Share News

టీడీపీ బీ-ఫారాల పంపిణీ పూర్తి

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:11 AM

తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులందరికీ బీ-ఫారాల పంపిణీ పూర్తి చేసింది.

టీడీపీ బీ-ఫారాల పంపిణీ పూర్తి

చివరి ముగ్గురు అభ్యర్థులకూ అందచేసిన చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులందరికీ బీ-ఫారాల పంపిణీ పూర్తి చేసింది. చివరగా మిగిలిపోయిన ముగ్గురికి పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం బీ-ఫారాలు అందజేశారు. దీంతో పార్టీ తరఫున పోటీ చేస్తున్న మొత్తం 144 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 17 మంది లోక్‌సభ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ పూర్తయిందని టీడీపీ వర్గాలు తెలిపాయి. దెందులూరు, నరసరావుపేట, తంబళ్లపల్లి అభ్యర్థులు చింతమనేని ప్రభాకర్‌, డాక్టర్‌ చదలవాడ అరవింద్‌ బాబు, జయచంద్రారెడ్డిని చంద్రబాబు బుధవారం శ్రీకాకుళానికి పిలిపించి బీ-ఫారాలు ఇచ్చారు. వీరిలో తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డిని కొనసాగించాలా వద్దా అన్నదానిపై పార్టీలో కొంత తర్జనభర్జన జరిగింది. ఆయన ఇప్పటికే ప్రచారం కూ డా మొదలు పెట్టినందున, ఈ దశలో మార్పు సరికాదన్న యోచనతో కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నారు. అనపర్తి సీటును బీజేపీకి ఇచ్చే విషయంలో కొంత సందిగ్ధత నెలకొనడంతో దెందులూరు టికెట్‌ ఆపారు. అనపర్తిలో స్పష్టత రాగానే దెందులూరు అభ్యర్థికి బీ-ఫారం ఇచ్చేశారు. నరసరావుపేట అభ్యర్థి విషయంలో కూడా కొంత ఊగిసలాట చోటు చేసుకున్నా చివరకు అరవింద్‌ బాబుకే ఖరారైంది. బీ-ఫారాల పంపిణీకి ముందు ఐదు ని యోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ మార్చింది. వీటిలో మాడుగుల, పాడేరు, వెంకటగిరి, మడకశిర, ఉండి ఉన్నాయి. ఈ ఐదు చోట్లా పాత అభ్యర్థులను మార్చి కొత్తవారికి ఇచ్చారు. రాష్ట్రంలో ఇక మార్పుచేర్పులు లేనట్లేనని, బీ-ఫారం పొందిన అభ్యర్థులే పోటీలో కొనసాగుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 25 , 2024 | 04:11 AM