Share News

సజ్జలను పదవి నుంచితొలగించండి

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:44 AM

ప్రభుత్వ పదవిలో ఉన్న సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు.

సజ్జలను పదవి నుంచితొలగించండి

సలహాదారు రాజకీయ నేతలా మాట్లాడుతున్నారు

ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు

అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ పదవిలో ఉన్న సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ సలహాదారుడిగా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వ సంచిత నిధి నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అధికార పార్టీ పనులు చేస్తున్నారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయన సీఈఓ ముఖేశ్‌ కుమార్‌ మీనాకు సోమవారం లేఖ రాశారు. ‘ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 22న ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారు. ఐపీసీ 171, ప్రజాప్రాతినిధ్య చట్టం 123, 129, 134, 134 ఏ సెక్షన్ల ఉల్లంఘన చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు అయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలి’ అని అచ్చెన్న, ఈసీని కోరారు.

ఓటమి భయంతో వైసీపీ హింసా రాజకీయం

ఓటమి భయంతోనే వైసీపీ మూకలు హింసా రాజకీయాలు చేస్తూ పెట్రేగిపోతున్నాయని అచ్చెన్నాయుడు మరో ప్రకటనలో ఆరోపించారు. అధికార మదంతో టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు వైసీపీ కార్యాలయం తగలబడిన ఘటనలో టీడీపీ కార్యాకర్తలు కంచేటి సాయి, దండ నాగేంద్ర జానీలపై అక్రమ కేసులు బనాయించారన్నారు. వైసీపీ నేతలే కార్యాలయాన్ని తగలబెట్టి ఆ నెపాన్ని టీడీపీపై మోపడం దుర్మార్గమన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 03:44 AM