Share News

చిరుద్యోగుల్ని బలి చేశారు!

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:36 AM

గత ప్రభుత్వంలో మంత్రి రోజా, సీఎం పేషీలో పని చేసిన ధనుంజయరెడ్డి తాలూకు మనుషులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు.

చిరుద్యోగుల్ని బలి చేశారు!

రోజా, ధనుంజయరెడ్డి మనుషుల కోసమే ఇదంతా..

భూమి కౌలుకిస్తే అమ్మేసుకున్నారు

టీడీపీ గ్రీవెన్స్‌లో బావురుమన్న బాధితులు

అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో మంత్రి రోజా, సీఎం పేషీలో పని చేసిన ధనుంజయరెడ్డి తాలూకు మనుషులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు.. భవానీ ఐలాండ్‌లో పనిచేసే తమపై దొంగలుగా ముద్ర వేసి, ఉద్యోగాల నుంచి అన్యాయంగా తొలగించారని పలువురు చిరుద్యోగులు వాపోయారు. తప్పు చేసిన అధికారులను రక్షించేందుకు తమను బలి చేశారని పేర్కొన్నారు. ఉద్యోగం పోయిన బాధలో పరిచర్ల రవీంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, మనస్తాపంతో ఆరోగ్యం క్షీణించి, కత్తిరాశెట్టి రవిబాబు మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మళ్లీ ఉద్యోగ అవకాశాలు కల్పించి, న్యాయం చేయాలని బాధితులు మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో వేడుకున్నారు. గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యాలరావు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూమి కౌలుకిస్తే.. తమకు తెలియకుండా అమ్మేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మచిలీపట్నానికి చెందిన యక్కల లక్ష్మీకుమారి కోరారు. వాగు భూమిని ఆక్రమించి, పాసుపుస్తకం తెచ్చుకున్న వ్యక్తి, రైతులకు దారి లేకుండా ఇబ్బంది పెడుతున్నారని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఏలూరు జిల్లా అడవి నెక్కలం రైతులు ఫిర్యాదు చేశారు. ఆశ్రమం తరఫున నిత్యాన్నదానం చేస్తున్న స్థలాన్ని ఆక్రమించి, తమపై దౌర్జన్యం చేస్తున్నారని అనంతపురం కాశినాయన సేవా సమితి సభ్యుడు నాగేంద్ర ఫిర్యాదు చేశారు.

Updated Date - Nov 13 , 2024 | 04:36 AM