Share News

టెట్‌ ఫలితాల్లో నాటకం

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:51 AM

ఎన్నికలకు ముందు సాధ్యం కాదని తెలిసినా నిరుద్యోగులను మోసం చేసేలా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన జగన్‌ సర్కారు అసలు ఉద్దేశం బయటపడుతోంది.

టెట్‌ ఫలితాల్లో నాటకం

షెడ్యూలు ప్రకారం 14నే విడుదల చేయాలి

కోడ్‌ వచ్చేవరకు పాఠశాల విద్యాశాఖ మౌనం

ఇప్పుడు ఈసీ అనుమతికి పంపామని సాకు

డీఎస్సీ పరీక్షల నిర్వహణ కూడా కష్టమే!

టెట్‌ ఫీజులు వెనక్కి ఇవ్వకుండా తాత్సారం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎన్నికలకు ముందు సాధ్యం కాదని తెలిసినా నిరుద్యోగులను మోసం చేసేలా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన జగన్‌ సర్కారు అసలు ఉద్దేశం బయటపడుతోంది. డీఎస్సీకి ముందు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదల చేయడంలోనే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎలాగోలా టెట్‌ పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ ఇంతవరకూ ఫలితాల విడుదల ఊసెత్తడం లేదు. ప్రకటించిన షెడ్యూలు కంటే ముందుగానే పరీక్షలు ముగిసినా.. షెడ్యూలు ప్రకారం ఈనెల 14నే టెట్‌ ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్నా మౌనం దాల్చింది. తీరా 16న ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన అనంతరం, ఫలితాల విడుదల అంశంపై ఈసీని స్పష్టత కోరామని ప్రకటించింది. వాస్తవానికి ఎన్నికల కోడ్‌కు ముందే ఫలితాలు ఇస్తామని షెడ్యూలులో ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ దాన్ని ఎందుకు అనుసరించలేదనేది మాత్రం చెప్పడం లేదు. ఫిబ్రవరిలో డీఎస్సీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం.. కొత్తగా బీఈడీ చదివినవారి కోసం టెట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. టెట్‌ పూర్తయిన వెంటనే, డీఎస్సీ పరీక్షలు మొదలయ్యేలా షెడ్యూల్‌ రూపొందించింది. దాని ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు టెట్‌ నిర్వహించాలి. కానీ, ఎస్జీటీ పోస్టులకు అర్హతపై సృష్టించిన గందరగోళం కారణంగా మధ్యలో అర్హతలను మార్చాల్సి వచ్చింది. 51వేల మంది దరఖాస్తు చేసుకున్న తర్వాత టెట్‌లో కొన్ని పరీక్షలకు అనర్హులుగా మారారు. దాంతో మార్చి 9 వరకు జరగాల్సిన టెట్‌ పరీక్షలు, మార్చి 6తోనే ముగిశాయి. కాబట్టి ఫలితాలను మరింత ముందే ప్రకటించే అవకాశం ఏర్పడింది. కానీ తొలినుంచీ డీఎస్సీపై అనాసక్తితో ఉన్న ప్రభుత్వం టెట్‌ ఫలితాలను ఆలస్యం చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకొచ్చాక, ఈసీ అనుమతి అంటూ కొత్త సాకులు చెబుతోంది. కొత్తగా టెట్‌ రాసిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్షల షెడ్యూలు సమీపిస్తున్నా ఇప్పటికీ టెట్‌ ఫలితాలు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫీజులు వాడేసుకుని..

ప్రభుత్వం మార్చిన అర్హతల కారణంగా పరీక్షలకు అనర్హులుగా మారిన అభ్యర్థులు చెల్లించిన ఫీజుల విషయంలో పాఠశాల విద్యాశాఖ కక్కుర్తిగా వ్యవహరిస్తోంది. 51వేల మంది బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకుని, ఒక్కొక్కరు రూ.750 చొప్పున ఫీజులు చెల్లించారు. వారందరికీ ఫీజులు వెనక్కి ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించినా.. ఇప్పటివరకూ ఒక్క రూపాయి తిరిగివ్వలేదు. దాదాపు రూ.4కోట్ల ఫీజులను పాఠశాల విద్యాశాఖ సొంత అవసరాలకు వాడుకున్నట్లు అర్థమవుతోంది. అభ్యర్థులు టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్లు చేసినా స్పందించడం లేదు.

ఎన్నికల సమయంలో డీఎస్సీ కష్టమే!

కీలకమైన డీఎస్సీకి ముందు నిర్వహించిన టెట్‌ ఫలితాలనే సకాలంలో విడుదల చేయలేకపోయిన ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెట్‌ ఫలితాలకే ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం, ఇక డీఎస్సీని ఎలా నిర్వహించగలదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా, అందులో న్యాయ వివాదాలు ఏర్పడే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఎస్జీటీ పోస్టులకు అర్హత, టెట్‌.. డీఎస్సీకి మధ్య విరామం లేకుండా షెడ్యూలు లాంటి నిర్ణయాలను న్యాయస్థానం తప్పుబట్టింది. పాఠశాల విద్యాశాఖ కావాలనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని అభ్యర్థులు అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అర్హతల విషయంలో అన్నిసార్లు మార్పులు చేసి, ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లేలా చేయదనేది అభ్యర్థుల వాదన. ఎన్నికల సమయంలో ఏవైనా పోటీ పరీక్షలుంటే, ఇతర బోర్డులు వాటినే వాయిదా వేస్తున్నాయి. కానీ ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడే ఏకంగా నెల రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Updated Date - Mar 26 , 2024 | 03:51 AM