వీఐపీ కాన్వాయ్ పేరుతో ట్రాఫిక్ ఆపొద్దు
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:01 AM
జగన్ హయాంలో జనం ట్రాఫిక్ నరకం అనుభవించారు. ఆ పరిస్థితిని కొత్త ప్రభుత్వంలో పునరావృతం రానీయరాదని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు తన భద్రతా సిబ్బందికి స్పష్టం చేశారు.

బారికేడ్లు, పరదాలు, షాపుల మూతకు స్వస్తి
ప్రధాన భద్రతాధికారికి చంద్రబాబు ఆదేశాలు
ఆ వెంటనే ఆయన ఆదేశాలు అమల్లోకి..
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జనం ట్రాఫిక్ నరకం అనుభవించారు. ఆ పరిస్థితిని కొత్త ప్రభుత్వంలో పునరావృతం రానీయరాదని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు తన భద్రతా సిబ్బందికి స్పష్టం చేశారు. తన కాన్వాయ్ సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు, అదీ అతి తక్కువ సమయం మాత్రమే వాహనాలను ఆపాలని ప్రధాన భద్రతాధికారిని(సీఎ్‌సవో) ఆయన ఆదేశించారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గురువారం ఢిల్లీకి బయలుదేరిన ఆయన తన భదత్రా సిబ్బందికి ఈ విధమైన ఆదేశాలు జారీచేశారు. బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడలకు ఇకపై స్వస్తి చెప్పాలని సృష్టం చేశారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపి వేసే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ వెంటనే ఆయన ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఉండవల్లి నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో... గుంటూరు ఎస్పీ, విజయవాడ సీపీలను భద్రతా అధికారులను ఈ మేరకు అప్రమత్తం చేశారు.