Share News

వర్షాకాలంలోనూ తాగునీటికి కటకట

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:57 PM

గ్రామ పంచాయతీ పాలకులు, సంబంధిత ఆర్డబ్ల్యూఎస్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల మండలంలోని ఆలిగేరా గ్రామంలో తాగునీటి కోసం గ్రామస్థులు పడరాని పాట్లు పడుతున్నారు.

వర్షాకాలంలోనూ తాగునీటికి కటకట
అలిగేరలో మినీ ట్యాంకుల వద్ద తాగునీటి కోసం బిందెలను వంతులుగా పెట్టుకున్న గ్రామస్థులు

నెల రోజులైనా నాగనతనహళ్లి రిజర్వాయర్‌ స్కీమ్‌ నీళ్లేవి?

అలిగేర గ్రామస్థులకు బోరుబావులే దిక్కు

ప్లోరైడ్‌ బారిన పడుతున్న గ్రామస్థులు

పట్టని ఆర్‌డబ్ల్యూఎస్‌, గ్రామ పంచాయతీ అధికారులు

ఆస్పరి, జూన్‌ 9: గ్రామ పంచాయతీ పాలకులు, సంబంధిత ఆర్డబ్ల్యూఎస్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల మండలంలోని ఆలిగేరా గ్రామంలో తాగునీటి కోసం గ్రామస్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తాగునీటి వనరులు, పథకాలు ఉన్నా, వాటిని గ్రామస్థుల దరికి చేర్చడంలో విఫలమయ్యారు. ప్రస్తుత వర్షాకాలంలోనూ తాగునీటి కోసం గ్రామ సమీపంలోని బోరు బావులను ఆశ్రయిస్తూ నీటిని తెచ్చుకోవాల్సిన ధుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా లభించే నీటిని తాగుతూ, ప్లోరైడ్‌ బారిన పడుతున్నామని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు 6000 జనాభా ఉన్న గ్రామానికి నాగనాతనపల్లి రిజర్వాయర్‌ వాటర్‌ స్కీమ్‌ నీరు నెల రోజులకు ఒక్కసారి కూడా రావడం లేదు. ఎప్పుడు నీరు పంపిణీ చేస్తారో తెలియదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బోరు నీటి కోసం బిందెలను రోజుల తరబడి మినీ ట్యాంకులు వద్ద వంతులుగా పెడుతున్నారు... ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ నరేష్‌ను వివరణ కోరగా, మేము తాగునీటిని సక్రమంగా పంపిణీ చేస్తున్నాము. ఏమైనా విద్యుత్‌, పైప్‌లైన్‌ మరమ్మతులు చేసేటప్పుడు మాత్రమే నీటిని పంపిణీ చెయ్యడంలో కొంత ఆలస్యం అవుతందని, ఏదైనా సమస్య ఉంటే గ్రామపంచాయతీ చూసుకోవాలి అని వివరణ ఇచ్చారు...

తాగునీటి కష్టాలు తీరేది ఎన్నడో

మా గ్రామంలో తాగునీటి సమస్యను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌, గ్రామపంచాయతీ అధికారులు, సర్పంచుకు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదు. తాగునీటి కష్టాలు ఎప్పుడు తీరుతాయో.

- బసవరాజు, అలిగేర గ్రామం

నెల రోజులైనా రిజర్వాయర్‌ నీరు సరఫరా కాలేదు

నాగనాతనపల్లి వాటర్‌ రిజర్వాయర్‌ స్కీమ్‌ మా గ్రామానికి అనుసంధానం చేశారు. నెల రోజులు గడిచినా ఆ నీరు సరఫరా కావడం లేదు. ఈ విషయమై మండల ఉన్నత అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. - పోలికంటయ్య, అలిగేర గ్రామం

Updated Date - Jun 09 , 2024 | 11:57 PM