Share News

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా..!

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:54 PM

మరో ఒకటిన్నర నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు డిప్యూటీ సీఎం అంజద్‌బాషా గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ఓటు అడిగేందుకు ఇంటింటికీ వెళుతున్నారు.

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా..!

డిప్యూటీ సీఎంను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు ?

పార్టీ జెండా మోసి ఆర్థికంగా దివాళా తీసినవారిని ఆదుకున్నారా..?

కార్పొరేటర్ల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరవుతున్న డిప్యూటీ సీఎం

జగన్‌ను సీఎం చేసేందుకు డివిజన్లలో తిరగండి

కార్పొరేటర్ల చుట్టూ తిరుగుతున్న వైనం

‘‘అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తోంది. ఇంతవరకు కార్పొరేటర్ల బాగోగులు చూసుకోలేదు. మా సమస్యలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల టైం కావడంతో మా దగ్గరకు వచ్చారా..’’ అంటూ కొందరు కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం అంజద్‌బాషాను నిలదీ స్తున్నారని సమాచారం. దాదాపు ఐదేళ్లుగా ఏనాడూ తమ ఇళ్లకు రాలేదని, తమ బాగోగులు చూడలేదని.. ఎన్నికలకు నెలముందు తమ ఇళ్లకు రావడం ఎందుకంటూ ప్రశ్నించారని అంటున్నారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం.. పార్టీ జెండా మోసి ఆర్థికంగా నష్టపోయాం.. అధికారం చేపట్టిన ఈ ఐదేళ్లలో మాకేమైనా చేశారా అంటూ వారు ప్రశ్నించడంతో డిప్యూటీ సీఎం అండ్‌ కో ఆందోళన చెందుతున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

(కడప-ఆంధ్రజ్యోతి): మరో ఒకటిన్నర నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు డిప్యూటీ సీఎం అంజద్‌బాషా గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ఓటు అడిగేందుకు ఇంటింటికీ వెళుతున్నారు. అయితే గత ఎన్నికల్లో కీ రోల్‌ పోషించి చురుగ్గా ఉన్న కొందరు కార్పొరేటర్లు, ఇన్‌చార్జిలు కొన్ని నెలలుగా ముఖం చాటేశారు. ఎన్నికలవేళ కార్పొరేటర్లు ప్రచారాలకు దూరంగా ఉండడంతో డిప్యూటీ సీఎం నేరుగా వారి ఇళ్లకే వెళుతున్నారు. అయితే అక్కడ కొందరు కార్పొరేటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం చూసి ఆయన అవాక్కవుతున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కడప టీడీపీ ఇన్‌చార్జిగా ఆర్‌.మాధవీరెడ్డిని ప్రకటించారు. ఆమె అప్పటి నుంచి జనంలోకి దూసుకెళుతున్నారు. తొలిజాబితాలోనే కడప అభ్యర్థిగా ఆమెను ప్రకటించారు. ఆమె బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరిట కడప నగరంటో ఇంటింటికీ వెళుతున్నారు. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను, వైసీపీ హయాంలో కడపలో జరిగిన భూకబ్జాలు ఇతర వాటిని జనాల్లోకి తీసుకెళుతున్నారు. వైసీపీకి చెందిన పలువురిని టీడీపీలోకి చేర్చుకుంటూ వస్తున్నారు. దీన్ని డిప్యూటీ సీఎంతో పాటు వైసీపీ వర్గాలు తొలుత లైట్‌గా తీసుకున్నా.. ఇలా అయితే కడపలో ఫ్యాన్‌ రెక్కలు విరుగుతాయని భావించినట్లు చెబుతారు.

వైసీపీ నుంచే పర్సంటేజీలు

వైసీపీలో మళ్లీ టికెట్‌ ఇస్తే ముచ్చటగా మూడోసారి గెలవాలని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా భావిస్తున్నారు. గతంలో లాగా ఈసారి వార్‌ వన్‌సైడ్‌గా లేదు. ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి ఆర్‌.మాధవీరెడ్డి నేతృత్వంలో టీడీపీ బాగా బలం పుంజుకున్నట్లు వైసీీపీ వర్గాలు అంచనాకు వచ్చాయని చెబుతారు. దీంతో అలర్ట్‌ అయిన డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఇటీవలే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కీరోల్‌గా ఉన్న కొందరు కార్పొరేటర్లు, ఇన్‌చార్జిలు ఇటీవల పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ‘‘ఇప్పుడు మీరంతా పచ్చడి మెతుకులు తింటున్నారు.. కష్టాల్లో నా వెంట నడిచిన వారికి రేపు మన ప్రభుత్వం వస్తే బిర్యానీ తినిపిస్తా’’ అంటూ ఊరిస్తూ వచ్చారు. అందుకు తగ్గట్లుగానే 2019 ఎన్నికల్లో అంజద్‌బాషా గెలుపులో వీరంతా ప్రధానపాత్ర పోషించారు. జగన్‌ సీఎం, అంజద్‌బాషా డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇక అంతా మంచిరోజులే అనుకుని కార్పొరేటర్లు సంతోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. అయితే ఈ పనుల కేటాయింపుల్లో కూడా రూ.లక్షకు 8శాతం చొప్పున వైసీపీ కార్పొరేటర్ల నుంచే ‘పెద్దలు’ కొందరు పర్సంటేజీలు వసూలు చేయడం విమర్శలకు దారితీసింది. వైసీపీ గెలుపు కోసం కష్టపడిన కేడరు నుంచే పర్సంటేజీలు తీసుకోవడం వీరు జీర్ణించుకోలేకున్నారు.

ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చామా

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ఇటీవల కడప నగరంలో పర్యటిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం కీలకంగా వ్యవహరించిన కార్పొరేటర్లు, ఇన్‌చార్జిలు ఇటీవల సైలెంట్‌ అయిపోయారు. వారిని డిప్యూటీ సీఎం కలిసి బుజ్జగించే ప్రయత్నాలకు తెరలేపారని అంటారు. ఇప్పటి వరకు 1, 3, 8, 19, 49, 46, 40, 44, 35, 38 డివిజన్లతో పాటు మొత్తం 20కి పైగా డివిజన్లలో పర్యటిస్తూ సుమారు 20 మంది కార్పొరేటర్లను డిప్యూటీ సీఎం నేరుగా కలిశారంటారు. ఎందుకు మీరంతా సైలెంట్‌గా ఉంటున్నారు. జగన్‌ను సీఎం చేసేందుకు మీరంతా అన్ని డివిజన్లకు వెళ్లండి అని కోరగా పలువురు కార్పొరేటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైనట్లు తెలిసింది. ‘‘జగన్‌ సీఎం, మీరు డిప్యూటీ సీఎం అయి ఐదేళ్లు కావస్తోంది. ఇన్నాళ్లు మమ్మల్ని పట్టించుకోలేదు, మేం వచ్చినా కూడా పలికీపలకనట్లు ఉంటారు. చూసీచూడనట్లు ఉంటారు.. మీకోసం ఎంతో కష్టపడ్డాం. ఆర్థికంగా నష్టపోయాం. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల తరువాత ఇప్పుడు గుర్తుకు వచ్చామా’’ అంటూ కొందరు నిలదీసినట్లు చెబుతారు. ‘‘ఈ ఐదేళ్లలో మీకు భజన చేస్తున్న కొందరికే లబ్ధి చేకూర్చారు. పార్టీ కోసం జెండా పట్టుకుని నష్టపోయిన వారిని ఎవరినీ ఆదుకోలేదు. రాజీవ్‌మార్గ్‌ రహదారి విస్తరణ, రాజవ్‌పార్కు సుందరీకరణ, కలెక్టరేట్‌ రోడ్డు పనులు, క్రిష్ణాసర్కిల్‌ నుంచి దేవునికడ వెళ్లే రహదారి పనులు.. ఇలా కీలకమైన పనులన్నీ కొందరికే అప్పగించి కొందరికే లబ్ధి చేకూర్చారు. మాకేం చేశారు’’ అంటూ నిలదీయండతో ఆయన అవాక్కయ్యారంటారు. మట్టి ఇసుక, గ్రావెల్‌ పనులన్నీ కోటరీలో ఉన్నవారికే కట్టబెట్టారు. ఇప్పుడు మావద్దకు వచ్చారా అంటూ కొందరు అడగడంతో డిప్యూటీ సీఎం బిక్కముఖం వేసుకున్నారన్న ప్రచారం వైసీపీలో ఉంది. ఓ కార్పొరేటరు వద్దకు వెళ్లి ఎందుకు నీవు చురుగ్గా లేవు అనగా.. నేను చురుగ్గా పాల్గొనలేను... మీ అల్లుడిని ఇన్‌చార్జిగా పెట్టండి.. ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాం అంటూ తెగేసి చెప్పినట్లు సమాచారం. కార్పొరేటర్ల నుంచి ఊహించని విధంగా ప్రశ్నలు ఎదురవుతుండడంతో అంజద్‌బాషా అండ్‌ టీం ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న కొందరు కార్పొరేటర్లు, మాజీకార్పొరేటర్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడితో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో మాకేం చేశావ్‌, ఐదేళ్లకు గుర్తుకు వచ్చామా అంటూ కార్పొరేటర్లు ప్రశ్నించడంతో వారికి జవాబు చెప్పలేక డిప్యూటీ సీఎం నీళ్లు నములుతూ.. మనం మళ్లీ జగన్‌ను సీఎం చేసేందుకు అందరం కలసి పనిచేద్దామని చెబుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 06 , 2024 | 11:54 PM