Share News

నేటి నుంచి పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:22 AM

రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. సెర్ప్‌ సీఈవో గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

నేటి నుంచి పింఛన్ల పంపిణీ

గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీకి ఏర్పాట్లు: ప్రభుత్వం

తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి, దివ్యాంగులు, వితంతువులకు ఇంటికే

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. సెర్ప్‌ సీఈవో గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నుంచి 4 రోజుల పాటు(ఈనెల 6 వరకు) గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి, వితంతువులకు ఇంటివద్దే పింఛను సొమ్ము ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో లబ్ధిదారులనే గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకునే విధానం ఖరారు చేసినట్టు పేర్కొంది. ఏప్రిల్‌, మే ఈ రెండు నెలలు ఇదే విధానం అమలవుతుందని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తాయని, పింఛన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది.

Updated Date - Apr 03 , 2024 | 04:22 AM