ఒంగోలులో డ్రగ్స్ కలకలం
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:42 AM
ప్రకాశం జిల్లా ఒంగోలులో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ ప్రైవేటు కళాశాలకు సర్టిఫికెట్ల కోసం వచ్చిన ఇంటర్ విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్థి
చికిత్స చేయించినా పూర్తిగా కోలుకోని వైనం
కూల్‌డ్రింక్‌లో కలిపి తాగించారని తల్లిదండ్రుల ఆరోపణ
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
ఒంగోలు (క్రైం), జూలై 14 : ప్రకాశం జిల్లా ఒంగోలులో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ ప్రైవేటు కళాశాలకు సర్టిఫికెట్ల కోసం వచ్చిన ఇంటర్ విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడికి వైద్యశాలలో చికిత్స చేయించినా పూర్తిగా కోలుకోలేదు. కూల్‌డ్రింక్‌లో మత్తుపదార్థం కలిపి తాగించారని స్నేహితులపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరూ విద్యార్థులు కావడంతో పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టారు. వివరాలివీ.. నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన ఉలవపాడుకు చెందిన విద్యార్థి ఒంగోలులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఆయన ఈనెల 7వతేదీ బస్సులో ఒంగోలు వచ్చాడు. కళాశాల వద్ద అతడు ఒక్కసారిగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్నేహితులు అతడిని స్థానిక జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వచ్చి కుమారుడిని మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. రెండు రోజులపాటు అక్కడ చికిత్స చేయించిన అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆ విద్యార్థి పూర్తిగా కోలుకోలేదు. మగతగానే ఉండటంతో అనుమానం వచ్చి శుక్రవారం ఒంగోలు వన్‌టౌన్ పోలీసులను సంప్రదించారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయినట్లు వారు చెప్తున్నారు. తిరిగి శనివారం రాత్రి మరోసారి వచ్చి ఫిర్యాదు చేశారు. తమ కొడుకుకు మత్తుపదార్థం తాగించారని ఆరోపించారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. తల్లిదండ్రులు తొలిసారి వచ్చినప్పుడు ఫిర్యాదు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పోలీసులు ఏం చెప్తున్నారంటే..
ఉలవపాడు విద్యార్థి ఒంగోలు వస్తున్నట్లు చీమకుర్తి, నగర పరిధిలోని కొప్పోలు, ఇందిరమ్మ కాలనీకి చెందిన ముగ్గురు స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారంతా బస్టాండ్‌కు చేరుకున్నారు. నలుగురూ కలిసి తాము చదువుకున్న కాలేజీకి వెళ్లారు. అక్కడ సర్టిఫికెట్ల గురించి అడగ్గా సిబ్బంది.. ‘సదరు సెక్షన్ ఉద్యోగి లేరు, తరువాత రండి’ అని చెప్పడంతో వారు మంగమూరురోడ్డులో బీరు, మద్యం కొనుగోలు చేసి సేవించారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ కళాశాలకు వెళ్లారు. అక్కడ ఉలవపాడుకు చెందిన విద్యార్థి అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాగా, విద్యార్థులు మద్యంలో డ్రగ్స్ కలిపి తాగించినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని ఒంగోలు వన్‌టౌన్ సీఐ అల్లీసాహెబ్ తెలిపారు. ఉలవపాడుకు చెందిన విద్యార్థి మద్యంలో నీళ్లు కూడా కలుపుకోకుండా తాగినట్లు అతడి స్నేహితులు చెప్తున్నారన్నారు.