Share News

దూర విద్య దూరం!

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:24 AM

జగన్‌ ప్రభు త్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని దూర విద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

దూర విద్య దూరం!

జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం... 30 వేల మంది విద్యార్థుల్లో అయోమయం

సేవలు ఆపేస్తామన్న అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ

గత ఏడాది సెప్టెంబరులోనే రాష్ట్రానికి సమాచారం

అయినా పట్టించుకోని వైసీపీ సర్కారు

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభు త్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని దూర విద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పదో షెడ్యూలు లో ఉన్న హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సేవలు ఆంధ్రప్రదేశ్‌కు నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరులోనే ఏపీకి లేఖ రాసింది. కానీ ప్రత్యామ్నా య ఏర్పాట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన నిర్ల క్ష్యం ప్రభావం ఇప్పుడు వేలాది మంది విద్యార్థులపై పడింది. ఇప్పటికే చదువుతున్న వారికి సేవలు దూరం కావడం ఒకెత్తు అయితే, కొత్తగా దూర విద్యా కోర్సుల్లో చేరాలనుకునే వారికి అసలు అవకాశమే లేకుండా పో యే దుస్థితి నెలకొంది. దూర విద్యా కోర్సులు అందించే అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పదో షెడ్యూలులో ఉన్నందున విభజన కాలేదు. రాష్ట్ర విభజన నాటి నుం చీ రెండు రాష్ర్టాలకు హైదరాబాద్‌లో ఉన్న యూనివర్సిటీనే సేవలు అందిస్తోంది. ఏపీలో ఓపెన్‌ యూనివర్సిటీకి 76 స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. సుమారు 30 వేల మంది విద్యార్థులు వాటిలో చదువుతున్నారు. అయితే విభజన జరిగి పదేళ్లు అవుతున్నందున 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని స్టడీ సర్కిళ్లకు సేవలు అందించలేమని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి గత సెప్టెంబరులోనే ఏపీకి లేఖ రాశారు. అంతకముందే వర్సిటీ విభజనకు కమిటీలు వేసిన ఏపీ ఉన్నత విద్యాశాఖ, ఒకవేళ సేవలు ఆపేస్తే ప్రత్యామ్నాయంగా ఏంచేయాలనే దానిని పట్టించుకోలేదు. రాష్ట్రంలో యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జె ట్‌ సమావేశాలు జరిగినా ఓపెన్‌ యూనివర్సిటీ ప్రస్తావన కూడా చేయలేదు. తీరా ఎన్నికల కోడ్‌ సమీపించాక హడావుడిగా తిరుపతిలో యూనివర్సిటీ పెట్టాలనే ఫైలును ముందుకు తెచ్చింది. అసెంబ్లీ సమావేశా లు లేనందున ఆర్డినెన్స్‌ జారీకి చర్యలు ప్రారంభించిం ది. కేబినెట్‌ సమావేశం కూడా లేకపోవడంతో షార్ట్‌ సర్క్యులేషన్‌ విధానంలో ఈనెల 16న హడావుడిగా ఆమోదముద్ర వేయించారు. అదే రోజున ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. దీంతో ఈ ఫైలును ఈసీకి పంపారు. అప్పటినుంచీ పెండింగ్‌లో ఉంది.

30 వేల మందిపై ప్రభావం

అంబేద్కర్‌ యూనివర్సిటీ ఏపీకి సేవలు ఆపేస్తే విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటివరకూ 76 స్టడీ సర్కిళ్లలో తరగతులు, పరీక్షలు జరుగుతున్నాయి. ఒకవేళ ఏపీలో యూనివర్సిటీ ప్రారంభం కాకపోతే, తప్పని పరిస్థితుల్లో తెలంగాణ సేవలు అందించినా వాటిని పరిమితం చేసే అవకాశం ఉంది. అలాగే తన పరిధిలో లేని ప్రాంతానికి ఏదైనా యూనివర్సిటీ సేవ లు అందిస్తే, తద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. ఇవన్నీ ఏపీ విద్యార్థులకు ప్రతికూలంగా మారనున్నాయి. ఈ ప్రభావం ప్రస్తుతం చదువుతున్న 30వేల మందిపై వెంటనే పడుతుంది. అలాగే కొత్తగా కోర్సుల్లో చేరాలనుకునే వారికి వేరే దారి లేకుండా పోతుంది.

సొంత పనులకే దోస్తీ

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో చెట్టాపట్టాలేసుకున్నట్టుగా స్నేహం చేసింది. అంత మంచి వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకు చెందిన అంశాల్లో ఒక్కదాన్ని కూడా జగన్‌ సాధించలేకపోయారు. యూనివర్సిటీలు, తెలుగు అకాడమీ, ఉన్నత విద్యామండలి తదితర సంస్థల విభజనను పట్టించుకోలేదు. జగన్‌ చొరవ చూపి ఉంటే ఓపెన్‌ యూనివర్సిటీ కొలిక్కి వచ్చేది.

Updated Date - Apr 03 , 2024 | 03:24 AM