్‌కు వేశారు. పలాస జీడిపప్పు గుచ్ఛాన్ని వ్యాపారులు అందజేశారు.

సీపీఎస్‌ రద్దు చేయాలన్న సంఘాలు..

సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు లోకేశ్‌కు వినతిపత్రం అందించారు. తమ ప్రభుత్వం వస్తే ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - Feb 12 , 2024 | 07:38 AM