Share News

ధర్మవరంలో వికసించిన కమలం

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:08 AM

నియోజకవర్గ చరిత్రలో తొలిసారి కమలం వికసించింది. ఎన్డీఏ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)తరపున పోటీ చేసిన సత్యకుమార్‌యాదవ్‌ విజయకేతనం ఎగురవేశారు. స్థానికేతరుడైనా ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ టికెట్‌ పొంది నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన 40రోజులకే ఓటరు అభిమానం చూరగొన్నారు.

ధర్మవరంలో వికసించిన కమలం
సత్యకుమార్‌

పరిటాల శ్రీరామ్‌ కృషితోనే గెలుపుబాట

ధర్మవరం, జూన 4: నియోజకవర్గ చరిత్రలో తొలిసారి కమలం వికసించింది. ఎన్డీఏ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ)తరపున పోటీ చేసిన సత్యకుమార్‌యాదవ్‌ విజయకేతనం ఎగురవేశారు. స్థానికేతరుడైనా ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ టికెట్‌ పొంది నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన 40రోజులకే ఓటరు అభిమానం చూరగొన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కేవలం 622 ఓట్లు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అండతోనే ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. పరిటాల కుటుంబానికి ధర్మవరం నియోజకవర్గంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈక్రమంలోనే పరిటాలశ్రీరామ్‌ ఎప్పటికప్పుడు శ్రేణులతో చర్చిస్తూ ధర్మవరంలో బీజేపీ గెలుపుకు కృషి చేశారు.

50 ఏళ్ల తరువాత ధర్మవరానికి బీసీ ఎమ్మెల్యే

ధర్మవరం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి మాత్రమే బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 50 ఏళ్ల కిందట పల్లెం వెంకటేశ విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్రవర్ణాలవారే ధర్మవరంలో ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 2024లో టీడీపీ బీజేపీతో కూటమి కట్టడం, అందులో భాగంగా అనూహ్యంగా బీసీ వర్గానికి చెందిన సత్యకుమార్‌యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. పరిటాల కుటుంబం, జనసేన నాయకుడు చిలకం మధుసూదనరెడ్డి సహకారంతో కేవలం 40 రోజుల ప్రచారంతోనే ఓటర్లను ఆకట్టుకుని విజయం సాధించడం గమనార్హం.

బోణీ కొట్టిన బీజేపీ

ధర్మవరంలో తొలి సారి బారతీయ జనతాపార్టీ అసెంబ్లీ ఎన్నికలలో బోణీ కొట్టింది. ధర్మవరం చరిత్రలోనే బీజేపీకి మొదటి విజయం దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరం నింపింది. నియోజకవర్గంలో 2,45,758 ఓట్లు ఉండగా 2,18,282 ఓట్లు పోలయ్యాయి. వీటిలోకూడా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌కు 1,04957 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి 1,01983 ఓట్లు లభించాయి. దీంతో 2974 ఓట్లు మెజారిటీ వచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ద్వారా వచ్చిన 760 మెజారిటీతో కలిపి సత్యకుమార్‌యాదవ్‌ 3734 ఓట్లు అధిక్యత లబించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1587 ఓట్లు బీజేపీకి రాగా వైసీపీకి 827, కాంగ్రె్‌సకు 36, ఇతరులకు 7 ఓట్లు రాగా మిగిలిన 798 ఓట్లు చెల్లనవిగా అధికారులు తేల్చేశారు. ధర్మవరం మండలం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలు వైసీపీకి జై కొట్టగా ధర్మవరం పట్టణ వాసులు మాత్రం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌కు అండగా నిలిచారు. వైసీపీకి 12 రౌండ్లలో ఓటర్లు ఆధిక్యం ఇవ్వగా బీజేపీకి 9రౌండ్లలో మాత్రమే ఓటర్లు ఆధిక్యత ఇచ్చారు. వైసీపీకి 1 నుంచి 10వ రౌండ్‌ వరకు, 20, 21, రౌండ్లలో మెజారిటీ రాగా బీజేపీకి 11 నుంచి 19వరౌండ్‌ వరకు మెజారిటీ వచ్చింది. బీజేపీకి 13,14,19,రౌండ్లలో భారీ మెజారిటీ వచ్చింది. 13వ రౌండ్‌లలో 3964 మెజారిటీ రాగా 14 వ రౌండ్‌లో 3942, 19వ రౌండ్‌లో 3454 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇదే వైసీిపీకి ఓటమిని ఖరారు చేసింది. వైసీపీకి మూడోరౌండ్‌లో వచ్చిన 2734 ఓట్లే అత్యధిక మెజారిటీ. 1767 మంది నోటాకు ఓటు వేశారు.

Updated Date - Jun 05 , 2024 | 12:08 AM