హోంగార్డు పోస్టులంటూ నకిలీ నోటిఫికేషన్
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:10 AM
ఏపీ పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగాల నియామకాలంటూ తన పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ లేఖపై డీజీపీ ద్వారకా తిరుమల రావు తీవ్రంగా స్పందించారు.
సృష్టించినోడి తాట తీస్తామన్న డీజీపీ
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఏపీ పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగాల నియామకాలంటూ తన పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ లేఖపై డీజీపీ ద్వారకా తిరుమల రావు తీవ్రంగా స్పందించారు. దాన్ని సృష్టించిన వ్యక్తి ఎక్కడున్నా అరెస్టు చేసి తాట తీస్తామని హెచ్చరించారు. ఈ లేఖను ఎవరైనా సోషల్ మీడియాలో పంచుకున్నా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వివరాలివీ.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ కార్యాలయం, పోలీసు హెడ్ క్వార్టర్స్, విజయవాడ’ పేరుతో లెటర్ సృష్టించారు. అందులో డీజీపీ ద్వారకా తిరుమల రావు పేరుతో నిరుద్యోగులకు ఒక ఆఫర్ ఇచ్చారు. రాష్ట్ర సివిల్ పోలీసు విభాగంలో సంగీతం బ్యాండ్ వాయించేందుకు హోంగార్డులుగా అభ్యర్థులను 2025 జనవరి 10న ప్లేస్‌మెంట్ నిర్వాహకుడు పి.శివ ద్వారా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ లేఖ శనివారం డీజీపీ దృష్టికి రావడంతో నకిలీ ఆఫర్ లెటర్ సృష్టించిన వారిని గుర్తించాలని ఆదేశించారు.