నిస్తేజంలో రవాణా శాఖ
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:24 AM
కోటిన్నరకు పైగా వాహనాలు... నాలుగున్నర వేల కోట్ల ఆదాయం... ఐదు కోట్ల మంది ప్రజలకు రవాణా సర్వీసులు...
ప్రజల సహనానికి ‘వాహన్-పరివాహన్’ పరీక్ష
ఆన్‌లైన్ సేవల్లో గందరగోళం.. ఆగిపోయిన ఈ ప్రగతి
ఆగిన ఐటీ ప్రాజెక్టులు.. తిరోగమనంలో రవాణా రంగం
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): కోటిన్నరకు పైగా వాహనాలు... నాలుగున్నర వేల కోట్ల ఆదాయం... ఐదు కోట్ల మంది ప్రజలకు రవాణా సర్వీసులు... వేలాది రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు.. ఇంతటి కీలకమైన రవాణా శాఖ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అనాథలా ఉంది. ఆన్‌లైన్‌లో సేవలు గందరగోళంగా తయారయ్యాయి. గత ప్రభుత్వం సర్వీసు చార్జీ చెల్లించక పోవడంతో ఐటీ విభాగం అస్తవ్యస్తమైంది.. వాహన్-పరివాహన్ మూడేళ్లుగా విజయవాడలో పైలట్‌కే పరిమితం కావడంతో సేవల పొందాలంటే తలప్రాణం తోకలోకి వస్తోంది. 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఏకంగా 83రకాలా ఆర్టీఏ సేవలు ఆన్‌లైన్లో అందేవి.. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ట్రాక్‌లో టెస్ట్ కోసం దరఖాస్తుదారు వెళ్లాలి. వాహనమైతే ఫిట్ నెస్ కోసమే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. మిగతా అనుమతులు, పన్నులు, ఇతర సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉండేవి. ప్రజలు వాటికి అలవాటు పడి ఇప్పుడు ఈ ప్రగతి ద్వారానే చెల్లింపులు, సర్వీసులు పొందేవారు. వాహన డీలర్లు, ఫైనాన్సియర్లు, ఉత్పత్తిదారులు అందరూ ఆన్‌లైన్‌లోనే అన్నీ పూర్తి చేసేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రగతిని ఆపేసింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్‌సీ కార్డుల సరఫరా నిలిపేసింది. రాష్ట్రంలో రవాణా రంగమే తిరోగమనం బాట పట్టింది. ఇటు రవాణా శాఖ కమిషనర్ ఎం.కె. సిన్హా హైదరాబాద్ నుంచి విజయవాడలోని ఆఫీసుకు మంగళవారం వచ్చి శుక్రవారం మధ్యాహ్నం నుంచే వెళ్లిపోతుండటం, సంబంధిత శాఖ మంత్రి కూడా సమీక్షించక పోవడంతో ఆ ప్రభావం రవాణా సిబ్బంది పనితీరుపై చూపుతోంది. లారీ యజమానులు కమిషనర్ వద్దకెళ్లి తమ సమస్య చెబితే అవన్నీ భరించాలి తప్పదని ఆయన సమాధనం ఇవ్వడంతో దిక్కుతోచక వెనక్కి తిరిగొచ్చారు. ఐటీ విభాగంలో మ్యాన్ పవర్ సర్వీసె్‌సకు డబ్బులు ఇవ్వకపోగా ఏడాది నుంచి కనీసం రెగ్యులర్ చేయట్లేదు. ఫలితంగా మెన్‌పవర్ సర్వీసులో ఉద్యోగులు మానేసి వెళ్లిపోతుండటంతో రవాణా సేవలకు బ్రేక్ పడింది.
ఐటీ ప్రాజెక్టులన్నీ బంద్...
రవాణా సేవలన్నీ ఇంటి నుంచే ప్రజలు పొందేందుకు ఆ శాఖలో ఐటీ విభాగం కీలకంగా పనిచేసేది. రవాణా వాహన యజమానులు తాత్కాలిక అనుమతి తీసుకోవాలన్నా, త్రైమాసిక పన్నులు చెల్లించాలన్నా ఐటీ విభాగం పనితీరుతోనే ముడిపడి ఉండేది. ఇలా ఐటీకి అధిక ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ప్రభుత్వంలో వాహన ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం కూడా కోట్లాది రూపాయల నిధులు తమ వాటాగా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి ఐదు కోట్ల రూపాయలు మూడేళ్ల క్రితమే విడుదల చేసింది. వైసీసీ ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయక పోవడంతో ఏ వాహనం ఎక్కడుందో తెలిసేలా ఆర్టీఏ తీసుకు రావాలనుకున్న ప్రాజెక్టు షెడ్డుకు చేరింది.
ఆగిపోయిన అభయ
ఆడబిడ్డలకు ఆపదొస్తే గన్ కన్నా ముందుగా జగన్ వస్తాడంటూ ఆయన అనుయాయులు పదే పదే చెప్పేవారు. అయితే ఆటోల్లో ప్రయాణించే మహిళలు, యువతుల రక్షణ కోసం అభయ(ఆటో, ట్యాక్సీ ప్రయాణాల్లో ఆపదొస్తే నొక్కే బటన్) ప్రాజెక్టు కోసం కేంద్రం 50కోట్లు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం కొంత మ్యాచింగ్ ఇచ్చేందుకు మనసురాక ప్రాజెక్టునే పట్టించుకోకుండా వదిలేసింది. ఇలాంటివి చూసుకోవాల్సిన ఐటీ విభాగం అధికారి శ్రీదేవి ఏడాది పాటు సెలవులో వెళ్లారు. డబ్బులివ్వకుంటే నేను సర్వీసు ఇవ్వలేనంటూ ఐటీ మెన్‌పవర్ కాంట్రాక్టరు గోడు వేల్లబోసుకొంటున్నట్లు సమాచారం. మరోవైపు వాహన్-పరివాహన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకుండానే ఈ ప్రగతి ఆపేయడంపై విజయవాడలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.