Share News

AP Politics: విజయసాయిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం.. ఆ తర్వాత సీన్ ఇదీ..!

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:16 AM

తాడేపల్లికి పిలిపించి మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డిపైన, ఐప్యాక్‌ ప్రతినిధిపైన సీఎం జగన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే..

AP Politics: విజయసాయిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం.. ఆ తర్వాత సీన్ ఇదీ..!

  • మాగుంట నా గడప తొక్కొద్దు!

  • ఆయన్ను పిలిపించి ఎందుకు మాట్లాడారు?

  • విజయసాయిరెడ్డిపై జగన్‌ ఫైర్‌

  • ఐప్యాక్‌ ప్రతినిధి రిషీ సింగ్‌పైనా!

  • అలిగి జగన్‌ను కలవకుండానే హైదరాబాద్‌ వెళ్లిన బాలినేని

(ఒంగోలు-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తన గడప తొక్కడానికి వీల్లేదని ముఖ్యమంత్రి జగన్‌ తెగేసిచెప్పారు. ఆయన టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయన్ను తాడేపల్లికి పిలిపించి మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డిపైన, ఐప్యాక్‌ ప్రతినిధిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే.. సీఎంను కలిసేందుకు విజయవాడలో వేచి ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలిగి ఆయన్ను కలవకుండానే హైదరాబాద్‌ వెళ్లిపోయారు. రమ్మని ఫోన్‌ చేసిన విజయసాయిరెడ్డికి నో అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లను విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శించాలని, రూ.180 కోట్లు డిపాజిట్‌ చేయాలని మాగుంటకు జగన్‌ షరతులు విధించడం, అందుకు ఆయన తిరస్కరించడం తెలిసిందే. సోమవారం సాయంత్రం మాగుంటను విజయవాడ పిలిచి ఐప్యాక్‌ ప్రతినిధి రిషీ సింగ్‌ చర్చలు జరిపారు. ఆ సందర్భంగా మీకెలాంటి షరతులూ పెట్టలేదని ఎంపీకి చెప్పారు. ఈ విషయం తెలిసి జగన్‌ మండిపడినట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం సీఎంను విజయసాయిరెడ్డి, ఐప్యాక్‌ ప్రతినిధి కలిశారు. మాగుంటను పిలిచి మాట్లాడడంపై జగన్‌ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. ఐప్యాక్‌ ప్రతినిఽధే మాట్లాడారని విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు. అయితే ఆయన సూచనతోనే తాము ముందుకెళ్లినట్లు ఐప్యాక్‌ ప్రతినిధి సీఎంకు చెప్పారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. ‘ఆ ముగ్గురినీ విమర్శించని మాగుంట నా గడప తొక్కాల్సిన అవసరం లేదు. ఆయన స్థానంలో పూచికపుల్లను పెట్టయినా గెలిపించుకోగలను’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇదే విషయం మాగుంటకు చేరవేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇది తెలిసి మాగుంట తీవ్రఅసంతృప్తికి గురైనట్లు తెలిసింది. ఇక తన దారి తను చూసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

Magunta-Srinivasa-Reddy.jpg

సీఎంను కలవని బాలినేని

ఇంకోవైపు.. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంను కలవకుండానే బుధవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రమే విజయవాడ వచ్చిన ఆయనకు మంగళవారం కూడా సీఎం నుంచి పిలుపురాలేదు. మంగళవారం మధ్యాహ్నం సీఎంవో అధికారి ధనుంజయరెడ్డిని కలిశారు. ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీకి భూసేకరణకు సీఎం ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల విషయంపై మాట్లాడారు. బుధవారం ఉదయానికి నిధులు కలెక్టర్‌ అకౌంట్‌లో పడతాయని ధనుంజయరెడ్డి ఇదివరకే హామీ ఇచ్చినట్లు తెలిసింది. తన సీటు విషయాన్ని ఖరారు చేయకపోగా.. ఇస్తానన్న నిధులు కూడా ఇవ్వకపోవడంతో బాలినేని విసిగిపోయారు. బుధవారం మధ్యాహ్నం విజయసాయిరెడ్డి ఆయనకు ఫోన్‌ చేశారు. మాగుంట విషయాన్ని వదిలేయాలని.. కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో మీటింగ్‌లు పెట్టాలని జగన్‌ ఆదేశించారని చెప్పినట్లు తెలిసింది. ‘నేను ఏ మీటింగ్‌కూ రాను.. మీ బాధలు మీరు పడండి.. నేను తిరిగి వెళ్లిపోతున్నాను’ అని చెప్పి బాలినేని హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అటు మాగుంట, ఇటు బాలినేని వ్యవహారం ముదురుపాకాన పడిన సమయంలో సీఎంవో నుంచి కొన్ని సంచలన ప్రతిపాదనలు బయటకు వచ్చాయి. ఒంగోలు ఎంపీగా మాగుంటకు బదులు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిని, ఒంగోలు అసెంబ్లీకి బాలినేని స్థానంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను రంగంలో దింపాలని ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. తాడేపల్లి నుంచే ఈ ప్రతిపాదనలు రావడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో మాగుంట, బాలినేని కలిసి ఉమ్మడిగా రాజకీయ నిర్ణయం తీసుకుంటారా.. మాగుంటను వద్దన్న సీఎం మరోసారి బాలినేనికి కబురు పంపుతారా అనేది వేచి చూడాలి.

Updated Date - Jan 11 , 2024 | 11:44 AM