Share News

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తీసుకోవాలా?

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:38 AM

‘ఇంటింటి ప్రచారానికీ అనుమతి తీసుకోవాలా?. కరపత్రాలు పంపిణీ చేసేందుకు కార్యకర్తలకు అనుమతి ఉండాలా?.

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తీసుకోవాలా?

గతంలో ఎప్పుడూ ఈ నిబంధన లేదు

పార్టీ కార్యాలయాల వద్ద జెండాలూ తొలగిస్తారా?

రాజకీయ పార్టీల అభ్యంతరం

సీఈవోతో భేటీలో తేల్చి చెప్పిన పార్టీలు

ఈసీ దృష్టికి తీసుకెళతానన్న సీఈవో

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘ఇంటింటి ప్రచారానికీ అనుమతి తీసుకోవాలా?. కరపత్రాలు పంపిణీ చేసేందుకు కార్యకర్తలకు అనుమతి ఉండాలా?. పార్టీ కార్యాలయాల వద్ద ఎప్పటి నుంచో ఉంటున్న జెండాలు, బ్యానర్లను తొలగించాలా?.. ఏమిటీ నిబంధనలు. గతంలో ఎప్పుడూ లేవు. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ లేవు. వీటిని అమలు చేయడం సాధ్యంకాదు’ అని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కు తేల్చి చెప్పాయి. మీ అభ్యంతరాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతానని సీఈవో వారికి హామీ ఇచ్చారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా మంగళవారం అమరావతి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసీపీ, బీఎస్పీ, సీపీఎం పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలపై అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమ అభ్యంతరాలను సీఈవో దృష్టికి తీసుకెళ్లిన పార్టీల నాయకులు, ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ వాటిని తెలిపారు.

అభ్యంతరం తెలిపాం: టీడీపీ

ఇంటింటికీ ప్రచారానికీ అనుమతి తీసుకోవాలనే నిబంధనపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఈసీ ఇచ్చిన దాంట్లో ఈ నిబంధన లేదని తెలిపింది. సీఈవో దృష్టికి తీసుకెళ్లిన అంశాలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాకు వివరించారు. ‘అడుగడుగునా అవినీతి, అధికార పార్టీ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. మీరు చర్యలు తీసుకోవడం లేదు. మీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎన్నికలు జరుగుతాయా?’ అని సీఈవోను టీడీపీ ప్రశ్నించింది. ఎన్నికల నిబంధనలన్నీ టీడీపీకే వర్తిస్తాయా.. వైసీపీకి వర్తించవా? అని నిలదీసింది. ‘అభ్యర్థులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారానికీ అనుమతి పొందాలనే నిబంధన పెట్టారు. కరపత్రాలు పంచేందుకూ అనుమతి తీసుకోవాలన్నారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా నిబంధనలు లేవు. 2023 డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ నిబంధనలు లేవు. ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం అభ్యంతరకరం. కేంద్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల్లోనూ ఈ నిబంధనలు లేవు. ఈ నిబంధనపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం’ అని వర్ల చెప్పారు.

ఇంటింటి ప్రచారానికీ అనుమతులా?: సీపీఎం

రాజకీయ పార్టీలు ఇంటింటికి ప్రచారం చేసేందుకు అనుమతి తీసుకోవాలని సీఈవో నిబంధనల్లో చెప్పారని దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు చెప్పారు. దీనివల్ల అన్ని పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటాయన్నారు.

ఈ నిబంధనలు గతంలో లేవు: వైసీపీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతారు. కరపత్రాలు పంపిణీ చేస్తారు. ఇందుకు అనుమతి తీసుకోవాలని సీఈవో చెప్పారు. దీనిపై అభ్యంతరం తెలిపామని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. ‘నియోజవర్గంలో తిరగడానికి అభ్యర్థి అనుమతి తీసుకుంటారు. పార్టీ యంత్రాంగం అంతా ప్రతి డివిజనల్‌లో తిరగడానికి అనుమతి తీసుకోవాలంటే కష్టం’ అని విష్ణు అన్నారు. ఎన్నికల్లో ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయాలు, అభ్యర్థుల కార్యాలయాల్లో కూడా బ్యానర్లు, హోర్డింగ్‌లు పెట్టుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరామని, జిల్లా అధికారులకు ఆదేశాలు ఇస్తామని సీఈవో చెప్పారన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 02:38 AM