Share News

వైసీపీ ఐపీఎ్‌సలకు భంగపాటు

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:42 AM

ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు ఉంటానన్న జగన్‌ అండ చూసుకుని మిడిసిపడిన ఆ అధికారులకు ఇప్పుడు పగలే చుక్కలు కనిపించడం మొదలైంది. వైసీపీకి వత్తాసు పలికి,

వైసీపీ ఐపీఎ్‌సలకు భంగపాటు

పీఎ్‌సఆర్‌, సంజయ్‌లకు దొరకని బాబు దర్శనం

గేటు కూడా దాటనీయని సెక్యూరిటీ సిబ్బంది

నిఘా అధిపతిగా విపక్షాలపై పీఎ్‌సఆర్‌ వేధింపులు

ప్రభుత్వం మారగానే మొదలైన ‘సినిమా’

గేటు వద్దే ఆపేసిన సెక్యూరిటీ, వెనుదిరిగిన పీఎ్‌సఆర్‌

సెలవుకు యత్నం.. వీల్లేదనడంతో రెండేళ్ల ముందే

సర్వీసు నుంచి తప్పుకొనేందుకు యోచన

తప్పుడు కేసులు పెట్టిన సీఐడీ సంజయ్‌కూ నో ఎంట్రీ

అడ్డుపెట్టిన కారును బలవంతంగా తీయించిన పోలీస్‌

అర్ధరాత్రి బాబును అరెస్టు చేసిన కొల్లి విలవిల

జగన్‌ హయాంలో మూడు పోస్టులు.. అవన్నీ పీకివేత

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు ఉంటానన్న జగన్‌ అండ చూసుకుని మిడిసిపడిన ఆ అధికారులకు ఇప్పుడు పగలే చుక్కలు కనిపించడం మొదలైంది. వైసీపీకి వత్తాసు పలికి, తప్పుడు కేసులు పెట్టి, వేధించిన ప్రతిపక్ష నాయకుడే ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతుండటంతో వారు ఇరకాటంలో పడిపోయారు. చంద్రబాబును ఆయన నివాసంలో కలిసేందుకు ప్రయత్నించిన ‘ఏకపక్ష ఖాకీ’లకు భంగపాటు ఎదురైంది. నిఘా మాజీ చీఫ్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, తప్పుడు కేసులు పెట్టడంలో కీలక పాత్ర పోషించి ఢిల్లీ వరకూ చంద్రబాబు పరువు తీసేందుకు యత్నించిన సీఐడీ ఏడీజీ సంజయ్‌, ఎందుకు అరెస్టు చేస్తున్నారో కనీసం నోటీసు ఇవ్వకుండా అర్ధరాత్రి 74ఏళ్ల వయసులో చంద్రబాబును అరెస్టు చేసిన కొల్లి రఘురామిరెడ్డికి షాక్‌ తగిలింది. ఆంజనేయులు చంద్రబాబును కలిసేందుకు ముందుగా అపాయింట్మెంట్‌ కూడా తీసుకోకుండా ఉదయం నేరుగా ఆయన నివాసానికి వచ్చారు. కరకట్టపైన సెక్యూరిటీ ఆయన వాహనాన్ని చూసి సీనియర్‌ ఐపీఎస్‌ అనే గౌరవంతో అనుమతించారు. అయితే రెండో గేటు వద్ద అనుమతి లేనిదే పంపలేమంటూ అడ్డుకున్నారు. లోపల కనుక్కోండి అంటూ పీఎ్‌సఆర్‌ సూచించడంతో, చంద్రబాబు చీఫ్‌ సెక్యూరిటీ అధికారిని వారు సంప్రదించారు. ఆ తర్వాత.. ‘అపాయింట్మెంట్‌ ఉంటేనే అనుమతించమన్నారు సర్‌’ అంటూ ఆయనను సిబ్బంది వెనక్కి పంపించివేశారు.

కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన 2019లో జగన్‌ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి తిరిగొచ్చారు. రవాణా శాఖ కమిషనర్‌గా జేసీ, కోడెల కుటుంబాలను తీవ్ర వేధింపులకు గురిచేశారు. అనంతరం ఏసీబీ డీజీగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విపక్ష ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను భయానక పద్ధతుల్లో అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా చంద్రబాబు, లోకేశ్‌ మొదలు ప్రతిపక్షాలను వేధించడమే ధ్యేయంగా పనిచేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా జగన్‌ గెలుపుకోసం శక్తివంచన లేకుండా తెరచాటు ప్రయత్నాలు చేశారు. పసిగట్టిన ఎన్నికల కమిషన్‌ ఈడ్చి అవతల పడేయడంతో ఎలాంటి పోస్టింగ్‌ లేకుంగా పోయింది. రెండేళ్లకు పైగా సర్వీసు ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్థమయ్యారని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముందూ వెనుకా చూసుకోకుండా చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడంలో కీలక పాత్ర పోషించిన సీఐడీ ఏడీజీ సంజయ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే విదేశాలకు వెళ్లిపోయేందుకు సెలవు పెట్టారు. చివరి నిమషంలో అది రద్దయింది. దీంతో గురువారం చంద్రబాబు నివాసానికి నేరుగా వచ్చేశారు. అయితే మొదటి గేటైన కరకట్ట గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది ఆయనను ఆపేసింది. అయినా చంద్రబాబు చీఫ్‌ సెక్యూరిటీ అధికారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ అక్కడే అడ్డంగా కారు ఆపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందంటూ కానిస్టేబుళ్లు సంజయ్‌ వాహనాన్ని బలవంతంగా పక్కకు తీయించారు.

కొల్లి విలవిల..

కొల్లి రఘురామిరెడ్డికి వైసీపీ ప్రభుత్వం ఏకంగా మూడు పోస్టులు ఇచ్చింది. ఐజీ ర్యాంకులో ఉన్న ఆయనకు డీజీ ర్యాంకు అధికారి పోస్టు అయిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా ఇచ్చారు. సీఐడీలో ఆర్థిక నేరాల విభాగం పరిధిలో ఏర్పాటు చేసిన సిట్‌కు అధిపతిని చేశారు. డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం డీజీగా మరో పోస్టు కట్టబెట్టారు. అన్నీ వదిలి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు వచ్చేయ్‌ అంటూ డీజీపీ గుప్తా బుధవారం పిలిపించడంతో విలవిలలాడిపోయారు. చంద్రబాబును కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి కూడా చంద్రబాబు అపాయింట్మెంట్‌ దొరకలేదు.

Updated Date - Jun 07 , 2024 | 06:59 AM