Share News

వలంటీర్లను తప్పుబట్టం!

ABN , Publish Date - Apr 07 , 2024 | 02:51 AM

రాష్ట్రంలోని వలంటీర్లను తాము తప్పుబట్టడం లేదని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌, సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ(సీఎ్‌ఫడీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు.

వలంటీర్లను తప్పుబట్టం!

చాలీచాలని జీతం ఇచ్చి రాజకీయాలకు వాడుతున్నారు

ప్రస్తుత ప్రభుత్వం సంపద సృష్టించకపోగా భారం మోపింది

సీఎ్‌ఫడీ చర్చలో నిమ్మగడ్డ వ్యాఖ్యలు

వలంటీర్లపై అనేక ఫిర్యాదులు: ఎల్వీ

ప్రభుత్వాలు పెట్టుబడి వ్యయం పెంచాలి

‘ఎకనమిక్‌ వీక్లీ’ ఎడిటర్‌ మహేంద్రదేవ్‌

విజయవాడ, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వలంటీర్లను తాము తప్పుబట్టడం లేదని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌, సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ(సీఎ్‌ఫడీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీబీటీ విధానంలోనే లబ్ధిదారులకు సొమ్ములు ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారని చెప్పారు. ‘‘పెన్షన్లు ఇవ్వడానికి వలంటీర్లు ఉండాలా? వారు లేకపోతే ఇవ్వలేరా? అని హైకోర్టు అడిగితే ఈ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. డీబీటీ స్కీంలకు ఎలాంటి మధ్యవర్తిత్వం ఉండకూడదు. దేశం మొత్తం మీద రాష్ట్రంలోనే నిరుద్యోగం అధికంగా ఉంది. దీన్ని ఉపయోగించుకుని చాలీచాలని వేతనం ఇచ్చి వలంటీర్లను నియమించారు. దీనిలో చేరిన వారు వలంటీర్లుగా ఉండలేరు. అలాగని బయటకు వెళ్లలేరు. ఇప్పుడు వారిని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. వలంటీర్లను మేం తప్పుబట్టడం లేదు. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వలంటీర్లను ఆ ఎన్నికల్లో భాగస్వాములను చేయవద్దని రాజకీయ పక్షాలు ఎన్నికల సంఘానికి విన్నవించాయి. ఆనాడే వలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు స్పందించింది. వలంటీర్లను కొనసాగిస్తామని అధికార పార్టీ చెబుతుండగా, మార్పులతో తామూ కొనసాగిస్తామని ప్రతిపక్షం చెప్పడం రాజకీయ అవకాశవాదం’’ అని రమేశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. సీఎ్‌ఫడీ ఆధ్వర్యంలో ‘అభివృద్ధితో సంక్షేమ-సుపరిపాలనకు సవాళ్లు’ అనే అంశంపై శనివారం విజయవాడలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఒక్కో వ్యక్తిపై రూ.2 లక్షల అప్పు ఉందని తెలిపారు. సీఎ్‌ఫడీ చేసిన సూచనతోనే వలంటీర్లను పక్కన పెట్టాలని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంపద సృష్టించడం లేదని, భారం మాత్రమే మోపుతోందని విమర్శించారు. వలంటీర్ల ద్వారా ప్రజల జుట్టును చేతుల్లో పెట్టుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. వలంటీర్లు రాజీనామా చేసి ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోవడం సమర్థనీయం కాదన్నారు.

వలంటీర్లపై ఫిర్యాదులు: ఎల్వీ

మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఎన్నికల్లో వలంటీర్ల ప్రభావం ఉంటుందని తాము సీఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వలంటీర్ల పనితీరుపై అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. పథకాలు అందుకునే వారి భావాలను వలంటీర్లు ప్రభావితం చేసే స్థాయికి వచ్చారని ఆరోపించారు. ‘‘మేం ఎవరి మోచేతి నీళ్లూ తాగడం లేదు. మా ఆలోచన అంతా అభివృద్ధి కోసమే. ఒక రాజకీయ పార్టీకి అండగా ఉండే అధికారులు చింతించాల్సిన రోజు వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని కొంత మంది అభాసుపాలు చేస్తున్నారు. కలెక్టర్‌ నుంచి సీఎస్‌ వరకు అంతా నిష్పక్షపాతంగా ఉండాలి’’ అని సూచించారు. సీఎ్‌ఫడీలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఎవరూ లేరన్నారు. వలంటీర్లను సీఈసీ వద్దని చెప్పిన తర్వాత అధికారులు తమను నిందించడం సరికాదన్నారు.

పెట్టుబడి సాయం పెంచాలి

చర్చా కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ‘ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ’ సంపాదకుడు మహేంద్రదేవ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు పెట్టుబడి వ్యయాన్ని పెంచాలని, తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఆదాయ మార్గాలు పెరుగుతాయన్నారు. దేశంలో స్వర్ణ చతుర్భుజిపై పెట్టుబడి పెట్టిన తర్వాత అద్భుతమైన జాతీయ రహదారులు ఏర్పడ్డాయన్నారు. వాటికి ఇరువైపులా వ్యాపారాలు పెరిగాయని వివరించారు. ప్రజలకు ఉచితాలు అందజేయడం కంటే పెట్టుబడి వ్యయం పెంచడంపై ఎక్కువగా దృష్టి సారించాలని చెప్పారు.

Updated Date - Apr 07 , 2024 | 02:51 AM