‘మద్దిపాటి’కి అసమ్మతి పోటు!
ABN , Publish Date - Mar 24 , 2024 | 03:12 AM
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని గోపాలపురం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి సద్దుమణగలేదు.
గోపాలపురం టీడీపీలో సద్దుమణగని వర్గపోరు
అధిష్ఠానం వైఖరిపై ముళ్లపూడి కినుక
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని గోపాలపురం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి సద్దుమణగలేదు. అభ్యర్థి ఎంపిక విషయంలో సుమారు మూడేళ్ల నుంచి కొనసాగుతున్న వర్గపోరు ఇంకా రగులుతూనే ఉంది. అసెంబ్లీ అభ్యర్థిగా మద్దిపాటి వెంకట్రాజును టీడీపీ ఖరారు చేసినా ఇక్కడ అసమ్మతి వర్గం తమ పోరు మా నలేదు. అభ్యర్థిగా ఖరారైన వెంకట్రాజు అసమ్మతి నేతల వద్దకు వెళ్లి మాట్లాడినా ఎవరూ ఒప్పుకోవడంలేదు. దీని కి అనేక కారణాలు. అందులో ఒకటి.. మద్దిపాటి వైఖరి కూడా కారణమే వాదన ఉంది. వెంకట్రాజు యువకుడు కావడం, పార్టీ అధిష్ఠానం వద్ద పనిచేసిన అనుభవంతో కొంత ఆదరణ సంపాదించుకున్నప్పటికీ, ఆయన వ్యవహార శైలి వల్ల ఇబ్బంది కలుగుతున్నట్టు తెలుస్తోంది. విద్యావంతుడైన వెంకట్రాజు రాష్ట్ర టీడీపీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు దగ్గరయ్యారు. రెండేళ్ల కిందటే ఆయనను గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇక్కడ వర్గపోరు పెరిగింది. 2019 ఎన్నికల్లోనే మద్దిపాటి వెంకట్రాజుకు సీటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావుకు అవకాశం లభించినా వైసీపీ గాలిలో ఓడిపోయారు. టికెట్ దక్కని వెంకట్రాజు అప్పటి నుంచి నియోజకవర్గంలో తనకం టూ వర్గాన్ని తయారు చేసుకున్నారు. ముప్పిడి కూడా ఎన్నడూ పార్టీని వదలలేదు. కానీ అధిష్ఠానానికి దగ్గరగా ఉన్న వెంకట్రాజు.. అసమ్మతి నేతలు లెక్కచేసేదేంటనే స్థాయికి ఎదిగారు. అన్ని ప్రాంతాల్లో తన వర్గానికి పెంచుకున్నారు. కానీ, అప్పటి వరకూ నియోజకవర్గంలో పట్టు సంపాదించుకున్న నేతలు ఆయనతో విభేదించడం గమనార్హం.
మద్దిపాటి వర్సెస్ ముళ్లపూడి
టీడీపీ సీనియర్‌నేత, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజుకు మధ్య పొసగ డం లేదు. ఈ నేపథ్యంలో ముప్పిడి వెంకటేశ్వరరావుకే గోపాలపురం టికెట్ ఇవ్వాలని ముళ్లపూడి అధిష్ఠానం దృష్టిలో పెట్టారు. ఇక్కడి అసమ్మతి వర్గం కూడా అనేక సార్లు అమరావతికి వెళ్లి, ముప్పిడికే టికెట్ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబు స్వయం గా ముళ్లపూడి బాపిరాజుతోపాటు, నియోజకవర్గంలోని గోపాలపురం, ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి మండల టీడీపీ అధ్యక్షులను, ఇద్దరు స్టేట్ కమిటీ సభ్యులను కూడా పిలిచి ఇక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. అక్కడ బాపిరాజుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్సీలో మరొకవర్గానికి చెందిన ఓ అధికారి ఉన్నారని, ఆయనకు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ఆయనకు సీటివ్వాలని, జిల్లాలో మాల వర్గానికి సీటు ఇచ్చినట్టు అవుతుందని బాపిరాజు చెప్పినట్టు సమాచారం. అయినా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మద్దిపాటి వెంకట్రాజు పేరునే చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో ముళ్లపూడి బాపిరాజు కినుక వహించారు. కానీ, టికెట్ ప్రకటించగానే బాపిరాజును కలిశానని, వారే కలిసి రావడంలేదని మద్దిపాటి చెబుతున్నారు.