Share News

సజ్జల తీరుతో శాంతిభద్రతలకు విఘాతం

ABN , Publish Date - May 25 , 2024 | 03:56 AM

మాచర్ల నియోజకవ ర్గంలో మార్పు మొదలైందని, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణచి వేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.

సజ్జల తీరుతో శాంతిభద్రతలకు విఘాతం

టీడీపీ నేతలు వర్ల, దేవినేని ధ్వజం

అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): మాచర్ల నియోజకవ ర్గంలో మార్పు మొదలైందని, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణచి వేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. పిన్నెల్లిని నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారని, జనం నాడీ తెలిసినందునే పిన్నెల్లి అరాచకానికి తెగబడి, ఈవీఎంను పగలగొట్టారని చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, మన్నవ సుబ్బారావు రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారికి పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. సున్నిత ప్రాంతం అని తెలిసినప్పటికీ మాచర్లలో కేంద్ర బలగాలు ఎందుకు విధుల్లో లేరు? ఈసీ నిర్లక్ష్యం వల్ల జరిగిందా? పోలీసుల అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా? పిన్నెల్లి ఒత్తిడి మేరకు నియమించలేదా? అని ప్రశ్నించారు. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని ఆ విప్లవమే పిన్నెల్లి అరాచకాలను పాతిపెట్టిందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని, సీఎం జగన్‌ అరాచక సామ్రాజ్యాన్ని కూలదోయనుందన్నారు.

సీఎం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. ఆయన మాటలతో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారన్నారు. జగన్‌ లండన్‌లో పెద్ద భవనం కొన్నట్లు తెలిసిందని, మకాం లండన్‌కు మారుతుందేమోనన్నారు. దేవినేని మాట్లాడుతూ.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో ప్రతి 500 ఓట్లకుఒక టేబుల్‌ వేయాలని, అధికారుల తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్ల వల్ల ఓటు చెల్లకుండా చేయవద్దని, గతవారం నుంచి సీఈవో దృష్టికి తీసుకొస్తున్నామని అన్నారు. పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం, నరసింగగారిపల్లి, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి స్వస్థలం అని, పోలింగ్‌ రోజు ఆయన అక్కడి బూత్‌లోకి వెళ్లి టీడీపీ ఏజెంట్‌ను బెదిరించారన్నారు. తాము బూత్‌ను పరిశీలించి వస్తుంటే 200 మంది తమపై కర్రలు కట్టెలతో దాడి చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అందుకే సీఈవోకి ఫిర్యాదు చేశామన్నారు.

Updated Date - May 25 , 2024 | 07:19 AM