డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:42 AM
పాఠశాల విద్యాశాఖలో పలు పథకాల పేర్లు మారుస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

జగనన్న గోరుముద్ద పేరు మార్చిన కూటమి ప్రభుత్వం
కలాం స్ఫూర్తితో విద్యా పథకాలకు కొత్త పేర్లు... ఎక్స్‌లో మంత్రి లోకేశ్
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖలో పలు పథకాల పేర్లు మారుస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని, మన బడి - నాడు నేడును మన బడి - మన భవిష్యత్తు అని, స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్ష అని, జగనన్న ఆణిముత్యాలును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని మారుస్తున్నట్లు శనివారం ఎక్స్‌లో వివరించారు. గత ఐదేళ్లలో భ్రష్టుపట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నారు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అందులో భాగంగానే గత ప్రభుత్వం అప్పటి సీఎం పేరుతో పెట్టిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నామన్నారు. విద్యా రంగంలో విశేష సేవలు అందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లు పెట్టామన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్లు తెలిపారు.