Share News

ఆ ఉద్యోగులను తొలగించొద్దు

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:58 AM

2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసి, తాజాగా నిర్వహించాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిన 167 మంది ఉద్యోగులకు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది.

ఆ ఉద్యోగులను తొలగించొద్దు

‘2018 గ్రూప్‌-1’ కేసులో హైకోర్టు ఆదేశం

మెయిన్స్‌ పరీక్ష రద్దును సవాల్‌ చేస్తూ..

దాఖలైన అప్పీళ్లపై విచారణ 27కి వాయిదా

ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని..

ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్న ధర్మాసనం

167 మందికి తాత్కాలిక ఉపశమనం

అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసి, తాజాగా నిర్వహించాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిన 167 మంది ఉద్యోగులకు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. 27 వరకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొందినవారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. గ్రూప్‌-1 వ్యవహారంతో ముడిపడి ఉన్న అన్ని అప్పీళ్లపై విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులోని ఏ అంశం జోలికి ధర్మాసనం వెళ్లలేదు. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డిజిటల్‌ మూల్యాంకనంలో 326 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చిందని, ఆ తర్వాత నిర్వహించిన మాన్యువల్‌ మూల్యాంకనంలో తొలుత ఎంపికైన 326లో.. 202 మందిని అనర్హులుగా పేర్కొన్నారని అన్నారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు పలు దఫాలుగా విచారణ జరిపింది. మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ కొనసాగించేందుకు ఏపీపీఎస్సీకి అనుమతిస్తూ 2022 జూన్‌ 24న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఫలితాల ప్రకటన, పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చినట్లైతే.. అవి ప్రధాన వ్యాజ్యాలలో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయిని స్పష్టం చేసింది.

ప్రధాన వ్యాజ్యాలపై తుది విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జవాబు పత్రాలను రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయడం నిబంధనలకు విరుద్ధమని ప్రకటించారు. గ్రూప్‌-1 మెయిన్స్‌లో అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ ఇచ్చిన జాబితాను రద్దు చేశారు. తాజాగా మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ, మరికొందరు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. ఆ అప్పీళ్లు గురువారం విచారణకు రాగా సింగిల్‌ జడ్జి వద్ద పిటిషనర్ల తరఫున జంధ్యాల రవిశంకర్‌, జె.సుధీర్‌ వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి తీర్పుతో తాము కూడా నష్టపోయామన్నారు. తీర్పులోని కొంతభాగాన్ని సవాల్‌ చేస్తూ అప్పీళ్లు వేశామన్నారు. మొదటిసారి జరిపిన మాన్యువల్‌ మూల్యాంకనాన్ని సింగిల్‌ జడ్జి రద్దు చేయడంపై అభ్యంతరం తెలిపారు. మొదటిసారి చేసిన మాన్యువల్‌ మూల్యాంకనం ఫలితాల ఆధారంగా అర్హులను గుర్తించాలని కోరారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే విధిస్తే అప్పీళ్ల విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. ఏపీపీఎస్సీ, పిటిషనర్లు, ఇప్పటికే ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లు అన్నింటినీ సమగ్రంగా విచారించి నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. తాము ఎలాంటి కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేయబోమని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్థించారు. ఏపీపీఎస్సీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ... సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఏపీపీఎస్సీ, పిటిషనర్లు రెండు పక్షాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఇప్పటికే ఉద్యోగాలు పొందిన 167 మంది అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. వీరికి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులతో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారిపై తక్షణ ప్రభావం పడుతుందని గుర్తుచేసింది. అప్పీళ్లపై విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్న నేపథ్యంలో వీరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అప్పటివరకు ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ఆదేశాలిస్తున్నామని పేర్కొంది.

Updated Date - Mar 22 , 2024 | 03:58 AM